2, జనవరి 2011, ఆదివారం

బాదరాయణ సంబంధమంటే????

" బదరీ చక్రము నాదగు
బదరీ వృక్షమ్ము
నీదు వాకిట నిదిగో !
మది దోచె బాదరాయణ
మిది బంధము ; మాకు మేమె ! మీకున్ మీరే !!! "  


ఏ బంధమూ లేకున్నా యేదో ఒక చుట్టరికం కలుపుకుని హడావిడి చేసే వింత మనుష్యులను చలనచిత్రాల్లో చూస్తూనే వుంటాం....కొండొకచో నిజజీవితంలోనూ అలాంటి స్వభావాలు తారసపడకపోరు ......యెవరండీ అని అడిగితే ఆ ఏదో ' బాదరాయణ సంబంధం ' అని సమాధానాలు యెడనెడ వినపడుతూనే వుంటాయి.

బీరకాయపీచు సంబంధం అన్నా....యిదిగో ఈ బాదరాయణ సంబంధమే ....యింతకీ ఈ బాదరాయణ సంబంధమన్న మాట యెలా వచ్చిందీ???

పూర్వం యిలాంటి ఒక పెద్ద మనిషి పట్నానికి తన బండిలో బయలుదేరాడట  . పక్కూరికి రాగానే బండి యిరుసు లో యేదో కాస్త సమస్య తలెత్తి బండి మొరాయించిందట . ఈయనగారు అల్లా యిల్లా చూచి ...యెదురుగా వున్న ఒక యింట్లోకి సరాసరి ఠీవిగా నడిచి మండువాలో పడక్కుర్చీలో విశ్రమించాడట . సమయానికి యిల్లుగలాయన లేడు . ఇంటావిడేమో మొగుడి తరఫు చుట్టం కాకపోతే ఇంత జబర్దస్తీగా వొచ్చి కూర్చుంటాడా ? వీళ్ల దాష్టీకం మండిపోనూ అనుకుంటూనే ,  కాళ్లు కడుక్కోడానికి నీళ్లూ , తాగడానికి మంచినీళ్లూ , పాలేరును పురమాయించి తెప్పించిన అరటి ఆకులో వేడి వేడి కమ్మని భోజనం , అరిసెలూ ,బూరెలూ ,పులిహోర ,యింతింత నెయ్యీ ,అన్నీ వడ్డిస్తూ కూర్చుంది.

ఇతగాడేమో...తాను తిని తృప్తిగా త్రేన్చడమే కాక  , ' అమ్మాయ్ అదే చేత్తో ఆ బండివాడికీ కాస్త అన్నం పెట్టూ....ఆ యెద్దులకు కాస్త యెండుగడ్డి కూడా ' అంటూ ఆజ్ఞాపనలూ కూడానూ

ఇంటిపెద్ద వచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా మారిపోయింది ....' ఆహా యితగాడెవరో నా భార్యవైపు వాడై వుంటాడు ...లేకుంటే మా వాళ్లకి యిన్ని రాజభోగాలెప్పుడైనా జరిగేనా ' అని అతగాడి బాధ మనసులో.....

సరే మనవాడు అక్కడే కాసేపు విశ్రమించి , అవీ యివీ పోచుకోలు కబుర్లాడి ,కాలక్షేపం చేసి....నిక్షేపంగా ఓ కునుకు తీసి....బండి సిద్ధమైందని బండివాడి కేకతో మేల్కొని....ప్రయాణానికి సిద్ధమయ్యేలోగా భార్యాభర్తల మధ్య ఓ చిన్నపాటి కీచులాట !!!

మీ వాళ్ల దాష్టీకం చూడండంటూ భార్య దెప్పిపొడుపులూ ,అబ్బే మీ వారనుకున్నా ,అందుకే యింత వైభోగాలంటూ భర్త వెర్రిమొగం వేయడాలూ ....సరే యిద్దరూ కూడబలుక్కుని ' యింతకీ తమరెవరు స్వామీ ?' అని అడిగితే ఆ పెద్దాయన చెప్పాడిలా

" అస్మాకం బదరీ చక్రం
యుష్మాకం బదరీ తరుః
బాదరాయణ సంబంధాత్
యూయం యూయం వయం వయం "


అయ్యా నా బండి చక్రమేమో బదరీ (రేగు చెట్టు ) శాఖలతో చేయబడింది.....మరి మీ యింటి ముందేమో....అల్లదిగో బదరీ (రేగు చెట్టు) వృక్షముంది....సరే మనం మనం ఒకటే కదా అని లోపలికొచ్చేశాను ....ఇదిగో ఇదీ మన 'బాదరాయణ సంబంధం '.....అంతే కానీ మీరు మీరే....మేము మేమే.....అంటూ చక్కా వెళ్లిపోయాడట !!!!

నోరెళ్లబెట్టడం భార్యాభర్తల వంతైంది......

" బదరీ చక్రము నాదగు
బదరీ వృక్షమ్ము
నీదు వాకిట నిదిగో !
మది దోచె 'బాదరాయణ
మిది' బంధము ; మాకు మేమె ! మీకున్ మీరే !!! "  ( డా. విష్ణునందన్ )

8 కామెంట్‌లు:

  1. విన్నకథైనా మరో సారి మీ ద్వారా వినడం బావుందండి. :))

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది నాకిప్పటివరకు తెలియదు

    రిప్లయితొలగించండి
  3. దీనివెనక ఇంత కథ ఉందా...? బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. బాదరాయణ సంబంధం వెనకున్న కథను ఆసక్తికరంగా చెప్పారు! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. @ సత్యార్థి , తేజస్వి , వేణు గారు
    ధన్యవాదాలు

    @ రవి గారు
    అవునండి....మరల నిదేల యీ బాదరాయణమంటే.......నాకూ యీ కథకూ ఒక ' బాదరాయణ సంబంధం ' వుంది ...మాది ' బాదరాయణ గోత్రం ' మరి !!!! అందుకనీ..... :))

    రిప్లయితొలగించండి
  6. మీరు ఆనందిస్తూ చక్కని పద్యాలూ వ్రాస్తారు. నేను ఆ చక్కటి పద్యాలు చదవి ఆనందిస్తాను.
    మీకూ, నాకూ 'పద్యాయణ సంబధం' ఉంది, డాక్టర్ గారూ

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం (బెంగళూరు)

    రిప్లయితొలగించండి
  7. @ మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు - ధన్యవాదాలు.....మీ సాహిత్యాభిమానం ఎన లేనిది.....!!!
    @ మంద పీతాంబర్ గారు - కృతజ్ఞతలు !!!!

    రిప్లయితొలగించండి