7, జనవరి 2011, శుక్రవారం

" భ్రూణ హత్య "

పదవే పోదము! పోయి నీ కడుపులో వర్థిల్లు మా వంశ సం
పద పెంపొందగజేయు వారసుని రూపంబొక్కసారైన నా
మదినుప్పొంగగ జూడగా వలయు! భామా! రమ్ము వేగమ్ముగా
నిది యేమే? యిటులింత నెమ్మదియ? రావే!పోదమివ్వేళనే!!!

ఇద్దరు నాడపిల్లలపుడే! యిది మూడవ కానుపింకపై
ముద్దులు మూటగట్టు శిశువున్ మగకందును కన్నజాలు నే
నెద్దియు గోరనింక వినవే!పదవే!యికనాలసించకే!
అద్దిరబన్న!అప్పుడెగదా తలనెత్తెద సంతసంబుతో!

అమ్మానాన్నలు చెప్పినారు గద! నూరారైన నీ సారి నీ
వమ్మాయింగనరాదు! యెన్ని కలలో అవ్వారికీ కాన్పుపై !
వమ్మున్ జేయకు వారి కోరికలనో వామాక్షి! నీ పైన భా
రమ్మున్ మోపితినేమి చేసెదవొ? మా ప్రారబ్ధమెట్లున్నదో?

సరి!సరి! రెండు మారులిదె సంగతి జెప్పితిగాని చాలు, సం
బరపడనేల? చూతమది వైద్యుడు పల్కిన మీద- మెల్లిగా
నరుగుదమిట్లు లోపలికి - ఆ! అటులే శయనించనోపు:నూ
పిరినట పట్టియుంచగదవే నిమిషమ్ము పరీక్ష సేయగన్!!!

ఆ( యేమీ? యిది నిక్కమా? మరల చేయంగూడదా? ఈ పరీ
క్షా యంత్రమ్ము సరైనదా? యిది యెలా సాధ్యమ్ము? నేనొల్ల న
య్యో! యేనెంత యదృష్టహీనుడ నయయ్యో! యేమి యీ ఖర్మ! నా
కే యీ కష్టము దాపురించవలెనా? ఏమింక నే సేయుదున్?

ఇకనాలస్యము సేయరాదు! వినవేమే! గర్భ విచ్ఛిత్తియే
యొక మార్గమ్ముగ తోచుచున్నదొక వేయో, రెండు వేలో యొసం
గి కలంకమ్మునదల్చి వేసెదములే! గీ ( పెట్టబోకట్లు; మా
రిక మాట్లాడకు చెప్పినట్లు విను! సైరింపంగ లేనింకపై!

ఇది యొక తండ్రి గాథ! విలపించుచు క్రుంగిన తల్లి బాధ! యీ
సొదలనెరుంగలేని నలుసొక్కటి గూర్చిన గాథ! కొంత నె
మ్మదిగ సమీక్ష సేయుము సమాజమ! నాగరిక ప్రపంచమా!
మదిని కలంచివేయు పెను మాయని మచ్చ మనుష్య జాతికిన్!

ఎచ్చట స్త్రీకి గౌరవమునిచ్చి జనావళి పూజసేయునో
అచ్చట దేవతాగణము లాదృతి సంతసమందునన్న - ఆ
ముచ్చట మీరెరుంగనిదె? మోహము వీడి చరింపబూను డీ
మచ్చరమెంత దారుణమమానుషమో గమనింపుడియ్యెడన్!

అమ్మల గన్నట్టి ఆది పరాశక్తి
ఆడది యే కదా! ఆర్యులార!
ధీ ప్రచోదని మహాదేవి ఆ గాయత్రి
మహిళయే కద ! బుద్ధిమంతులార!
లక్ష్మీ సరస్వతి - లలిత కాత్యాయని
పడతులే కద మహా ప్రాజ్ఞులార!
అది యేల?మిము గన్న అమ్మ , మీ భార్యయు
వెలదులు కాదొకో విబుధులార!

అమ్మ కడుపులోన హాయిగా పవళించి
పోత పోసికొనెడి లేత కందు
చిన్ని చిన్ని తల్లి చిన్నారి మరుమల్లి
చిదిమి వేయనెట్లు చేతులాడు?

ఎన్నో యేళ్లు పరిశ్రమించి నవశాస్త్రీయానుగుణ్యంబుగా
మిన్నుల్ తాకెడి రీతిలో నవనవోన్మేషంబుగా సర్వధా
విన్నాణంబని మెచ్చు పద్ధతి మహా విజ్ఞానమార్జించినన్
సున్నాయే కద మానవత్వము వినా సూక్ష్మమ్ముగా జూచినన్!

బాలకుడైన నేమి? మరి బాలిక పుట్టిననేమి? సృష్టిలో
చాల ప్రధానమే! తెలియజాలిన వారికి లోకమెల్ల సౌ
ఖ్యాల నివాసమై గుణవికాసము కల్గు ; గ్రహింపలేనిచో
నేల మనుష్య జీవనమికేల వివాహ విలాస భావనల్?

మరియొక యిర్వదేండ్లకు కుమార్తె వివాహము సేయబూనుచో
వరునకు లక్ష లీవలె నవారితమంచు కృశింపనేల ని
త్తెరగున నేమి న్యాయమిది? తేకువతో జరియింప మేలు! కిం
కరుడె నృపుండు కాగలడు కాలవశంబున చింతలేటికిన్?

మ్రొగ్గ ద్రుంచివేయు మూర్ఖత్వమును వీడి
బతికి, బతుకనిచ్చు బాట నెరిగి
భువిని స్వర్గసీమ పొల్పొందగా జేసి
అఖిల జనులు సౌఖ్యమందవలయు!!!

( తాత్పర్యం వీలు వెంబడి ప్రచురిస్తాను......మొదటి ఆరు పద్యాలూ కడుపులో వున్న శిశువు ఆడా మగా అనే ఆత్రుతతో భార్యను ' స్కానింగ్ సెంటర్ ' కు తీసికొని వెళ్లు భర్త తన భార్యతో మాట్లాడే పద్ధతి. కడుపులో వున్నది మళ్లీ ఆడ శిశువే అని తెలిసిన తరువాత ' గర్భ విచ్ఛిత్తికి ' పాల్పడడానికి భార్యను ఆజ్ఞాపించే ధోరణి !!!   )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి