22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నిగ్రహవాదం !

చిత్రమ్మే యిది యుగ్రవాదమను పేచీకోరు పంతంబుతో
మిత్రత్వమ్మును శాంత్యహింసలను తామే బుగ్గి పాల్జేసి ది
ఙ్మాత్రంబైనను జంకు లేక యిదె ధర్మంబంచు మూఢాత్ములై
సూత్రాల్ వల్కెడి నీచ మానవులు దుష్టుల్ నాశమొందన్వలెన్ !


కోరి యమాయక ప్రజల కొంపల గోడుల గూల్చి పేల్చి హిం
సా రణ నీతి దాల్చి మనసా వచసా గరళమ్ము జిమ్మి హుం
కారము సేయు త్రాచుల వికార పిశాచుల బట్టి శీఘ్రమే
కోరల బీకి వేయవలె ; గూర్మిని బెంచవలెన్ ధరిత్రిలో !


బుద్ధదేవుడు సదా బోధించె బ్రేమతో
              శాంతి గరుణ నహింసా ప్రవృత్తి ;
నొక చెంప గొట్టుచో నొక చెంప జూపగా
              దగునని క్రీస్తు సత్యమ్ము నుడివె ;
సత్యాగ్రహమ్ముతో సాధింపవచ్చు గో
              ర్కెలనని బాపూజి ప్రీతి బల్కె ;
చీదరించుట కన్న నాదరించుట మిన్న
              యమ్మ తేరీసా హితమ్ము జెప్పె ;

పరమ హంస పుట్టిన నేల  బరమ హింస
కెటుల జేతులల్లాడె నోయీ నిహీన !
మానవుడె మాధవుండను మాట దలచి
కూర్మి జరియించుమికనైన ధార్మికముగ !


మంచి బెంచిన మంచిని బంచిపెట్టు
జెడును బోషించుచో నీకె చెడుపు జేయు ;
మానవత్వమ్ము మించిన మతము లేదు
మమత యేనాటికైనను మాసిపోదు !!!

4 కామెంట్‌లు:

  1. డా.విష్ణునందన్ గారికి నమస్సులు. సర్వమత సారాన్ని సామరస్యాన్ని తెల్పుచూ శబ్దార్థ భావప్రకటనాధారావాహికగా సాగిన మీ పద్య పంచమము అద్భుతము. హైదరాబాదు దిల్ షుక్ నగర్ లో జరిగిన బాంబు ప్రేలుడులో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థించుచూ

    ఉగ్రవాదమనుచు దనుజులుండగ దండింప ప్రభుత
    ఉగ్రరూపము దాల్చదేల? ఊరపందుల దునుమాడ
    అగ్రరాజ్యపు (నీ)రీతి గనుమ! అసహాయులన్ రక్షజేయ
    ఉగ్ర నృసింహ సిపాయి లొక్కపెట్టున మట్టుబెట్ట.
    ....... మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.

    రిప్లయితొలగించండి
  2. సరసకవి తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు పునస్తే నమస్తే !

    రిప్లయితొలగించండి