23, ఆగస్టు 2014, శనివారం

కేశపాశం !

ప్రాసంగికమగు విషయం
బీ సంగతి మూడు పాయలెసగఁగ గుణ లీ
లా సంభృతమైన త్రివే
ణీ సంగమ సమము నీవు నిక్కమ్ము జడా !

జడదారియైనఁ గానీ 
పెడదారింబట్టు నతివ పిరుదుల పైనం
దడబడు నీ నాట్యముఁ గని 
పుడమినెవని తరము నిన్నుఁ బొగడంగ జడా !

పొడవుగ , మహిళా మణులకుఁ 
దొడవుగ , వెన్నంటి నడచు తోడుగ సతత
మ్మొడఁబడి గడితేరితివట 
గడసరివే ! నిను నుతింపఁగా నెటుల జడా !

గట్టిగ ముడి వేయుటొ మఱి 
బిట్టుగ విడివిడిగ వదిలి వేయుటొ పూలం
బెట్టుటొ పెట్టకపోవుటొ
యెట్టులయిన నేమి యందమే నీది జడా !

ఎవ్వతె సోయగమున నా
కివ్వసుధన్ స్పర్థ యనుచు నింతి యొకతె నిన్
దువ్విన - కయ్యానికి కా
ల్దువ్వినటుల మదికిఁ దోచుఁ దోరంపు జడా !