13, నవంబర్ 2011, ఆదివారం

పెండ్లి

అగ్ని సాక్షిగ - వేద మంత్రాన్వితముగ
మధుర మంగళ తూర్య సమాహితముగ
నంగరంగ వైభవముగా నతిశయిల్లు
పెండ్లి - బంధు మిత్రుల కనువిందు నేడు !

అనురాగమ్మనుకూల వర్తనము - గాఢాకర్షణాన్యోన్య భా
వనమే పెండిలి - నిత్య సత్యము , మహాద్వైత ప్రబోధమ్మగున్ !
తనువుల్ రెండగు నంతరాత్మ యొకటై తాదాత్మ్యమున్ జెందు నీ
ఘన వైవాహిక బంధమే మహిత యోగంబౌను ధాత్రీ స్థలిన్ !!! 

రాబోయే ఒకానొక పెండ్లికి వధూవరులకిచ్చిన ఉపదేశం లాంటి సందేశం !!!

6, నవంబర్ 2011, ఆదివారం

దుర్లక్షణం

మంచిని జెప్పుచో సుగుణ మాన్యుడు సమ్మతి దెల్పు ; మధ్యముం
డంచిత మౌన భావ యుతుడై తొలగున్ దెరచాటు శీఘ్రమే ;
కొంచెపు బుద్ధితో మెలగి గొంటుదనమ్మున వాదమూని గ
ర్వించును గాదె నీచుడు ; ధరిత్రి మనుష్యులు పెక్కు భంగులున్ !


ఈ మధ్య - ఒక పవిత్రమైన స్థలి లో , జరిగిన ఒకానొక సంభాషణా శ్రవణ కారణ సంజనితము . పిలవని పేరంటానికి వచ్చి ,  నీ పేరంటం నాకు నచ్చలేదు , పేరంటం వెంటనే ఆపేయమనడమూ , నచ్చజెప్పబూనితే తిరస్కార ధోరణి లో మాట్లాడడమూ - లోకం లోని వివిధ మానసిక జాడ్యాలలో ఇదీ ఒకటి కాబోలు !