14, జనవరి 2011, శుక్రవారం

నేటి సంక్రాంతి !!!

రంగవల్లులు ; హరిదాసు ; గంగిరెద్దు
కోడిపందేలు ;గొబ్బిళ్లు ; పాడిపంట
చెరకు గడలు ; పేరంటాలు ; సిరులతోడ
వింత సొబగులనీను సంక్రాంతి లక్ష్మి !


అది ఒకప్పటి మాట ! ఏమని వచింతు ?
కాలగతిని యీ హైటెక్ యుగమ్ము నందు
యాంత్రికమ్మైన జీవన యానమందు
పండుగకు నర్థమే మారి దండుగయ్యె !!!


యాంకర్ల కృత్రిమమ్మగు శుభాకాంక్షలే ,
  హరిదాసు దీవెనలందలేము !
సంక్రాంతి ప్రత్యేక చలన చిత్రమ్ములే ,
  హరికథా శ్రవణ భాగ్యమ్ము లేదు !
మొక్కుబడిగ వేయు ముంగిట ముగ్గులే ,
  కళ్లాపి , గొబ్బిళ్లు కానలేము !
పండుగ నాడైన ఫాస్టు ఫుడ్ విందులే ,
  పరమాన్న భోజన ప్రాప్తి లేదు !

పనులు మాని సోమరులుగా పగలు రేయి
దూరదర్శినిలో శిరోభారమైన
సీరియళ్లను చూచుటే జీవితమున
ధ్యేయమై సమాజమ్ము వర్థిల్లు నేడు !!!

8, జనవరి 2011, శనివారం

కాకి - కోకిల ... కనుక్కోవడం యెలా ???

కాకి రంగు నలుపు ; కోకిలమ్మ నలుపు
వాటి మధ్య భేద భావమేమి?
ఆ వసంత కాల మరుగుదెంచిన మీద
వాటి వాటి గుట్టు బయటపడును !!!
( డా. విష్ణునందన్ )

కాకీ , కోకిలా రెండూ నలుపు రంగులోనే వుంటాయి కదా ! మరి, కాకి కీ , కోకిలకూ వున్న భేదమేమిటీ? అంటే వసంత కాలం రానీ......అప్పుడు కోకిల కమ్మగా , వీనుల విందుగా పాటలు పాడుతుంది . కాకేమో యథా ప్రకారం కర్ణకఠోరంగా కారుకూతలు కూస్తూనే వుంటుంది. అదీ తేడా!!!

ఇక్కడ యింకో విశేషం కూడా యేమంటే , యెంతటి సమర్థునికైనా తనదైన రోజు , తనదైన సమయం వస్తేనే , తన శక్తిసామర్థ్యాలేమిటో ప్రపంచానికి చాటిచెప్పగలడు . అనుకూలించిన ఆ రోజు , తానెవరో , తన దగ్గరున్న ప్రతిభాపాటవాలేమిటో బాహ్య ప్రపంచం గుర్తించేలా చేయగలడు . అప్పటి దాకా , తన చుట్టూ చేరిన కాకుల గుంపులెన్ని కారు కూతలు కూసినా మౌనంగా సహించవలసిందే !!! " అనువుగాని చోట అధికులమనరాదు " వుండనే వుంది కదా !!! మనదైన రోజు మనల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తుందీ లోకం !!! అదీ విశేషం !!! మన భారతీయులకు కొత్తగా ' పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోచింగ్ ' లేమీ అక్కర్లేదు ....మన ప్రాచీన సాహిత్య సంపద చాలు.....అధ్యయనం చేయగలిగే శక్తీ , ఆసక్తీ వుంటే చాలు !!!

" కాకః కృష్ణః పికః కృష్ణః    
కో భేదః పిక కాకయోః
వసంత కాలే సంప్రాప్తే
కాకః కాకః పికః పికః "  ( సంస్కృత మూలం )

7, జనవరి 2011, శుక్రవారం

" భ్రూణ హత్య "

పదవే పోదము! పోయి నీ కడుపులో వర్థిల్లు మా వంశ సం
పద పెంపొందగజేయు వారసుని రూపంబొక్కసారైన నా
మదినుప్పొంగగ జూడగా వలయు! భామా! రమ్ము వేగమ్ముగా
నిది యేమే? యిటులింత నెమ్మదియ? రావే!పోదమివ్వేళనే!!!

ఇద్దరు నాడపిల్లలపుడే! యిది మూడవ కానుపింకపై
ముద్దులు మూటగట్టు శిశువున్ మగకందును కన్నజాలు నే
నెద్దియు గోరనింక వినవే!పదవే!యికనాలసించకే!
అద్దిరబన్న!అప్పుడెగదా తలనెత్తెద సంతసంబుతో!

అమ్మానాన్నలు చెప్పినారు గద! నూరారైన నీ సారి నీ
వమ్మాయింగనరాదు! యెన్ని కలలో అవ్వారికీ కాన్పుపై !
వమ్మున్ జేయకు వారి కోరికలనో వామాక్షి! నీ పైన భా
రమ్మున్ మోపితినేమి చేసెదవొ? మా ప్రారబ్ధమెట్లున్నదో?

సరి!సరి! రెండు మారులిదె సంగతి జెప్పితిగాని చాలు, సం
బరపడనేల? చూతమది వైద్యుడు పల్కిన మీద- మెల్లిగా
నరుగుదమిట్లు లోపలికి - ఆ! అటులే శయనించనోపు:నూ
పిరినట పట్టియుంచగదవే నిమిషమ్ము పరీక్ష సేయగన్!!!

ఆ( యేమీ? యిది నిక్కమా? మరల చేయంగూడదా? ఈ పరీ
క్షా యంత్రమ్ము సరైనదా? యిది యెలా సాధ్యమ్ము? నేనొల్ల న
య్యో! యేనెంత యదృష్టహీనుడ నయయ్యో! యేమి యీ ఖర్మ! నా
కే యీ కష్టము దాపురించవలెనా? ఏమింక నే సేయుదున్?

ఇకనాలస్యము సేయరాదు! వినవేమే! గర్భ విచ్ఛిత్తియే
యొక మార్గమ్ముగ తోచుచున్నదొక వేయో, రెండు వేలో యొసం
గి కలంకమ్మునదల్చి వేసెదములే! గీ ( పెట్టబోకట్లు; మా
రిక మాట్లాడకు చెప్పినట్లు విను! సైరింపంగ లేనింకపై!

ఇది యొక తండ్రి గాథ! విలపించుచు క్రుంగిన తల్లి బాధ! యీ
సొదలనెరుంగలేని నలుసొక్కటి గూర్చిన గాథ! కొంత నె
మ్మదిగ సమీక్ష సేయుము సమాజమ! నాగరిక ప్రపంచమా!
మదిని కలంచివేయు పెను మాయని మచ్చ మనుష్య జాతికిన్!

ఎచ్చట స్త్రీకి గౌరవమునిచ్చి జనావళి పూజసేయునో
అచ్చట దేవతాగణము లాదృతి సంతసమందునన్న - ఆ
ముచ్చట మీరెరుంగనిదె? మోహము వీడి చరింపబూను డీ
మచ్చరమెంత దారుణమమానుషమో గమనింపుడియ్యెడన్!

అమ్మల గన్నట్టి ఆది పరాశక్తి
ఆడది యే కదా! ఆర్యులార!
ధీ ప్రచోదని మహాదేవి ఆ గాయత్రి
మహిళయే కద ! బుద్ధిమంతులార!
లక్ష్మీ సరస్వతి - లలిత కాత్యాయని
పడతులే కద మహా ప్రాజ్ఞులార!
అది యేల?మిము గన్న అమ్మ , మీ భార్యయు
వెలదులు కాదొకో విబుధులార!

అమ్మ కడుపులోన హాయిగా పవళించి
పోత పోసికొనెడి లేత కందు
చిన్ని చిన్ని తల్లి చిన్నారి మరుమల్లి
చిదిమి వేయనెట్లు చేతులాడు?

ఎన్నో యేళ్లు పరిశ్రమించి నవశాస్త్రీయానుగుణ్యంబుగా
మిన్నుల్ తాకెడి రీతిలో నవనవోన్మేషంబుగా సర్వధా
విన్నాణంబని మెచ్చు పద్ధతి మహా విజ్ఞానమార్జించినన్
సున్నాయే కద మానవత్వము వినా సూక్ష్మమ్ముగా జూచినన్!

బాలకుడైన నేమి? మరి బాలిక పుట్టిననేమి? సృష్టిలో
చాల ప్రధానమే! తెలియజాలిన వారికి లోకమెల్ల సౌ
ఖ్యాల నివాసమై గుణవికాసము కల్గు ; గ్రహింపలేనిచో
నేల మనుష్య జీవనమికేల వివాహ విలాస భావనల్?

మరియొక యిర్వదేండ్లకు కుమార్తె వివాహము సేయబూనుచో
వరునకు లక్ష లీవలె నవారితమంచు కృశింపనేల ని
త్తెరగున నేమి న్యాయమిది? తేకువతో జరియింప మేలు! కిం
కరుడె నృపుండు కాగలడు కాలవశంబున చింతలేటికిన్?

మ్రొగ్గ ద్రుంచివేయు మూర్ఖత్వమును వీడి
బతికి, బతుకనిచ్చు బాట నెరిగి
భువిని స్వర్గసీమ పొల్పొందగా జేసి
అఖిల జనులు సౌఖ్యమందవలయు!!!

( తాత్పర్యం వీలు వెంబడి ప్రచురిస్తాను......మొదటి ఆరు పద్యాలూ కడుపులో వున్న శిశువు ఆడా మగా అనే ఆత్రుతతో భార్యను ' స్కానింగ్ సెంటర్ ' కు తీసికొని వెళ్లు భర్త తన భార్యతో మాట్లాడే పద్ధతి. కడుపులో వున్నది మళ్లీ ఆడ శిశువే అని తెలిసిన తరువాత ' గర్భ విచ్ఛిత్తికి ' పాల్పడడానికి భార్యను ఆజ్ఞాపించే ధోరణి !!!   )

2, జనవరి 2011, ఆదివారం

బాదరాయణ సంబంధమంటే????

" బదరీ చక్రము నాదగు
బదరీ వృక్షమ్ము
నీదు వాకిట నిదిగో !
మది దోచె బాదరాయణ
మిది బంధము ; మాకు మేమె ! మీకున్ మీరే !!! "  


ఏ బంధమూ లేకున్నా యేదో ఒక చుట్టరికం కలుపుకుని హడావిడి చేసే వింత మనుష్యులను చలనచిత్రాల్లో చూస్తూనే వుంటాం....కొండొకచో నిజజీవితంలోనూ అలాంటి స్వభావాలు తారసపడకపోరు ......యెవరండీ అని అడిగితే ఆ ఏదో ' బాదరాయణ సంబంధం ' అని సమాధానాలు యెడనెడ వినపడుతూనే వుంటాయి.

బీరకాయపీచు సంబంధం అన్నా....యిదిగో ఈ బాదరాయణ సంబంధమే ....యింతకీ ఈ బాదరాయణ సంబంధమన్న మాట యెలా వచ్చిందీ???

పూర్వం యిలాంటి ఒక పెద్ద మనిషి పట్నానికి తన బండిలో బయలుదేరాడట  . పక్కూరికి రాగానే బండి యిరుసు లో యేదో కాస్త సమస్య తలెత్తి బండి మొరాయించిందట . ఈయనగారు అల్లా యిల్లా చూచి ...యెదురుగా వున్న ఒక యింట్లోకి సరాసరి ఠీవిగా నడిచి మండువాలో పడక్కుర్చీలో విశ్రమించాడట . సమయానికి యిల్లుగలాయన లేడు . ఇంటావిడేమో మొగుడి తరఫు చుట్టం కాకపోతే ఇంత జబర్దస్తీగా వొచ్చి కూర్చుంటాడా ? వీళ్ల దాష్టీకం మండిపోనూ అనుకుంటూనే ,  కాళ్లు కడుక్కోడానికి నీళ్లూ , తాగడానికి మంచినీళ్లూ , పాలేరును పురమాయించి తెప్పించిన అరటి ఆకులో వేడి వేడి కమ్మని భోజనం , అరిసెలూ ,బూరెలూ ,పులిహోర ,యింతింత నెయ్యీ ,అన్నీ వడ్డిస్తూ కూర్చుంది.

ఇతగాడేమో...తాను తిని తృప్తిగా త్రేన్చడమే కాక  , ' అమ్మాయ్ అదే చేత్తో ఆ బండివాడికీ కాస్త అన్నం పెట్టూ....ఆ యెద్దులకు కాస్త యెండుగడ్డి కూడా ' అంటూ ఆజ్ఞాపనలూ కూడానూ

ఇంటిపెద్ద వచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా మారిపోయింది ....' ఆహా యితగాడెవరో నా భార్యవైపు వాడై వుంటాడు ...లేకుంటే మా వాళ్లకి యిన్ని రాజభోగాలెప్పుడైనా జరిగేనా ' అని అతగాడి బాధ మనసులో.....

సరే మనవాడు అక్కడే కాసేపు విశ్రమించి , అవీ యివీ పోచుకోలు కబుర్లాడి ,కాలక్షేపం చేసి....నిక్షేపంగా ఓ కునుకు తీసి....బండి సిద్ధమైందని బండివాడి కేకతో మేల్కొని....ప్రయాణానికి సిద్ధమయ్యేలోగా భార్యాభర్తల మధ్య ఓ చిన్నపాటి కీచులాట !!!

మీ వాళ్ల దాష్టీకం చూడండంటూ భార్య దెప్పిపొడుపులూ ,అబ్బే మీ వారనుకున్నా ,అందుకే యింత వైభోగాలంటూ భర్త వెర్రిమొగం వేయడాలూ ....సరే యిద్దరూ కూడబలుక్కుని ' యింతకీ తమరెవరు స్వామీ ?' అని అడిగితే ఆ పెద్దాయన చెప్పాడిలా

" అస్మాకం బదరీ చక్రం
యుష్మాకం బదరీ తరుః
బాదరాయణ సంబంధాత్
యూయం యూయం వయం వయం "


అయ్యా నా బండి చక్రమేమో బదరీ (రేగు చెట్టు ) శాఖలతో చేయబడింది.....మరి మీ యింటి ముందేమో....అల్లదిగో బదరీ (రేగు చెట్టు) వృక్షముంది....సరే మనం మనం ఒకటే కదా అని లోపలికొచ్చేశాను ....ఇదిగో ఇదీ మన 'బాదరాయణ సంబంధం '.....అంతే కానీ మీరు మీరే....మేము మేమే.....అంటూ చక్కా వెళ్లిపోయాడట !!!!

నోరెళ్లబెట్టడం భార్యాభర్తల వంతైంది......

" బదరీ చక్రము నాదగు
బదరీ వృక్షమ్ము
నీదు వాకిట నిదిగో !
మది దోచె 'బాదరాయణ
మిది' బంధము ; మాకు మేమె ! మీకున్ మీరే !!! "  ( డా. విష్ణునందన్ )

ఆంధ్ర కవి ప్రశంసా మాలిక

* మును తానాంధ్ర కవిత్వ భూజమున కామోదమ్ముతో ప్రేమతో
  ననురాగమ్మొనరన్ జలంబులిడి యాప్యాయమ్ముగా పాదు తీ
  సిన ధీశాలిని నన్నపార్యుని కవిశ్రేష్ఠున్ మదిన్ గొల్చి ; తి
  క్కన సమ్యక్కృత పద్యశిల్ప ఘన యజ్ఞ శ్లాఘ్య నిర్వాహకున్
  వినయంబొప్పగ సంస్తుతించి ; విబుధున్ , విస్తార విఖ్యాతు నె
  ఱ్ఱన సత్కావ్య మహాప్రబంధ రచనా ప్రాగ్రేసరున్ దల్చి ; పో
  తన మందార మరందు బిందు సమ పద్యప్రౌఢి సౌలభ్య శై
  లిని సద్భక్తి భజించి ; కీర్తి వనితాశ్లేషాప్త సద్భాగ్య శీ
  లిని శ్రీనాథ కవీంద్రు చాటు కవితా లీలా చమత్కార వా
  గ్ధను బూజించి ; మహాంతరార్థయుత సత్కావ్యాను సంధాను బె
  ద్దన బాండిత్య నిధిన్ నుతించి ; సుగుణోద్యత్ కీర్తి పాత్రున్ సుధీ
  జన చిత్తప్రియు రామకృష్ణకవి సంశ్లాఘించి ; పేర్మిన్ మన
  మ్మున నత్యద్భుత భావసంయుత ' కళా పూర్ణోదయ స్రష్ట ' సూ
  రన విద్వత్కవి , ద్వ్యర్థి కావ్యరచనా ప్రాజ్ఞున్ ప్రశంసించి ; భూ
  వనితా కాంతుని నాంధ్రభోజ బిరుద భ్రాజిష్ణు శ్రీ కృష్ణ రా
  యని సంప్రీతి స్మరించి పూర్వకవి సమ్యక్ రీతి  సారస్వతా
  ర్చనమెల్లన్ గణియించి వారల సుధీ సంపన్నతన్ మెచ్చెదన్ !!!

1, జనవరి 2011, శనివారం

స్వాగతమో నూత్న వత్సరమ్మ !

* శ్రీకరమై ; సజ్జన సౌ
  ఖ్యాకరమై ; నూత్న వత్సరాది - శుభాశీః
  ప్రాకట సంపద బ్రోచుత
  లోకావళి సత్కృపా విలోకనవతియై !

* కోటి ఆశల మోసికొని వేగ రావమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ!
  క్రొత్త ఆశయ సిద్ధి గూర్పగా రావమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ !
  వీలయినంతలో మేలు జేయగదమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ !
  కడగండ్ల కన్నీళ్లు అడుగంటవలెనమ్మ
    స్వాగతమో నూత్న వత్సరమ్మ !

 కలతలన్నింటినింక పోకార్చవమ్మ !
 నలతలన్నింటినింక దున్మాడవమ్మ !
 కొరత లేకుండ క్షేమమ్ము గూర్పవమ్మ !
 తలతు నిన్నింక ! దయతోడ మెలగవమ్మ !!!