31, డిసెంబర్ 2011, శనివారం

"జయతు శంకర సాహిత్యం ! జయత్వద్వైత సౌరభం "


వృత్తిగతావిశ్రాంత జీవనంలో , ప్రవృత్తికి తగిన సమయం కేటాయించడానికి అశక్తుడనైన తరుణంలో ఈ 2011 సంవత్సరానికి ఒక మంచి పద్యమో / వ్యాసమో వ్రాసి యెలా వీడ్కోలు చెప్పాలా అని ఆలోచిస్తూన్న వేళ కనపడింది " తెలుగుపద్యం " - భైరవభట్ల వారి ఒక మంచి వ్యాసం.

భార్యా పాదతాడనానికి గురైన దేవతా మూర్తుల పైన వ్రాసిన వ్యాసానికి రెండవ భాగం.
ఆదిశంకరులు - " కైలాసాంతర్గత వాసమున్ వదలి లీలా బ్రహ్మచర్యాశ్రమ శ్రీ సంతర్పిత ధారుణీ వలయుడై శ్రీ షణ్మతస్థాపనన్ దా సంపూర్ణ గురుత్వమంది ఘన విద్వద్వైదికాద్వైతియై " న పరమహంస పరివ్రాజక సమ్రాట్టు . కాని మహాకవి ! తాండవనృత్యం చేసిన తరువాత పదునాలుగు మార్లు ఢక్కను మ్రోగించి అక్షర సమామ్నాయము శివ సూత్రావళినే సృష్టించిన మహానుభావునికి కవిత్వమొక లెక్కా?!
వారిచే విరచింపబడిన అత్యంత రామణీయకమైన సౌందర్యలహరి లో

మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితమ్
లలాటే భర్తారమ్ చరణకమలే తాడయతి తే
చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా 

అంటూ ఒక చక్కని మనోహరమైన ఊహ కల్పించారు . దీనికి భైరవభట్ల వారే చక్కని తాత్పర్యమందిస్తూ ఏతత్ శ్లోకానికి ఔత్సాహికులెవరైనా తెనుగు సేత చేయమన్నారు , వ్యాఖ్యా రూపంలో .
అదిగో అప్పుడు మెదిలింది ఈ వూహ .

స్వేచ్ఛానువాదం  సంగతి ఎలా ఉన్నా , సంస్కృతాంధ్రీకరణం ఎప్పుడూ ఒక సవాలే ! సాధ్యమైనంత మూలం లోని భావాన్ని మొత్తం పట్టుకు రావాలి . మూలం లో లేని లేదా చెప్పబడని భావాన్ని పరిహరించాలి.మూలం లో భావం ప్రకటన రూపం లో ఉందో , సంభాషణ పూర్వకమైనదో తెలియాలి , అదే సంబోధన అనువాదం లోనూ వారికే చేయాలి.  వీలైనంత మట్టుకు అనువాదం లో వ్యర్థపదం ఒక్కటి కూడ వాడకూడదు . సంస్కృత భాషా శైలి ని బట్టి కర్మణి ప్రయోగం చాలా సాధారణం - ద్వితీయా విభక్తిలోనే సాధ్యమైనంత వర్ణన చేసేసే సౌలభ్యమూ ఒకటి - గోత్రస్ఖలనం నమితం తే భర్తారం అంటూ .
ఇది కాక సాధ్యమైనంతగా మూలంలో ఉన్న పదాలను యథాతథంగా వాడగలిగితే అదొక అదనపు అందం - నిజానికి అలా వాడగలగాలి కూడ .ఇవి కాక యతులూ ప్రాసల ప్రతిబంధకాలు మామూలే !

ఇన్ని కష్టాలనూ పక్కన పెడితే వ్రాసినవాడో - సాక్షాత్ ఆదిశంకరులు . నేనో సంస్కృతాంధ్రాలలో కేవల పరిచయ మాత్ర జ్ఞానమున్నవాడను . అనువాదానికి సాహసించాను -

హేల త్వదాహ్వయమ్ము నితరేతర రీతి వచించి స్థాణువై
శూలి భవత్పదాబ్జముల సోకగ జేసె లలాట మంత నీ
కాలొక యింత తాకి ఘలు ఘల్లని గజ్జెలు మ్రోగెనమ్మరో - 
లీల పురా పరాభవ శిలీముఖ మొక్కెడ బెల్లగిల్ల నా
వాలుగడాలు నవ్వుల రవంబుల జేసినయట్లు జేతయై !!! 


( స్థాణువు = రెండర్థాలూ , శంకరుడూ , అచేతనుడూ అని ఈ సందర్భం లో )

ఎలాగైనా పాదతాడన సౌభాగ్యం పొందాలనే మిష తో , తన భార్య యైన గౌరి ని , గంగా అనో మరేమో అనో ఇతరేతరమైన పేర్లతో పిలిచి , ఆనక నాలుక కరచుకుని , స్థాణువై అమ్మ పదాల కడ ఫాలముంచినాడట శివయ్య , తప్పును సైరించమన్నట్టుగా .

శంకరుని ఫాలభాగాన్ని అమ్మవారు తన కాలితో తొలగద్రోయడం తోడనే ,  అమ్మవారి కాలి అందెలు మ్రోగాయట - ఆ శబ్దాలెలా ఉన్నాయీ అంటే , పాదతాడనానికి గురైన శివుడిని చూసి , మనసులో నాటుకుని ఉన్న పరాభవ బాణం ఒక్క ఉదుటన పెల్లగింపబడి సంతోష స్వాంతుడైన మన్మథుడు ప్రతీకారం చల్లారిందా అన్నట్టు కిల కిలా నవ్విన రవాల పోలిక నున్నాయట . ఇదీ ఆ సందర్భం !


శంకరులు అవలీలగా నాలుగు పాదాల్లో చెప్పగలిగిన విషయానికి , కాస్త పడుతూ లేస్తూన్న నాకేమో అయిదు పాదాల అవసరమయ్యాయి .

సరే ! శంకరులను అనుసరించినా అనుకరించినా పుణ్యదాయకమే కదా !!!

"జయతు శంకర సాహిత్యం ! జయత్వద్వైత సౌరభం "