29, డిసెంబర్ 2010, బుధవారం

" ధర్మదండమనే పేరే యెందుకూ ??? "

ధర్మదండమనే పేరే యెందుకూ ? మరొకటి యెందుకు కాదూ ? కాకూడదూ అని ప్రశ్న !  కాదూ , కాకూడదూ అనే సమాధానం ....


ఆనాడెన్నడో  విజృంభించిన శూన్యవాద మిథ్యావాదాల ధాటికి , ప్రాచీన సనాతన ధర్మం తాళలేక , చిగురుటాకు వలె వణికిపోతూ , ఆర్ష పథానికి దారీ తెన్నూ కనపడక , నిస్సహాయమైన స్థితిలో , కాలూ చేయీ ఆడక , క్రుంగిపోతూన్న దశలో , యిదిగో నేనున్నానంటూ ఆర్త త్రాణపరాయణుడై , ఆపన్న శరణాగతితో , ధర్మ గ్లాని ని తప్పించడానికి,  ముక్తి మార్గ నిర్దేశానికి అవతరించిన సాక్షాత్తూ శంకరుడైన ఆ ఆదిశంకరాచార్యుల  చేతిలోని దీక్షాదండమే ' ధర్మదండం ' కాబట్టి !

చక్రవర్తి చేతిలో ప్రకాశిస్తూ యిహ లోకాన్ని శాసించేది  ' రాజదండమైతే ' ------ ఈ యతి సార్వభౌముని చేతిలో కొలువుండి ఆధ్యాత్మిక , పారలౌకిక ప్రపంచాన్ని ఒక దిక్సూచివలె నడిపిస్తూ పరిపాలించేది యీ ' ధర్మ దండం ' కాబట్టి !

యమ ధర్మ రాజు చేతిలోని ' మృత్యు దండాన్ని ' కసరికొట్టి , విసిరి వేయగల అమోఘమైన ప్రభావశీలి యీ ' ధర్మదండమే ' కాబట్టి !

సజ్జన మార్గం లో నడిచేవారికి ' వూతకర్ర ' గానూ.....దారితప్పి ప్రవర్తించే దుర్జనుల పాలి ' ముల్లు కర్ర ' గానూ .....యావత్ మానవ జాతికి ఒక ' జీవగర్ర '  గానూ ......దిశానిర్దేశం చేయగలిగే మహామహిమాన్వితమైన మంత్రదండం యీ ' ధర్మదండమే ' కాబట్టి !

మరి భవదీయునకూ , యీ ' ధర్మదండానికీ ' గల సంబంధమేమంటారా? భక్తవశంకరుడైన ఆ మహనీయుని జీవిత  చరిత్ర ను పద్యకావ్య రూపంలో ' ధర్మదండం ' పేర వ్రాయగలిగే....వ్రాయబోయే అదృష్టం , ఆ పుణ్యం దక్కడమే ..... ప్రాక్తన పుణ్య లేశ ఫలితమే !

' ధర్మదండం ' ఒక ప్రతీకాత్మకం ..... ' ధర్మదండం ' ఒక గుణాత్మకం ..... ' ధర్మ దండం '  ఒక స్వభావాత్మకం ....అంతే !!!

* మహిత గుణప్రపూతమయి ; మార్మిక ధర్మ ఫల ప్రసాదమై ;
  బహుముఖ దీవ్యదార్ష పథ వైభవ సంతత మార్గదర్శియై;
  అహిత సమస్త లోక దురితాపనుదమ్మయి , సత్ప్రమాణమై;
  సహిత సనాతన ప్రథిత సత్యమునైనది ధర్మ దండమే!!!

( మహా సుగుణములతో విశుద్ధమైనటువంటిదియూ , సూక్ష్మమైన రహస్యమైన ధర్మ ఫలాలను ప్రసాదించునటువంటిదైనదియూ , బహుముఖాలు గా విలసిల్లిన ఆర్ష సంప్రదాయ వైభవోపేతమైన మార్గాన్ని దర్శింపజేయునటువంటిదియూ , దుర్మార్గ లోకపు సమస్త పాపాలనూ దూరముగా పోగొట్టునదియూ , మంచి ప్రమాణాలను నెలకొల్పునదియూ , సనాతన మనే సత్యముతో కూడుకొన్నదియూ యీ ధర్మదండమే !!! ) 

* పురహరుడే తలంచి , యతి పోలిక నీభువి కేగుదెంచి , శం
  కర గురుడై జనించి , యొక కారణ జన్ముడుగా జరించి , ని
  ర్భర కరుణన్ వహించి , జిన బౌద్ధములన్ నిరసించి , మించె నా
  వర యతి హస్త భూషణ శుభ ప్రతిపన్నము ధర్మదండమే !!! 

(ఒకానొక సన్యాసి వోలె భువిపై శంకరాచార్యుడై అవతరించి , కారణ జన్ముడై , నాస్తిక వాదాలను పటాపంచలు చేసి , సనాతన ధర్మ పునః ప్రతిష్ఠ గావించి మించిన ఆ యీశ్వరుని అపరావతారమైన యతి సార్వభౌముని చేతిలో హస్తభూషణమై శుభప్రదమైనది యీ ధర్మదండమే !!! )

* శంకరు ; భక్త సంచయ వశంకరు ; మోహలతా సమూల నా
  శంకరు ; జ్ఞానవాఙ్మయ భృశంకరు ; సార్వజనీన దివ్య సౌ
  ఖ్యంకరు ; వేద విద్విష భయంకరు ; దీవ్యదమోఘ మోక్ష సా
  ధ్యంకరు ; సర్వ పాప విలయంకరు గొల్తు నభీష్ట సిద్ధికై  !!!

స్వస్తి !!!

11 కామెంట్‌లు:

  1. ఈ వ్యాఖ్యానం వ్రాయడానికి ప్రేరేపించిన 'ఊకదంపుడు' గారికి కృతజ్ఞతలతో ...

    రిప్లయితొలగించండి
  2. "ధర్మ దండం" పేరును మీ బ్లాగుకు పెట్టడం వెనుక ఇంత ఆధ్యాత్మికత ,ఇన్ని వేదాంత లోతులు ఉన్నాయని తెలిసి ఎంతో ఆశ్చర్యంతో పాటు, అంతే ఆనందం గుడా కలిగింది ,బాగుంది బ్లాగు యొక్క పేరన్నిక.

    రిప్లయితొలగించండి
  3. వివరంగా చెప్పినందుకు ధన్యవాదములండీ. మీ పద్యకావ్యము త్వరలో మా అందరికీ లభ్యం కావాలని, సనాతన ధర్మం మరింత వృద్ధి చెందటానికి ఆ గ్రంధం తోడ్పడాలని కోరుకుంటున్నాను.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  4. సత్సంకల్పము.ఆ శంకరుల మహిమే మీ పూనికకు కారణముగా కనిపిస్తూంది.విజయోస్తు !

    రిప్లయితొలగించండి
  5. @ మంద పీతాంబర్ గారు , ఊకదంపుడు గారు , మూర్తి గారు - ధన్యవాదాలు !!!!

    రిప్లయితొలగించండి
  6. చాలా సంతోషం! మీ పుస్తకానికై నేనూ ఎదురుచూస్తాను. తి.తి.దే వారి ఛేనల్లో గరికిపాటి నరసింహారావుగారు శంకరాచార్యుల జీవితచరిత్ర చెపుతున్నారు, విద్యారణ్యులవారి గ్రంథం ఆధారంగా.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా, ధర్మడండ యజమాని గారూ

    మీరు రాసిన పద్యాల్లో 90% సంస్కృత పదాలే! కేవలం క్రియలకే తెలుగు పదాలా? బాగో లేదు.
    అచ్చ తెలుగులో రాస్తే లక్షణంగా ఉండేది.

    రిప్లయితొలగించండి
  8. @ భైరవభట్ల కామేశ్వర రావు గారు
    ధన్యవాదాలు ...ఈ ధర్మదండాన్ని రెండు భాగాలుగా వ్రాయడమనేది నా రచనా ప్రణాళిక. మొదటి భాగం మండన మిశ్రుడి ప్రవేశంతో ముగుస్తుంది. అది 2003 లో అచ్చయింది . 2004 సంవత్సరానికి గానూ ముద్రిత పద్యకావ్యానికి ఇచ్చే మహాసహస్రావధాని గరికిపాటి వారు అందించే ' గరికిపాటి సాహిత్య పురస్కారం ' ఆ యేడాదికి అందుకొన్నది !
    రెండో భాగం రచనా కార్యక్రమం కొనసాగుతోన్నది ......!!!! నమస్కారాలతో .....

    రిప్లయితొలగించండి
  9. ఇదొక చర్చ...మంచిదే....నిజానికి యీ చర్చను మరింత సాగదీయడం యిష్టం లేకున్నా , యిటువంటి సందేహాలకు పాఠకులకు ఒక రెఫరెన్స్ కోసం కాస్త క్లుప్తంగా ఒక వివరణ
    తెలుగు స్వతహాగా లలితమైన భాష. సంస్కృతం ఓజః ప్రధానమైన దైవ భాష . శబ్ద గాంభీర్యం మెండు. వస్తు గుణ వైశిష్ట్యాన్ని ఒక మహాస్థాయి కి తీసికెళ్లడానికి దైవభాష సహాయం అవసరమే!
    ఇతర ద్రావిడ భాషల కంటే తెలుగు ప్రత్యేకమైనదే .... ఏ పదాన్నైనా తత్సమంగానూ , తద్భవం గానూ మలచుకోగలిగిన శక్తి దీని విశిష్టత .
    ఇప్పటికి సమాధానం యిచ్చేసినట్టే. ఇంకా కాదనుకుంటే , ఒక పెద్ద తెలుగు వాక్యం లో ఇది అచ్చ తెనుగూ , ఇది సంస్కృతం అని విడదీసి చూపగలిగే నేర్పున్న హంస కావలసిందే....

    అన్నము అనే సంస్కృత పదాన్ని అచ్చ తెలుగు పదమనుకుంటూ కాలం వెళ్లదీస్తాం మన తెలుగు వాళ్లం... ప్చ్ ....!!!

    పోస్ట్ స్క్రిప్ట్ : నాకేదో అచ్చ తెలుగంటే వెర్రి అభిమానమూ లేదు.....సంస్కృతమంటే మహా అనురాగమూ లేదు.... తెలుగు ను కానీ , సంస్కృతాన్ని కానీ వుద్ధరించడమనే మహా ఆశయాలూ నాకేమీ లేవు.....నాకు వచ్చిన భాషలో ,నేను మెచ్చిన దైవానికి ,ఆ నిర్దేశిత పరిస్థితికి , నాకు తోచిన పదాలతో పద్యం వ్రాయగలగడమే నాకు తెలిసిన విద్య!
    చర్చోపచర్చలకు తావు లేదు....మన్నింప ప్రార్థన !!!

    రిప్లయితొలగించండి
  10. kaasta annamayani caduvukOmDi saar! acca telugulO elaa raayaccO telustumdi.

    Dailee maarnimg waak naa eksarsaijukee, helthee gaa laif enjaayi ceyyaDaanikee...

    idi kooDaa acca telugE saar!

    రిప్లయితొలగించండి
  11. ఇలాంటి పుస్తకాలకి మరింత ప్రచారం అవసరం. అందులోనూ ఇంటర్నెట్టే ప్రపంచమైన నాలాంటి కూపస్థమండూకాలకి వీటి గురించి తెలిసే అవకాశమే లేదు! మీ పుస్తకం వివరాలు, అలాగే గరికిపాటివారి పురస్కారం వివరాలు (ఏ ఏ పుస్తకాలకి వచ్చిందో) దయచేసి ఇక్కడ పంచుకోండి.

    రిప్లయితొలగించండి