13, ఫిబ్రవరి 2018, మంగళవారం

చంద్ర మౌళీశ్వరా!

కలలోనైనను నీ జపమ్మె యని పల్కన్ గల్లలన్ స్వామి! కే
వల సామాన్యుడ బెక్కు లంపటములన్ బైగొన్న దీనుండ! నీ
వలె నిర్మోహ విశుద్ధ మానసము శర్వా! యబ్బునే నాకు? శం
భు! లలాటాక్ష! గణింపగా వలదు తప్పుల్ చంద్ర మౌళీశ్వరా!!!

12, జూన్ 2017, సోమవారం

కర్నూలు వైభవం


ఒకానొక సందర్భంలో కర్నూలు జిల్లా పద్య కవుల సమావేశం కోసం తీర్చిన పద్యాలు.శ్రీగిరి మల్లన్న యాగంటి బసవన్న

**** ఓబుల నరసన్న లోముచుండ;

నవనందులొక చోట నయమారఁగా నిల్చి 

**** వరకృపఁ జూపి కాపాడుచుండ;

విజయనగర రీతి బీజపూర్ విఖ్యాతి 

**** పెనగొన్న సంస్కృతులెనయుచుండ;

కళలకు నిలయమై కవుల పుట్టిల్లునై 

**** స్థిరమైన కీర్తి సాధించుచుండ;

రాజకీయ రంగమ్మున రాణకెక్కె
సాంస్కృతిక రంగమందుఁ బ్రశస్తిఁ గాంచె 
మురిపముగ తెల్గు తల్లికి ముద్దు బిడ్డ
మేలు గుణములఁ గ్రాలు కర్నూలు గడ్డ.


సూరన్న సుకవి యెచ్చోట జన్మించెను?

**** పోతులూరయ్య తాఁ బుట్టె నెచట?

ఉయ్యాలవాడ ధీరోదాత్తుఁడెటఁ బుట్టె?

**** వెంగళ రెడ్డి తా వెలసెనెచట? 

ఆదోని లక్షమ్మ యవతరించినదేడ?

**** గాడిచెర్ల ఘనుఁడెక్కడ జనించె?

పెరుగు శివారెడ్డి యరయ నెచ్చటఁ బుట్టె?

**** చండ్ర పుల్లారెడ్డి జననమెచట?

బహుముఖీన విరాజిత ప్రజ్ఞఁ గల్గి 
యంచితమ్మగు యశము నార్జించెనౌర!
మురిపముగ తెల్గు తల్లికి ముద్దు బిడ్డ
మేలు గుణములఁ గ్రాలు కర్నూలు గడ్డ.

4, డిసెంబర్ 2016, ఆదివారం

శ్రీనివాస ప్రభూ (పద్యావళి)శ్రీమద్వేంకట నాథుఁడే యెడఁదలోఁ జెల్వొంది పల్కించు ను
ద్దామాంగీకృత వాగ్విలాసమిది; సత్యంబౌ తపః పుణ్యమౌ!
సామాన్యంబన రాదు దీనిని మహాశ్చర్యంబుగా నా పయిన్
బ్రేమన్ జూపితివయ్య! వందనమిదే! శ్రీ శ్రీనివాస ప్రభూ! 

నీ పాదాబ్జ యుగమ్ముఁ బట్టెదను రానీ కష్టమో సౌఖ్యమో
నీ పల్యంకిక నెత్తి మోసెదను కానీ నష్టమో లాభమో 
యీ పద్యావళి నిన్నుఁ దల్చెదను స్వామీ కావవే ప్రేమతో
శ్రీ పీతాంబర! నిత్య రక్షిత ధరా! శ్రీ శ్రీనివాస ప్రభూ! 

నీవే దిక్కని నమ్ము వారలకు లేనే లేవు కష్టంబు లో
దేవా! నీ కృప నాల్గు మాటలివి స్వాధీనంబులాయెన్; భవ
త్సేవా భాగ్యము గల్గె; నీ పయిన భక్తిం జాటు భావాళితో 
నావిష్కారమొనర్తు నీ శతకమయ్యా! శ్రీనివాస ప్రభూ!  

స్ఫుట భక్తిన్ నినుఁ గూర్చి మానవుఁడు సంస్తోత్రంబులన్ జేయఁ జా
లట సౌఖ్యమ్ములు చెంతఁ జేరునట నిర్వ్యాజమ్ముగా సర్వ సం
కట సందోహము దూరమౌనట గదా! కాకేమి? మా స్వామి! వేం
కటనాథా! ప్రసరించవే కృప నఘఘ్నా! శ్రీనివాస ప్రభూ! 

కలిఁ గష్టంబులఁ దీర్పఁగాఁ గలుగు నిక్కంబైన దైవంబ వీ
యిలలో నీవని నమ్మి నీ కరుణకై యిన్నేళ్లుగా వేచితిన్
ఫలమందించవె సుంతయైన కరుణా వారాన్నిధీ! నీకు నే
నలుసై పోయితినా? పరాకు తగదయ్యా! శ్రీనివాస ప్రభూ!