21, ఫిబ్రవరి 2013, గురువారం

తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !


పలకపై నక్షరాభ్యాసమ్ము జేయించె
          నయమార మనకు నన్నయ్య సుకవి ;
తెలుగులో గల మేటి పలుకుబడుల సౌరు
          జూపించె తిక్కన్న సోమయాజి ;
శబ్దగతికి భావ శబలత గుదిగుచ్చి 
          వివరించె మన యెఱ్ఱ ప్రెగ్గడ కవి ;
పలికిన పదమెల్ల భాగవతము సేసి
          పులకించుటను నేర్పె పోతరాజు ;

ప్రౌఢ పదగుంఫనమ్మున బరిఢవిల్లు
నైగనిగ్యము జాటె శ్రీనాథ సూరి ;
సకల కావ్య ప్రబంధ లక్షణములెల్ల  
దెల్పినారు కదా యష్ట దిగ్గజములు ! 



గున్నమామిడి చెట్టు కొమ్మపై కోయిల 
             పంచమ స్వరమును పాడినట్లు ;
హోమగుండము ముందు హోత సస్వరముగా
             వేదమంత్రమ్ము జపించినట్లు ;
శారద రాత్రుల సారాభ్రమున మిన్కు  
             మినుకని తారలు మెరిసినట్లు ;
చెలగి వేగమ్ముగా జీవనదీ ప్రవా 
             హము ముందు ముందునకరిగినట్లు ;

తెలుగు గీతమ్ము నిత్యమై నిలుచుగాక 
తెలుగు పద్యమ్ము నిక్కమై పొలుచుగాక
తెలుగు పలుకులు స్థిరములై చెలగుగాక
తెలుగు వ్యవహార మనఘమై వెలయుగాక !  
(సీసము లోని మొదటి నాలుగు పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఎత్తుగీతి లోని ఒక్కొక్క పాదముతో అన్వయము )
 

నింగిలో సూర్యచంద్రులు నెగడు దనుక 
నవని పై జలనిధులింక నంత దనుక  
జాతి మున్ముందునకు బేర్మి సాగు దనుక
తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !

జయమహో తెల్గు తల్లీ !!!


5 కామెంట్‌లు:

  1. అవును ఫణి ప్రసన్న కుమార్ గారు ! తెలుగు తల్లికి తెలుగు కవిత్వానికి తెలుగుల వారసత్వానికి సదా దిగ్విజయమస్తు !

    రిప్లయితొలగించండి
  2. డా. విష్ణునందన్ మహోదయా! నమస్సులు. జీవ మున్న పద్యమునకు చావులేదు అన్న మాటకు మీపద్యములు ప్రత్యక్ష సాక్షీభూతములు. అభినందనలతో

    తెలుగు పద్యము పాయసాన్నపు తీపినిచ్చును గ్రోలగన్
    తెలుగు పద్యము నాట్యమాడును తేనెలొల్కుచు నాల్కపై
    తెలుగు పద్యము హృద్యమై యుతేజమై నలుదిక్కులన్
    తెలుగు పద్యము సుస్థిరంబగు తియ్యమామిడి చూడగన్.

    రిప్లయితొలగించండి
  3. నాపద్య్మందలి టైపాటును సవరించుచు

    తెలుగు పద్యము పాయసాన్నపు తీపినిచ్చును గ్రోలగన్
    తెలుగు పద్యము నాట్యమాడును తేనెలొల్కుచు నాల్కపై
    తెలుగు పద్యము హృద్యమై యువ తేజమై నలుదిక్కులన్
    తెలుగు పద్యము సుస్థిరంబగు తియ్యమామిడి చూడగన్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు , మీ ఆదరాభిమానాలకు బహుధా కృతజ్ఞతలు . మీ హృద్యమైన తెలుగు పద్యము మనసుకు హాయి గొలిపేలా ఆహ్లాదకరముగా నున్నది - ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి