15, జనవరి 2012, ఆదివారం

భోగి - సంక్రాంతి - కనుము


తెల తెలవారుచుండ  చలి తీవ్రము గాగ సహింపలేక  రే
నెలత తపించి మన్మథుని నెయ్యము బూని కలంత మాని - ము
ద్దుల చెలికాని బాసి మది దోరపు వేదన సైపలేని అ
య్యలికులవేణి బృంద విరహాగ్ని సుఖించెను భోగిమంటలన్ !!! 

( రాత్రి అనే సుందరీమణి తెలతెలవారు జాములో విపరీతమైన చలి తో బాధింపబడి , దుస్సహమైన ఆ చలితీవ్రత భరింపలేక , మన్మథుని ప్రేరేచి , ముద్దుల చెలికాండ్ల నెడబాసి యున్న తరుణీ బృందపు మనసుల్లో విరహాగ్నిని రగిల్చి , ఆ భోగిమంటల్లో చలి కాచుకుని ఆనందించిందట !!!)

హరిదాసు సంకీర్తనాభిమంత్రణములే 
       సంక్రాంతి లక్ష్మికి స్వాగతములు ;
ముంగిట దిద్దిన రంగవల్లియె గదా 
       పౌష్య లక్ష్మికి మేల్మి పాదపీఠి ;
బండ్లపై నిలు జేరు బంగారు పంటలే 
       ధాన్య లక్ష్మికి నివేదన ఫలములు ;
పౌరుషమ్ముల కోడి పందాల చందాలు
      ధైర్య లక్ష్మికి వినోదాల విందు


లదిగొ గంగిరెద్దులు, గొబ్బియలును, రేగు
పళ్లు, చెరకు గడలు, గాలి పటములింక
తీయ గుమ్మడి కాయలు తెలిపె నతులు
శ్రీమహా లక్ష్మికివియె జేజేలటంచు !!! 


( సంక్రాంతి లక్ష్మికి చేతనైన ఉపచారాలను చేయడానికి సంకల్పించినప్పుడు ,

హరిదాసుని సంకీర్తనలనే ఆ మధురమైన పిలుపులే అమ్మవారికి ఆవాహన పూర్వకమైన స్వాగతాలు - ఇంటి ముందు అందంగా దిద్దిన రంగవల్లి అమ్మవారికి అందమైన అపరంజి పాదపీఠమట ! బండ్లపై నింటికి తీసుకుని వచ్చిన బంగారు పంటలే అమ్మవారికి సమర్పించే నైవేద్యం ! పౌరుషాగ్నులు జ్వలించే కోడిపందాలే అమ్మవారికి వినోద ప్రదర్శనమట ! గంగిరెద్దులు , గొబ్బెమ్మలు , రేగుపళ్లు , చెరకు గడలు , గాలిపటాలు , తీయగుమ్మడి కాయలు మొదలైన సంక్రాంతి ప్రత్యేక సంభారాలన్నీ అమ్మవారికి జేజేలు పలుకుతున్నాయా అన్నట్లున్నాయట !!! )నింగి గలట్టి సూర్యు డవనీతల మొక్కెడ దర్పణంబుగా  
బంగరు కాంతులీన గనుపట్టెను దా ప్రతిబింబ రూపియై
రంగుల రంగవల్లుల - తిరంబుగ దివ్య రథంబుపైన గే
హాంగణ సీమలందు కనుమా , కనుమన్ , విలసత్స్వరూపుడై !!! 

( ధరణీ తలమంతా బంగారు కాంతులీనుతూ ఒక స్వచ్చమైన అద్దము వలె మారిపోగా , పైన నింగిలోని సూర్య బింబం , విలసత్స్వరూపుడై , ప్రతిబింబము వోలె - కనుమ నాడు  ప్రతి ఇంటి ముందూ  అందం గా రంగు రంగుల్లో తీర్చిదిద్దబడిన ముగ్గుల్లో కొలువై ఉన్నాడు కనుము !!! కనుము నాడు సూర్యుని రథం ముగ్గు వేయడం ఒక ఆచారం , అదే ఇక్కడ సూచించబడింది !!! )

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో -
     

8, జనవరి 2012, ఆదివారం

వేంకటావధానీ ! నీకు వేల నతులు !!!


దివాకర్ల వేంకటావధాని - జగమెరిగిన బ్రాహ్మణుడు ! శుద్ధ శ్రోత్రియుడు , ఆధునిక కాలంలో ఋషితుల్యుడు ! కవి , పండితుడు , విమర్శకుడు , పరిశోధకుడు , పరిశోధకులకు మార్గదర్శి , అవధాని , ఉపన్యాసకుడు , భువనవిజయేత్యాది రూపక విధివిధాన నిర్ణేత ! అన్నింటికీ మించి సౌమ్యశీలి , మృదు స్వభావి .

అంతటి పండితుడూ , తనకంటే వయస్సులో , విద్వత్తులో , అనుభవంలో అన్ని రకాలుగా చిన్న వారైన వారి పట్ల చూపే ఒకానొక గౌరవపురస్సరాదరాభిమానాలు నిజంగా ఆశ్చర్య జనకాలే  , కొండొకచో నమ్మశక్యం కానివి కూడా అని ఆ అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించిన మా చిన్నాన్న పలుకులు !

వేదం సశాస్త్రీయం గా చిన్నతనం లోనే అభ్యసించి , సనాతనార్ష ధర్మాన్ని అణువణువునా నింపుకుని , బయట ఎక్కడా పచ్చి మంచి నీరూ ముట్టని ఋషితుల్యమైన సాత్విక నిరాడంబర జీవనం వారిది ! తెలుగుభాషా ప్రచారాన్ని భుజాన వేసుకుని ఆంధ్రదేశం నాలుగు చెరగులా వారు పర్యటించే రోజుల్లో , మా నంద్యాలకు వారిని ఆహ్వానించడమూ , అందుకంగీకరిస్తూ వారు మా నాన్నగారికి పంపిన ఉత్తరం లో " నేను కొంచెం శ్రోత్రియుడను , అందులకవసరమైన పద్దతులను సమకూర్చమని మనవి" అంటూ వ్రాయడమూ , తదనుగుణ్యంగా మా ఇంట వారు ఆతిథ్యం స్వీకరించడమూ , మా నాన్నగారు ఇప్పటికీ ఆ ఉత్తరాన్ని అపురూపంగా భావిస్తూ ఆ వాక్యాలను మననం చేసుకుంటూ మురిసిపోవడమూ ప్రత్యక్షానుభవం !

ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే , ఇది కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని వారి శతజయంత్యుత్సవ మహానంద కారక సంవత్సరం కాబట్టీ , వారి శతజయంత్యుత్సవాలు భాగ్యనగరం మొదలుకొని , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోలాహలం గా జరుగుతూన్నాయి కాబట్టీ , అలా నిన్న అనంతపురం లో  జరిగిన ఒకానొక సభలో పాల్గొని - పురస్కారమందుకునే మహాభాగ్యం భవదీయునికి కలిగింది కాబట్టీ , భావస్థిరాని జననాంతర సౌహృదాని !

దివాకర్లవారు జన్మించిందే మూలా నక్షత్రం లో , గురుపూర్ణిమ నాడు , ఆ రెంటి మహత్వాన్ని మరలా వివరించవలసిన పనేముంది ?! తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి స్వయాన అన్నగారి కొడుకైన వారు , ఏకసంథాగ్రాహి , ధారణలో ఆ చిన్నాన్న కు ఏమాత్రం తీసిపోని అపారమైన ప్రజ్ఞాపాటవాలు . నన్నయ్యభట్టారక భారతం మీద పరిశోధనలు సలిపిన వారు , ఆంధ్ర వాజ్మయ చరిత్ర , సాహిత్య సోపానాలు మొదలైన గ్రంథాలనందించి , తెలుగు భాషా సేవ సలిపినవారు .

ఒక్క మాటలో ఆంధ్ర భాషాయోష కొక రమణీయమైన భూష యైన ఆ మహానుభావునికి సాదర సంస్మృత్యంజలులు !!!

" ఆంధ్ర వాజ్మయ చరిత్రామృతమ్మును గూర్చి 
          తెలుగు భాషా సేవ జెలగినావు ;
  సాహిత్య సోపాన సంగ్రథనమ్ముతో 
          సారస్వతార్చన సలిపినావు ;
  నన్నయ్య కావ్యంపు విన్నాణముల పైన 
          పరిశోధనమ్ముల నెరపినావు ;
  భువన విజయ రూపక విధాన సృజనతో 
          పెద్దన్న కవిని జూపించినావు ;


  ఆర్ష ధర్మానుసరణమే ధ్యాస యగుచు 
  శ్రోత్రియుడవై త్రికరణ విశుద్ధ నియత
  వర్తనము జేసినట్టి పుంభావ వాణి !
  వేంకటావధానీ ! నీకు వేల నతులు !!! "