15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఇద్దరూ ఇద్దరే !!!

వానరాణాం వివాహేషు
తత్ర గార్దభ గాయకాః
పరస్పరం ప్రశంసంతి
అహో రూప మహో ధ్వనిః !!!


ఇద్దరు విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులు పరస్పర ప్రశంసలతో , ఆహా ఓహో అంటూండగా విన్న జగన్నాథ పండిత రాయలు నవ్వుకుని , వారిపై జాలిపడి పలికిన శ్లోకమది .

వానరముల పెండ్లి పండుగలో - మేటి
గాయకాగ్రగణులు గార్దభములు ;
ఎంత మంచి రూప మెంత సుస్వరమంచు
పొగడిరొకరినొకరు పొట్టలుబ్బ !!!
( డా. విష్ణునందన్ )

అర్థం సుగమం.

సమస్యా పూరణం - మలిన కళంక జీవితను మైథిలి జేకొనుమయ్య రాఘవా !!!

ఎందుకో గానీ , మార్పు కోసం యీ సారి సాటి కవుల నుండి ఒక సమస్యకు పూరణలను ఆహ్వానించవలెననిపించింది.

                 మలిన కళంక జీవితను మైథిలి జేకొనుమయ్య రాఘవా!!!


ఇదీ ఆ సందర్భం . సందర్భోచిత పూరణలనాహ్వానిస్తూ ......

9, ఫిబ్రవరి 2011, బుధవారం

సీతా మాతా ! అపరాధ క్షమాపణ స్తోత్రం !

"సీతాయాః చరితం మహత్ " అని కవి శ్రేష్ఠుల్ ప్రశంసించి సం
ప్రీతిన్ తత్కథ గూర్చినారు గద !  మూర్తీభూత సౌశీల్యమై
ప్రాతః సంస్మరణీయమై వెలుగు అంబా ! సీత ! మన్నింపవే
మా తప్పుల్ ఒక తల్లి వోలె గనవే ! మర్యాద గాపాడవే !


అగ్నిన్ దూకి పునీతవైన జననీ ! అత్యంత దుశ్చింతనా
మగ్నంబై చరియించు మానసములన్ మన్నించి , సన్మార్గ సం
లగ్నంబై తరియించునట్లు కనవే ! లాలిత్యమున్ జూపవే
భగ్నంబైన త్వదీయ భక్తుల మనోభావంబులన్ గావవే !!!


క్ష్మాపుత్రీ ! యిది భక్త కోటికి పరీక్షాకాలమే ! తల్లినే
కోపంబూని భరింపలేని కఠినాక్రోశమ్ముతో దిట్టుచో
ఏ పుత్రుండెటు సైపగా గలడు తల్లీ ! నీ మహత్త్వంబులన్
జూపింపన్ వలె ! వేగ రావె జననీ ! శోకమ్ము మాన్పించవే !!!!   


అమ్మా ! నీ సహనమ్ము భూమికి సమంబై యొప్పు ; ప్రేమో? అనం
తమ్మై అంబరమంటు ; నీ కృప వియద్గంగా సమానమ్ము ! రూ
పమ్మో సూర్య సమాన తేజమిక కోపమ్మో??? భరింపంగ శ
క్యమ్మా?  తీవ్ర మరుత్ప్రకంపనము ! మాతా ! " పంచభూతాకృతీ " !!!

వందే సత్య శుభాకృతీం ! ధరణిజాం ! వందే ప్రసన్నాకృతీం !
వందే శ్రీరఘు రామ పత్నిమమలాం ! వందే సుశీలాం సదా !
వందే సర్వ సుఖప్రదాం ! భగవతీం ! వందే సుభక్తార్చితాం !
వందేహం సతతం తదీయ చరణం !వందే పరాదేవతాం  !!!!