26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి - చుట్టుముట్టిన శాపావళి

ఉద్యమమ్ములు నేటి విద్యార్థి భవితపై
      నీలినీడలు గ్రమ్ము కాలమిద్ది ;
విద్యుత్ప్రవాహమ్ము వెలితియై రైతు క
      ష్టాల పాలైనట్టి సమయమిద్ది ;
జ్వర రోగ పీడ దుర్భరమై జనావళి
      తలడిల్లి కుందెడి తరుణమిద్ది ;
వైషమ్య భావ విద్వేషాగ్ని రాష్ట్రమే
      విలపించి కుమిలెడి వేళ యిద్ది ;


అకట దుస్సహమైన గాఢాంధకార
మలుముకున్నది ; మనసులు కలత జెంది
వగచు నిత్తఱి నే రీతి స్వాగతింతు 
రమ్య దీపావళీ నిన్ను రమ్మటంచు ?!!! 


అయిననెక్కడో యొక మూల నాశ కలదు
వెలుగులను విరజిమ్ము దివ్వెలను బేర్చి -
తిమిరమును ద్రోలగా స్వాగతింతు నిన్ను
రమ్ము దీపావళి ! సుఖమ్ము తెమ్ము మాకు !!!


యావజ్జనావళికీ దీపావళి శుభాకాంక్షలు !!!!