15, మే 2013, బుధవారం

ఆది శంకరాచార్యులు


ముప్పది రెండేడుల యతి
యిప్పుడమిని నేకధాటి నెటుల దిరిగెనో ?
యెప్పుడెటుల బుధజనులను
మెప్పించెనొ ? యెరుగ సాధ్యమే యితరులకున్ ?

శైశవమ్ముననె భాషాప్రౌఢి జూపించి
ప్రాజ్ఞుల నబ్బుర పరచినాడు ;
ఒక పేదరాలి యార్తికి గుంది బంగారు
తిష్య ఫలమ్ములందించినాడు ; 
తల్లి కష్టములకు దలడిల్లి పూర్ణా ఝ 
రిని నింటి ముందు పారించినాడు ;
పోటెత్తు నర్మదా పూర్ణ ప్రవాహమ్ము
నే యొక్క కడవ బంధించినాడు ;

ఏన్గు నద్దములోన జూపించు రీతి 
నిగమ సారమ్ము దేటగా నిఖిల జగతి 
తెలిసికొనునట్లు భాష్యమ్ము నిలిపినాడు 
కువలయమున ధర్మము బాదు కొలిపినాడు ! 

కవితల్లజుండయి కమనీయ రమణీయ
సత్కావ్యముల బెక్కు సంతరించె ;
బండిత ప్రవరుడై భాషా మహా ప్రౌఢి 
ద్రెళ్లు గ్రంథముల బరిష్కరించె ;
భక్తవరేణ్యుడై పలు దేవతా స్తోత్ర 
సంచయమ్ముల బేర్మి సంఘటించె ;
నుపదేష్ట యగుచు గీతోపనిషత్సూత్ర 
సార భాష్యమ్మును సంసృజించె ;

మనుజ జన్మమ్ము నందు సామాన్యుడొకడు 
వేయి వేయేండ్లకైనను జేయలేని 
పనుల ముప్పది రెండేండ్ల ప్రాయమందె 
లీల సాధించి గురు పీఠి నేలగల్గె !

కలి చెలరేగ లోకమున గాసట బీసటయై కృశించు ని
ర్మల నిగమాంత వాక్యముల గ్రమ్మర నిల్పి సమస్త పాప పం 
కిలముల రూపుమాప గల  కేవల శుద్ధ సనాతనార్ష వి
ద్యల సమకూర్చె శంకరుడు తాత్వికపాళికి నొజ్జబంతియై 

( ధర్మదండం - అవతార సమాప్తి ఘట్టం నుండి )