21, సెప్టెంబర్ 2014, ఆదివారం

ధర్మదండము

శ్రీ శంకర భగవత్పాదుల కృపా కటాక్ష వీక్షణ ఫలితంగా 1001 పద్యాలతో నిర్వచనముగా  - ఏప్రిల్ 2014 సంవత్సరంలో ప్రచురించబడిన ధర్మ దండము - పద్య కావ్యము జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము ...

జగద్గురుని ఆశీః ఫలితంగా - లోగడ యీ  కావ్య ప్రథమ భాగానికి ' గరికిపాటి సాహిత్య పురస్కారం' అందుకున్న తరువాత ఇప్పుడీ సంపూర్ణ కావ్యానికి  శ్రీ గడియారం స్మారక పురస్కారం 2014 లభించిందని యీరోజే తెలిసిన విశేషము ...


వరయతియై వెలుఁగు జగ
ద్గురుని కరుణ కలుఁగ నింక కొదవేమి ధరన్ ?
నిరతమ్మాతని నిర్మల
చరణమ్ముల సేవ సేయఁ జాలుదు భక్తిన్ ! 





23, ఆగస్టు 2014, శనివారం

కేశపాశం !

ప్రాసంగికమగు విషయం
బీ సంగతి మూడు పాయలెసగఁగ గుణ లీ
లా సంభృతమైన త్రివే
ణీ సంగమ సమము నీవు నిక్కమ్ము జడా !

జడదారియైనఁ గానీ 
పెడదారింబట్టు నతివ పిరుదుల పైనం
దడబడు నీ నాట్యముఁ గని 
పుడమినెవని తరము నిన్నుఁ బొగడంగ జడా !

పొడవుగ , మహిళా మణులకుఁ 
దొడవుగ , వెన్నంటి నడచు తోడుగ సతత
మ్మొడఁబడి గడితేరితివట 
గడసరివే ! నిను నుతింపఁగా నెటుల జడా !

గట్టిగ ముడి వేయుటొ మఱి 
బిట్టుగ విడివిడిగ వదిలి వేయుటొ పూలం
బెట్టుటొ పెట్టకపోవుటొ
యెట్టులయిన నేమి యందమే నీది జడా !

ఎవ్వతె సోయగమున నా
కివ్వసుధన్ స్పర్థ యనుచు నింతి యొకతె నిన్
దువ్విన - కయ్యానికి కా
ల్దువ్వినటుల మదికిఁ దోచుఁ దోరంపు జడా !