22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నిగ్రహవాదం !

చిత్రమ్మే యిది యుగ్రవాదమను పేచీకోరు పంతంబుతో
మిత్రత్వమ్మును శాంత్యహింసలను తామే బుగ్గి పాల్జేసి ది
ఙ్మాత్రంబైనను జంకు లేక యిదె ధర్మంబంచు మూఢాత్ములై
సూత్రాల్ వల్కెడి నీచ మానవులు దుష్టుల్ నాశమొందన్వలెన్ !


కోరి యమాయక ప్రజల కొంపల గోడుల గూల్చి పేల్చి హిం
సా రణ నీతి దాల్చి మనసా వచసా గరళమ్ము జిమ్మి హుం
కారము సేయు త్రాచుల వికార పిశాచుల బట్టి శీఘ్రమే
కోరల బీకి వేయవలె ; గూర్మిని బెంచవలెన్ ధరిత్రిలో !


బుద్ధదేవుడు సదా బోధించె బ్రేమతో
              శాంతి గరుణ నహింసా ప్రవృత్తి ;
నొక చెంప గొట్టుచో నొక చెంప జూపగా
              దగునని క్రీస్తు సత్యమ్ము నుడివె ;
సత్యాగ్రహమ్ముతో సాధింపవచ్చు గో
              ర్కెలనని బాపూజి ప్రీతి బల్కె ;
చీదరించుట కన్న నాదరించుట మిన్న
              యమ్మ తేరీసా హితమ్ము జెప్పె ;

పరమ హంస పుట్టిన నేల  బరమ హింస
కెటుల జేతులల్లాడె నోయీ నిహీన !
మానవుడె మాధవుండను మాట దలచి
కూర్మి జరియించుమికనైన ధార్మికముగ !


మంచి బెంచిన మంచిని బంచిపెట్టు
జెడును బోషించుచో నీకె చెడుపు జేయు ;
మానవత్వమ్ము మించిన మతము లేదు
మమత యేనాటికైనను మాసిపోదు !!!

21, ఫిబ్రవరి 2013, గురువారం

తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !


పలకపై నక్షరాభ్యాసమ్ము జేయించె
          నయమార మనకు నన్నయ్య సుకవి ;
తెలుగులో గల మేటి పలుకుబడుల సౌరు
          జూపించె తిక్కన్న సోమయాజి ;
శబ్దగతికి భావ శబలత గుదిగుచ్చి 
          వివరించె మన యెఱ్ఱ ప్రెగ్గడ కవి ;
పలికిన పదమెల్ల భాగవతము సేసి
          పులకించుటను నేర్పె పోతరాజు ;

ప్రౌఢ పదగుంఫనమ్మున బరిఢవిల్లు
నైగనిగ్యము జాటె శ్రీనాథ సూరి ;
సకల కావ్య ప్రబంధ లక్షణములెల్ల  
దెల్పినారు కదా యష్ట దిగ్గజములు ! 



గున్నమామిడి చెట్టు కొమ్మపై కోయిల 
             పంచమ స్వరమును పాడినట్లు ;
హోమగుండము ముందు హోత సస్వరముగా
             వేదమంత్రమ్ము జపించినట్లు ;
శారద రాత్రుల సారాభ్రమున మిన్కు  
             మినుకని తారలు మెరిసినట్లు ;
చెలగి వేగమ్ముగా జీవనదీ ప్రవా 
             హము ముందు ముందునకరిగినట్లు ;

తెలుగు గీతమ్ము నిత్యమై నిలుచుగాక 
తెలుగు పద్యమ్ము నిక్కమై పొలుచుగాక
తెలుగు పలుకులు స్థిరములై చెలగుగాక
తెలుగు వ్యవహార మనఘమై వెలయుగాక !  
(సీసము లోని మొదటి నాలుగు పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఎత్తుగీతి లోని ఒక్కొక్క పాదముతో అన్వయము )
 

నింగిలో సూర్యచంద్రులు నెగడు దనుక 
నవని పై జలనిధులింక నంత దనుక  
జాతి మున్ముందునకు బేర్మి సాగు దనుక
తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !

జయమహో తెల్గు తల్లీ !!!