2, మార్చి 2011, బుధవారం

శివోహం ! శివోహం !!!

సుర నిమ్నగా జటా జూటంబు తోడ , శీ
   ర్ష న్యస్త శశిధర ప్రభల తోడ ;
ఫాల నేత్రము తోడ , ఫణిభూషణము తోడ ,
   హస్తి చర్మోత్తరీయంబు తోడ ;
భస్మాంగ రాగ విభ్రాజితాంగము తోడ ,
   లంబితంబగు కపాలంబు తోడ ;
సునిశితంబైన త్రిశూలాయుధము తోడ ,
   ఢమఢమ ధ్వని యుక్త ఢక్క తోడ ;

ఘన కకుద్యుక్త నంది వాహనము తోడ
వెలుగు నెవ్వండు ? వాడె సర్వేశ్వరుండు !
నిర్వికల్ప చిదానంద నియత మూర్తి 
మహిత దీప్తిచ్చటా ప్రభామయ విభూతి !!! 



( ఆకాశ గంగను బంధించిన జటాజూటం తోనూ, తలపైన అలంకరించబడిన చంద్రరేఖ వెలుగు జిలుగుల తోనూ , ముల్లోకాలనూ భస్మీపటలం చేయగల ఫాలనేత్రము తోనూ , ఆభరణాలుగా  ప్రకాశించుచున్న సర్ప రాజములతోనూ , వసనంగా చుట్టుకున్న గజ చర్మం తోనూ , శ్మశాన భస్మమనే మైపూత నలమిన ప్రకాశమానమైన శరీరం తోనూ , వేలాడదీయబడిన కపాల మాల తోనూ , వాడియైన త్రిశూలం తోనూ , ఢమఢమ ధ్వానాలు వెలువరించే ఢక్క తోనూ , గొప్పనైన మూపురం తో ఒప్పారే నంది వాహనంతోనూ వెలుగొందేవాడెవ్వడు?? నిర్వికల్ప చిదానంద మూర్తి , మహిత ప్రభాకలితమైన ఐశ్వర్యమూ అయిన ఆ సర్వేశ్వరుడే !!!! )