29, డిసెంబర్ 2010, బుధవారం

" ధర్మదండమనే పేరే యెందుకూ ??? "

ధర్మదండమనే పేరే యెందుకూ ? మరొకటి యెందుకు కాదూ ? కాకూడదూ అని ప్రశ్న !  కాదూ , కాకూడదూ అనే సమాధానం ....


ఆనాడెన్నడో  విజృంభించిన శూన్యవాద మిథ్యావాదాల ధాటికి , ప్రాచీన సనాతన ధర్మం తాళలేక , చిగురుటాకు వలె వణికిపోతూ , ఆర్ష పథానికి దారీ తెన్నూ కనపడక , నిస్సహాయమైన స్థితిలో , కాలూ చేయీ ఆడక , క్రుంగిపోతూన్న దశలో , యిదిగో నేనున్నానంటూ ఆర్త త్రాణపరాయణుడై , ఆపన్న శరణాగతితో , ధర్మ గ్లాని ని తప్పించడానికి,  ముక్తి మార్గ నిర్దేశానికి అవతరించిన సాక్షాత్తూ శంకరుడైన ఆ ఆదిశంకరాచార్యుల  చేతిలోని దీక్షాదండమే ' ధర్మదండం ' కాబట్టి !

చక్రవర్తి చేతిలో ప్రకాశిస్తూ యిహ లోకాన్ని శాసించేది  ' రాజదండమైతే ' ------ ఈ యతి సార్వభౌముని చేతిలో కొలువుండి ఆధ్యాత్మిక , పారలౌకిక ప్రపంచాన్ని ఒక దిక్సూచివలె నడిపిస్తూ పరిపాలించేది యీ ' ధర్మ దండం ' కాబట్టి !

యమ ధర్మ రాజు చేతిలోని ' మృత్యు దండాన్ని ' కసరికొట్టి , విసిరి వేయగల అమోఘమైన ప్రభావశీలి యీ ' ధర్మదండమే ' కాబట్టి !

సజ్జన మార్గం లో నడిచేవారికి ' వూతకర్ర ' గానూ.....దారితప్పి ప్రవర్తించే దుర్జనుల పాలి ' ముల్లు కర్ర ' గానూ .....యావత్ మానవ జాతికి ఒక ' జీవగర్ర '  గానూ ......దిశానిర్దేశం చేయగలిగే మహామహిమాన్వితమైన మంత్రదండం యీ ' ధర్మదండమే ' కాబట్టి !

మరి భవదీయునకూ , యీ ' ధర్మదండానికీ ' గల సంబంధమేమంటారా? భక్తవశంకరుడైన ఆ మహనీయుని జీవిత  చరిత్ర ను పద్యకావ్య రూపంలో ' ధర్మదండం ' పేర వ్రాయగలిగే....వ్రాయబోయే అదృష్టం , ఆ పుణ్యం దక్కడమే ..... ప్రాక్తన పుణ్య లేశ ఫలితమే !

' ధర్మదండం ' ఒక ప్రతీకాత్మకం ..... ' ధర్మదండం ' ఒక గుణాత్మకం ..... ' ధర్మ దండం '  ఒక స్వభావాత్మకం ....అంతే !!!

* మహిత గుణప్రపూతమయి ; మార్మిక ధర్మ ఫల ప్రసాదమై ;
  బహుముఖ దీవ్యదార్ష పథ వైభవ సంతత మార్గదర్శియై;
  అహిత సమస్త లోక దురితాపనుదమ్మయి , సత్ప్రమాణమై;
  సహిత సనాతన ప్రథిత సత్యమునైనది ధర్మ దండమే!!!

( మహా సుగుణములతో విశుద్ధమైనటువంటిదియూ , సూక్ష్మమైన రహస్యమైన ధర్మ ఫలాలను ప్రసాదించునటువంటిదైనదియూ , బహుముఖాలు గా విలసిల్లిన ఆర్ష సంప్రదాయ వైభవోపేతమైన మార్గాన్ని దర్శింపజేయునటువంటిదియూ , దుర్మార్గ లోకపు సమస్త పాపాలనూ దూరముగా పోగొట్టునదియూ , మంచి ప్రమాణాలను నెలకొల్పునదియూ , సనాతన మనే సత్యముతో కూడుకొన్నదియూ యీ ధర్మదండమే !!! ) 

* పురహరుడే తలంచి , యతి పోలిక నీభువి కేగుదెంచి , శం
  కర గురుడై జనించి , యొక కారణ జన్ముడుగా జరించి , ని
  ర్భర కరుణన్ వహించి , జిన బౌద్ధములన్ నిరసించి , మించె నా
  వర యతి హస్త భూషణ శుభ ప్రతిపన్నము ధర్మదండమే !!! 

(ఒకానొక సన్యాసి వోలె భువిపై శంకరాచార్యుడై అవతరించి , కారణ జన్ముడై , నాస్తిక వాదాలను పటాపంచలు చేసి , సనాతన ధర్మ పునః ప్రతిష్ఠ గావించి మించిన ఆ యీశ్వరుని అపరావతారమైన యతి సార్వభౌముని చేతిలో హస్తభూషణమై శుభప్రదమైనది యీ ధర్మదండమే !!! )

* శంకరు ; భక్త సంచయ వశంకరు ; మోహలతా సమూల నా
  శంకరు ; జ్ఞానవాఙ్మయ భృశంకరు ; సార్వజనీన దివ్య సౌ
  ఖ్యంకరు ; వేద విద్విష భయంకరు ; దీవ్యదమోఘ మోక్ష సా
  ధ్యంకరు ; సర్వ పాప విలయంకరు గొల్తు నభీష్ట సిద్ధికై  !!!

స్వస్తి !!!

28, డిసెంబర్ 2010, మంగళవారం

పెళ్లంటే?

వివాహానికి వేయి మంత్రాలు , పది వేల తంత్రాలూ , మరెన్నో అర్థాలూ , యింకెన్నో పరమార్థాలూ వుండి వుండొచ్చు గాక ! పెళ్లంటే యేమో చాలా సరళంగా......సూటిగా చెప్పాలంటే  , 


' నీవు'  - ' నేనను ' , వేర్వేరు భావములను
మాని ' మనము' గా మనుటయే " మనువు "  - అనిన
కలలు కలబోసి - మనసులు కలసి మెలసి
సలుపు సంసారమే సుధా సారమగును !!!!  

27, డిసెంబర్ 2010, సోమవారం

కరుణశ్రీ

* తీయని పాలధారలును ; తేనెల సోనలు - పూల వానలున్
  హాయిని గూర్చు తెమ్మెరలు ; అల్లన పిల్లనగ్రోవి వోలె ' ఓ
  హో ' యనిపించు రాగములు , నుల్లము నూయెలలూపు భావముల్
  మాయురె ! నీ కవిత్వ రస మాధురి లో రవళించు సత్కవీ!!!

* మనసుకు నచ్చినట్టి సుకుమారుడు - మారుడు , వీని చెంత కో
  రిన యశమున్ గడింతును ; వరింతు ; తరింతు ; చరింతు వీని నా
  ల్కను యని నిన్ను చేరినది కమ్ర కవిత్వ వధూటి ; పాండితీ
  ధనమును శుల్కమిచ్చినది - ధన్యత గాంచితివయ్య సత్కవీ !!!

* అలతి అలతి పదాలతో నార్ద్రమైన
  భావములు పల్కగా నీకు నీవ సాటి !
  కరుణ రసమును చిందు నీ కవితలందు
  వెల్లి విరియును తెలుగుల వెలుగులవని !

* నీవు పద్యమ్ములను ' వ్రాయ ' లేవు స్వామి !
  నేత్రపర్వ మ్మపూర్వమౌ చిత్రములను
  కుంచె తో చిత్రకారుడు కూర్చు భంగి
  కలముతో ' భావ చిత్రణ ' సలుపగలవు !!!

( కుంతీ కుమారి వంటి పద్యాలు అక్షర సాక్ష్యాలు )

* విరుల కన్నీటి వెతలను వెల్లడించు
  కవితతో పాఠకుల కన్నుగవల యందు
  దుఃఖ హర్షాశ్రుధారలు తొణకునట్లు
  చేసినావయ్య సత్కవీ వాసికెక్కి !

* నయముగ - విద్వత్ శ్రేష్ఠ వి
  జయముగ - రసమయముగా - లసత్ జ్ఞాన మహో
  దయముగ - నీ కవితా సం
  చయ ' ముదయశ్రీ '  యశస్సు సంపాదించెన్ !!!

* సుందరమగు నీ కవితా
  మందార మరంద బిందు మాధుర్యమునన్
  చిందుల్ ద్రొక్కని యాంధ్రుం
  డెందుండును ? సందియమ్ములేలా? సుకవీ! 

* కమనీయము ; రమణీయము
  సుమనోజ్ఞము ; సురుచిరమ్ము ; శోభామయమై
  యమకాలంకారమ్ముల
  గమకించెడి నీ కవిత్వ కాంతన్ దలతున్ !!!

23, డిసెంబర్ 2010, గురువారం

" ప్రేయసి ! స్వప్న సుందరి !!! "

* నిన్నే నేనుగ నాత్మలో దలచితిన్ ; నీ ప్రేమకై వేచితిన్ ;
  సున్నాయౌ బ్రతుకీవు లేక చెలి ! దాసున్ నన్ను మన్నింపవే !
  చిన్నారీ ! కరుణార్ద్ర చిత్తమున సంక్షేమంబు సంధింపవే !
  నన్నో ప్రేయసి ! స్వప్న సుందరి ! మహానందాబ్ధి దేలింపవే !!!

* విద్యా గంధము , సద్వినీత విలసద్వృత్తాంతమున్ , సర్వధా
  హృద్యంబౌ కమనీయ రూపమును , దేవీ ! వూహ గల్పించు నీ
  వా ద్యౌ లోకపు కాంతవే యనుచు -  సమ్యక్ రీతి నే వ్రాసితిన్
  పద్యాల్ ; ప్రేయసి ! స్వప్న సుందరి మనోభావానుగుణ్యంబుగన్ !!!

( ఓ నా ప్రేయసీ ! స్వప్న సుందరీ !!! నీకున్న విద్యా బుద్ధులూ , మంచి నడవడిక , నీ సర్వాంగ సుందరమైన రూపమూ , యివన్నీ గమనిస్తే నువ్వు సాధారణ మానవ కాంత కాదేమో....సాక్షాత్తూ దేవ కన్యవేమో అని అనిపిస్తూంది ......నా యీ వూహకు , యీ మనోభావాలకూ తగినట్టుగా పద్యాలు రచిస్తూన్నాను !!! ) 

* ఆ రాయంచకు లేదు నీ నడకలో రాజిల్లు వయ్యార మౌ
  రా ! రాచిల్కకు లేదు నీ నుడువులో రంజిల్లు తీయందన
  మ్మా రంభాదులకైన లేవు కద ! నీ అందమ్ము చందమ్ము ల
  య్యారే ! ప్రేయసి ! స్వప్న సుందరి ! అమందానంద సంధాయినీ !!!

( అమితమైన ఆనందాన్ని చేకూర్చే నా ప్రేయసీ ! ఓ నా స్వప్న సుందరీ !!! నీ నడకలో రాజిల్లే వయ్యారాలు , కులుకులూ  ఆ రాజహంసకైనా లేనే లేవు...నీ పలుకు లో కదలాడే మృదుత్వమూ , ఆ తీయందనమూ ఆ రామ చిలుక పలుకుల్లోనూ లేవు....యిక నీ అందచందమ్ములా ? రంభాదులకైనా ముమ్మాటికీ లేనే లేవు కదా !!!.......)

* నీ కంఠమ్ము స్రవించు వాక్సుధల ; కానీ దేవి ! శంఖమ్ము హా
 హా కారమ్ములె సేయుచుండు సఖియా ! ఆకార సామ్యమ్మునన్
 నీ కంఠమ్మున పోల్పగాదగదు దానిన్ రాణి ముమ్మాటికిన్ !
 నీకున్ ప్రేయసి ! స్వప్న సుందరి ! చెలీ ! నీ రూపమే సాటియౌ !!!

( ప్రబంధ నాయికల అందాన్ని పోల్చేటప్పుడు సాధారణంగా ముఖాన్ని చంద్రుడితోనూ , ముంగురులను తుమ్మెదలతోనూ , కంఠాన్ని శంఖంతోనూ పోల్చడం పరిపాటి....అయితే నీ కంఠమేమో తీయని , మృదు మధురమైన వాక్కులనే అమృతాన్ని స్రవిస్తూ వుంటే , ఆ శంఖమేమో ' హాహాకారాలను ' ధ్వనిస్తూ వుంటుంది ....కేవలం ఆకార సామ్యం వున్నంత మాత్రాన , నీ కంఠాన్ని ఆ శంఖం తో పోల్చడం ఎంత మాత్రమూ సరికాదు ....నీకు నీవే ఉపమానమూ.....  నీకు నీవే ఉపమేయమూ !!! )

* ఔరా ! నిన్ గనలేని కన్నులివి యేలా ! వ్యర్థమే !!! నిన్ను ప్రే
  మారన్ కౌగిట జేర్చలేనివివి యీ హస్తంబులేలా ప్రియా ?
  నీ రమ్యంబగు ముద్దు పల్కు వినవేనిన్ కర్ణముల్ యేల ? నిన్
  చేరన్ ప్రేయసి ! స్వప్న సుందరి ! మదిన్ చింతింతు నస్రాంతమున్ !!!

( అప్పుడెప్పుడో భాగవతంలో ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లేఖ వ్రాసి పంపిస్తూ " ప్రాణేశ ! నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల? భువన మోహన నిన్ను పొడగానగా లేని  చక్షురింద్రియముల సత్వమేల ? " అని ప్రశ్నించుకొన్నట్టే నాకూ అనిపిస్తోంది చెలీ!!! నిన్ను చూడలేని యీ కన్నులు వుండీ లేనట్టే ! నిన్ను ప్రియమారా కౌగిలింపలేని యీ హస్తాలు వుండీ యేమి ప్రయోజనం? నీ ముద్దు ముద్దు పలుకులను విని తరించలేని నా యీ చెవులకు సార్థక్యమేమీ? సదా నిన్ను చేరి పరవశించాలనే నా మదిలో చింతిస్తూ వుంటాను నా ప్రేయసీ ! నా స్వప్న సుందరీ !!! )

* భామా ! అందము , సద్వివేకము , నిగర్వమ్మున్ , గుణశ్రేష్ఠతల్
  శ్రీమద్రూపము గాంచె నీవగుచు నారీ రత్నమా ! కాంచగా
  సామాన్యాంశము కాదు ; జన్మగత సంస్కార ప్రభావమ్మె ; కా
  కేమౌ ? ప్రేయసి ! స్వప్న సుందరి ! సదా కీర్తింతు నీ పుణ్యమున్ !!!

( ఈ లోకంలో అందం వున్నవాళ్లకు మంచి తెలివితేటలు లేకపోవచ్చు ....అందమూ , తెలివితేటలూ వుంటే , అహంకారమూ వుండి తీరుతుంది....అందమూ, తెలివితేటలూ ,గర్వం లేకుండా వుండగలగడమూ అరుదు ....ఈ మూడూ వున్న వాళ్లకు సద్గుణగణాలు కూడా తోడవ్వడం మరీ అరుదు ....కానీ నీలో మాత్రం అందమూ , తెలివితేటలూ , నిగర్వమూ , గుణ శ్రేష్ఠతా అన్నీ మూర్తీభవించినాయి ....ఇదేదో సామాన్యమైన విషయమెంత మాత్రమూ కాదు లే ! జన్మ సంస్కారమే కారణం ...యెంత భాగ్యశాలివో కదా నా ప్రేయసీ ! నా స్వప్న సుందరీ !!! )

* ఆలస్యమ్మును జేయగా నమృతమే హాలాహలమ్మౌను ; నే
  నే లీలన్ నిను గాంచగా గలనొ ? నాకేదీ వుపాయమ్ము ? నన్
  పాలన్ దేల్తువొ ? నీట ముంచెదవొ ? నా భాగ్యమ్మదెట్లున్నదో ?
  ఏలా ప్రేయసి ! స్వప్న సుందరి ! పరీక్షించేవు నన్నీ గతిన్ ?

( ఆలస్యం చేస్తే అమృతమే విషమౌతుందట ...నేనెలా నిన్ను చేరగలను ? నాకేదీ దారి ? నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం ! ఓ నా ప్రేయసీ ! స్వప్న సుందరీ ! యెందుకిలా నన్ను పరీక్షిస్తున్నావు??? ) 

* ఆ మేఘంబెట కేగెనో? ఎటకు నా హంసోత్తముండేగెనో ?
  ఏ మార్గంబున నా మనోగతము దేవీ ! నీకు నే దెల్పెదన్?
  ఆమోదించవె నా అమోఘమగు పద్యాహ్వానమున్ ; నా మన
  స్సీమన్ ప్రేయసి ! స్వప్న సుందరి ! సదా చింతింతు నీ రూపమున్ !!!

( కాళిదాసు మేఘసందేశంలో వలె మేఘముతో రాయబారం పంపిద్దామన్న ఆ మేఘుడెక్కడున్నాడో యేమో? పోనీ నల దమయంతులను ఒక్కటి చేయగా రాయబారం సలిపిన ఆ 'శుచిముఖు ' డనే రాజ హంస యిప్పుడెక్కడికి వెళ్లినాడో ? ఏమైనాడో ? నా మనోగతాన్ని నీకు తెలిపే వేరే దారి యేదీ? సరే....అమోఘమయిన నా పద్య కవిత్వంతోనే ఆహ్వానం పలుకుతున్నాను ....ఆమోదించి విచ్చేయవే ..!!! ఓ నా ప్రేయసీ ! స్వప్న సుందరీ ! నా మనస్సీమలో యెల్లప్పుడూ నీ రూపాన్నే ధ్యానిస్తూ వుంటాను !!!)

21, డిసెంబర్ 2010, మంగళవారం

" పట్టు పుర్వుల నిర్వేదం "

*  ఒక నిశీథిని నిద్ర పట్టక కలంచి
   పట్టు పానుపు నెక్కి నేనట్టులిటుల
   పొరలి యొక స్వప్నసీమలో నరసినాను
   పట్టు పుర్వుల లోకమ్ము తుట్టతుదకు !!!

* నన్ను గారవించి మన్నన జూపించి
  యున్నతాసనమ్ము విన్నవించి
  తంతుకీట రాజు చింతా మనస్కుడై
  విషయమిట్లు పలికె వెరపు చెంది

* " జిలిబిలి యైన పట్టుగొని , చిక్కని చక్కని చీరలల్ల మా
   అలిబిలి జీవితమ్ములను - అంతమొనర్తురు ; పాపపుణ్యముల్
   తలపగబోరు మానవులు - తన్వికి భూషణమై ప్రకాశమై
   విలవిలలాడుచుంటిమి కవీ ! విరచింపవె మా వ్యథా కథల్ ?!

* తొల్లి పుష్పాలు విలపించె తల్లడిల్లి
  వాటి వెత విరచించె పాపయ్య శాస్త్రి
  పట్టుపుర్వులమయ్య మా బాధ ప్రజకు
  నెఱుక జేయ సమర్థుడవీవె సుకవి !!!


* ప్రాణులన్నింటిలోన నారాయణుండు
  కలడు కలడంచు నొక సూక్తి కలదు కాదె?
  మమ్ము హింసింప శ్రీహరి మానసమున
  సంతసము గల్గునే మహా చింత గాక!!!?

* బుద్ధుడు జన్మమందె నిట , బోధల సల్పె నహింస గూర్చి ; సం
  శుద్ధుడు గాంధి తాత తన సూత్రత దెల్పె నహింస ; సర్వ సం
  సిద్ధుడు కాదె క్రీస్తు ఒక చెంపను కొట్ట మరొండు చెంపనే
  క్రుద్ధుడు కాక జూపుటకు కొంత చరిత్ర పఠింపుమో నరా!!

* పుట్టిన రోజటంచు ; మది పొంగగ మెట్టిన రోజు భర్త చే
  పట్టిన రోజటంచు ; తన పట్టును వీడక నేటి నారి మా
   పట్టును  దాల్చు పుట్టముగ - పైకము వేలకు వేలు బోసి , క
  న్పట్టునె మా మనోవ్యథలు? పట్టునె మా కత లమ్మగారికిన్?

( పుట్టిన రోజని ఒక రోజూ.....మెట్టిన రోజనీ, పెళ్లిరోజని మరో రోజూ వేలకు వేలు పోసి , తన పట్టునూ , బెట్టునూ యేమాత్రం సడలించకుండా మా పట్టుదారాలతో నేసిన చీరను ధరిస్తారే? ఒక్కో పట్టు చీర ధగ ధగల వెనుక యెన్ని పట్టు పురువుల వ్యథార్త జీవన గాథలున్నాయో యేమైనా ఆలోచించారా? )

* పట్టు చీర గట్టి బహు గౌరవంబంచు
  పుడమి పైని కాంత పొంగిపోవు ;
  పరుల బాధ పెట్టి , వంశ క్షయము జేసి
  నేయు చీర గట్ట న్యాయమగునె???!!!

* పూజలందు పట్టు పుట్టమ్ములన్ దాల్చి
  అయ్య ! మీరు భగవదర్చనమున
  సేయు పూజలెట్లు స్వీకరించును స్వామి?
  అఖిల భూత రక్షణాత్మకుండు!!!

* ఇంపెసలార మేము శ్రమియించుచు సుందర మందిరంబులన్
  సొంపుగ కట్టుచో నరులు చోర శిఖామణులై హరించి, వే
  ధింపుల పాలు జేయుచు వధింతురె మమ్ముల ?  వేడి నీట మా
  కొంపలు ముంచి వేయుదురె ? కోకల బేరము నందపేక్షతోన్ !!!

 ( పట్టు పురుగులు వాటి చుట్టూ ఏర్పరచుకున్న ' కకూన్ ' అనే ఆ ఇంటిని వేడినీళ్లలో వేసి ఆ పురుగును చంపి , ఆ కకూన్ నుండి పట్టు దారాన్ని వేరు చేయడం....' కొంప ముంచడం ' గా పోల్చబడింది ...)


* స్వామి ! నిద్రింపగా పట్టు పాన్పులేల?
  పట్టుబట్టలకై పట్టు బట్టుటేల?
  కొంత యోచింపుమయ్య ! సంకోచమేల?
  నా పలుకులో నసత్యమ్ము చూపగలవె?

  ( కేవలం సౌఖ్యం కోసం పట్టుపాన్పు పై పవ్వళించడం అవసరమా?? మీ పట్టుబట్టలకోసం పట్టుబట్టడం సరే కానీ ఒక్క పట్టు చీర కోసం    ఒక్క పట్టు పంచె కోసం యెన్ని పట్టు పురుగుల ప్రాణత్యాగం అవసరమో ఆలోచించారా????!!!!)

* మీ ప్రాణమ్ములటన్నన్
  అప్రియమా మీకు చెప్పుడయ్యా ? మాకున్
  మా ప్రాణమ్ముల పైన మ
  హా ప్రేమ యటన్న నేరమా ? ఘోరమ్మా?

 (మీ ప్రాణాల మీద మీకెంత ప్రేమో......మాకూ మా ప్రాణాల మీద అంతే ప్రేమ అంటే అదేమైనా నేరమా??? ఘోరమా???? ఆలోచించండి )

* పులి సింహాదులకే నరు
  లిలలో ' రక్షణ వనాల ' నేర్పరచిరి ; ఆ
  పులి సింహంబులు క్రూర మ
  తులు ; మే మతి సాధువులము ; ద్రోహము మాకా???

 ( పులి సింహాల వంటి క్రూర జంతువులకే అభయారణ్యాలు ఏర్పాటు చేశారు కదా...మరి...అత్యంత సాధు జీవుల మైన మా పట్ల మాత్రం యింత ద్రోహమెందుకు ??? )


* మా జీవితముల పై నిటు
  మీ జాతి కదేల కక్ష ? మీ దయ మా పై
  ఈ జన్మకు రాదా ? మీ
  ప్రాజాపత్యమ్ము నాపి రక్షింపవయా !!!

 ( ప్రాజాపత్యము = అధికారం )

* పెంచు వారి ప్రేమ ప్రియమైనదను మాట
  మృషయె ; మాకు మంచి మేత పెట్టి
  పెద్ద జేసి పిదప , వేడి నీటను వేసి
  చిదిమివేయ నెట్లు చేతులాడు ???

    ( లోకంలో పెంచిన ప్రేమ గొప్పదని అందరూ అంటూ వుంటారు కదా....అదేమంత నిజం కాదు లే.....మమ్మల్ని పెంచి ,మంచి మేత పెట్టి ,    పెద్దజేసిన మీరే మా జీవితాలను చిదిమి వేస్తారు కదా....చేతులెట్లా వస్తాయయ్యా? )

* ఇంత ప్రాధేయపడిన నీకేల రాదు
  జాలి ? నర ! నరకమునకు జనెదవేల?
  మమ్ము పీడించి , హింసించి , మట్టుబెట్టి
  బావుకొనునదేమి పాపమ్ము తప్ప!!!! "


* అని పట్టు పుర్వు పలుకగ
  వెనువెంటనె మేలుకొంటి ; వికల స్వాంత
  మ్మున తద్విషాద గాథన్
  గొని యొక ఖండికను నేను గూర్ప దలచితిన్ !!!!

(జంధ్యాల వారి స్ఫూర్తితో  ఇది నా పదిహేనవ యేట రచించిన ఖండిక ! అందుకు తగినట్లే రచనలో అపరిపక్వత సుస్పష్టము ......యథాతథంగా  అప్పటి నా శైలిని అలాగే నిలపడం కోసం !!!!!  )

20, డిసెంబర్ 2010, సోమవారం

నా అభిమాన కవి విశ్వనాథ !!!

* భద్రాలంకృత మూర్తివై ; సుకవితా వ్యాపార సంధాన ని
  ర్ణిద్రాహంకృత కీర్తివై ; బహుముఖాన్వీతోజ్జ్వలత్సాహితీ
  చిద్రూపమ్ము ధరించి ' యాంధ్రుల ప్రశస్తి ' న్ జాటినావయ్య ! శ్రీ
  మద్రామాయణ కల్ప వృక్ష కవి సమ్రాట్! విశ్వనాథా ! నతుల్ !!!

(కథా, కథానిక , నవల, పద్యమూ, పాట, విమర్శ, గేయమూ ,కావ్యమూ , యిలా ఒక్కటేమిటి? అన్ని రంగాల్లోనూ అందంగా అలంకరించబడిన బహుముఖ ప్రజ్ఞ సాధించి - సుకవిత్వ సంధాన ప్రక్రియలో కొండొకచో ధిషణా అహంకారాన్ని మేళవించి ఆంధ్రుల ప్రశస్తి   ( ' ఆంధ్ర ప్రశస్తి ' ఆయన కావ్యమే ) ఇదీ అని చాటి చెప్పిన శ్రీమద్రామాయణ కల్పవృక్ష కవిరాజా ! విశ్వనాథ ప్రభో !!!! నమస్సులు )

* నీ వైయక్తిక భావజాలము , కథా నిర్మాణ వైచిత్రి , శై
  లీ వైశిష్ట్యము , వాక్చమత్కృతి , మహా క్లిష్టాన్వయ స్ఫూర్తి నౌ
  రా ! విశ్వంభర యెల్ల మెచ్చుకొనుచున్ హర్షాతిరేకంబునన్
  సేవించెన్ నిను జ్ఞానపీఠమున రాశీభూత సంవిన్నిధీ!!!

* లలితమ్మైన పదాలతో సుకవితా లావణ్యమున్ జూపినన్ ,
  కలిత క్లిష్ట సమాస బంధురముగా కావ్యమ్ము నిర్మించినన్ ,
  శిలలైనన్ దలలూచి మెచ్చెడి రస శ్రీ గంధమున్ జిమ్ము మం
  జుల పాండిత్యము నీకు దక్క మరి యెందున్ గందుమోయీ ప్రభూ!!!

( లలిత లలితమైన పదాలతో కిన్నెరసాని పాటలు రచించినా , " నిష్ఠా వర్షదమోఘ మేఘ పటలీ " అంటూ సమాసార్భటితో కావ్యాలు నిర్మించినా , ఆ పాండిత్యానికి శిలలైనా తలలూచి మెచ్చాల్సిందే ....అంతటి నేర్పు  విశ్వనాథ వారికి కాక మరెక్కడుంది? ఎవరిలో ఉంది??? )

* ప్రాచీనార్ష పథ ప్రబోధముల నర్వాచీన గాథోక్తిగా
  నాచంద్రార్కము నిల్ప ' వేయి పడగల్ ' ఆడించుచున్ వాఙ్మయ
  ప్రాచుర్యామృతమున్ స్రవించు ధిషణా వాగ్భోగ భోగీంద్ర ! నీ
  ధీ చిహ్నమ్ముల నెన్న నా తరమె?  సంధింతున్ నమోవాకముల్ !!!

(నీవు సాక్షాత్తూ వేయి ముఖాలతో జ్ఞాన స్వరూపుడవైన ఆదిశేషుడవే అని చెప్పడం...అయితే  ఆ ఆది శేషునికీ , యీ విశ్వనాథునికీ ఒక తేడా ఉంది....అతడేమో తన వేయి పడగల ద్వారా భయంకరమైన కాలకూట విషాన్ని చిమ్ముతాడు......మరి యితడేమో తన ' వేయి పడగల ' ద్వారా వాఙ్మయమనే అమృత రసాన్ని చిందుతాడు !!!! అదీ ఈ తేడా)

* వాగను శాసన ప్రాభవమందున
    ఒక నన్నయార్యుడే నోయి నీవు!
  పద్య శిల్ప విభవ విద్యా విభూతిలో
    నొక తిక్క యజ్వయే నోయి నీవు !
  మహిత ప్రబంధ నిర్మాణ వైచిత్రిలో
    నొక యెఱ్ఱనార్యుడే నోయి నీవు !
  సంస్కృతాంధ్రోభయ శబ్ద సంవిత్ప్రౌఢి
    నొక్క శ్రీనాథుడే నోయి నీవు !

  ఒకడు నాచన సోమన్న ; ఒక్క పోత
  రాజు ; పెద్దన్న ; తెన్నాలి రామకృష్ణు
  డాది ప్రాచీన కవిముఖ్యు లందరొకట
  కలసి నీ రూపమేర్పడె ! కవివరేణ్య !!!

* సంస్కృతాంధ్రాంగ్ల భాషల సరి సమాన
  పాండితీ శక్తి నీకున్న ప్రజ్ఞ జాటు ;
  ఛందముల నేలగల్గిన ఛాందసుడవు !
  దార్శనికుడవు ; ఘన సద్విమర్శకుడవు !!!!

( విశ్వనాథ వారంటే యేదో పరమ ఛాందసుడూ , సంస్కృతం , తెలుగూ తప్ప మరేమీ పట్టవనుకొంటే పొరపాటే ! ఆకాలానికే ఆంగ్లం లో వచ్చిన నూతన నవలలన్నీ ఆయన ఔపోశన పట్టేవారు...యింకా విచిత్రమైన విషయమేమంటే విజయవాడలో వచ్చిన ఆంగ్ల చలనచిత్రాలను క్రమం తప్పకుండా దర్శించేవారు కూడానూ!!!)  

* గురువును మించిన శిష్యుం
  డరయగ మా విశ్వనాథ యని గురువరులే
  పరమాదరమున పలికిన
  గురుతర ధీశాలి ! అందుకొనుమయ్య నతుల్ !!!

(విశ్వనాథ వారి గురువరేణ్యులు - తిరుపతి వేంకట కవులలో నొకరైన చెళ్లపిళ్ల వారు , విశ్వనాథ వారిని ప్రశంసిస్తూ పలికిన సందర్భం ! )

* అనుమానమ్మది యేలనయ్య ? నిజమే ! ఆ జ్ఞానపీఠమ్ము చం
  ద్రునకర్పించిన నూలుపోగు ; భవదుత్తుంగ ప్రతాపోజ్జ్వలత్
  ఘన సారస్వత భావ సంకలిత మేథా శక్తికేమేమి యి
  చ్చిన గానీ సరిపోదు ; నీ ఋణము కై చెల్లింపనేమున్నదో???!!!!

(ఆ జ్ఞాన పీఠమిచ్చామే గానీ , నీ అత్యద్భుతమైన మేథా శక్తి ముందర అదొక చంద్రునికి నూలుపోగు వంటిది ....ఏమిస్తే నీవు చేసిన భాషా సేవకు ఋణము తీరుతుంది????)

స్వస్తి !!!!

(ఛాయాచిత్రానికి ఈ మాట వారికి కృతజ్ఞతలతో )

18, డిసెంబర్ 2010, శనివారం

అహో ఆంధ్రభోజా!!!!

శ్రీకృష్ణ దేవరాయా !
ఆకల్పాంతమ్ము నిల్తు వాంధ్రుల మదిలో !
మా కవితలతో నీకభి
షేకంబొనరింతుమయ్య ! శ్రీమంతముగాన్ !!!

తులువ వంశ పయోధి కలువల రాయడై
    తుల లేని యశముతో నలరినాడు !
సాళ్వ తిమ్మరుసయ్య సంరక్షణమ్ములో
    దృఢ రాజనీతి సాధించినాడు!
మూరు రాయర గండ మూర్ధాభిషికుడై 
    రిపుతతి తల లుత్తరించినాడు  !
అలరు మేల్ మంగమ్మ కలలన్ని గుది గుచ్చి
    ఆముక్త మాల్యద నల్లినాడు !

భాషలొక పది శ్రద్ధగా పాఱజూచి
భాషయన నాంధ్రమే యని పల్కినాడు !
తెలుగు వారల చిర తపః ఫలమతండు ;
కృష్ణదేవరాయని కీర్తి నేమనందు???

కీర్తికాంత కపోల కిమ్మీర ఫలకాల
    మకరికా పత్ర సంక్రాంతి జేర్చి ;
కావ్య భాషా యోష కమనీయ చరణాల
    మురువుగా కవితల హరువు గూర్చి ;
పరిపంథి జన వధూ ఫాలభాగము పైన
    వైధవ్య శాసన వ్యాఖ్య వ్రాసి ;
స్వీయ రాజ్య రమా విశిష్ట హృద్వీధి లో
    సతత సౌఖ్య విపంచి సవదరించి ;

జయతు జయతు జయోస్తు రాజాధిరాజ
రాజ మార్తాండ ! శ్రీ కృష్ణరాయ ! యనుచు
జనులు కీర్తింప రాజ్యపాలనము జేసి
చరితకెక్కిన రాయల సన్నుతింతు!!!

(కీర్తి కాంత యొక్క చిత్ర వర్ణము కలిగిన కపోలం పై మకరికా పత్రం తో విలాసంగా అటూ యిటూ  రేఖా చిత్రాలు గీచాడట ( ఇదొక ప్రబంధకాలంలోని  శృంగార  చేష్టా విశేషం...నాయకుడు నాయిక ఏకాంతంలో నున్న సమయంలో ప్రేమానురాగాలను వెల్లడించే ఒకానొక సాధనం ...కీర్తికాంతతో అలా చెయ్యాలంటే మరి కీర్తి అనే స్త్రీ , కృష్ణ రాయలకు  ఎంతగా వశమయ్యిందో ఆలోచించాలి ...యిదొక ఉత్ప్రేక్ష... ఇక్కడ శృంగార రసం !!!

కావ్యమనే భాషా యోష (సరస్వతి ) కి భక్తి తో తన కవితలనే ఆభరణాలను , గండపెండేరంగా  సమర్పించిన బుద్ధిశాలి ...ఇక్కడ భక్తి రసం!!!

పరిపంథి జన వధూ  అంటే శత్రు రాజుల భార్యల నుదుటి మీద వైధవ్యమనే నూతన శాసనాన్ని లిఖించాడట ! శత్రురాజుల మీద విజయ సందర్భం గా విజయ శాసనాలు లిఖించడం కద్దు ....వాటితో పాటూ వారికి మరణ శాసనాన్నీ , వారి రాణులకు వైధవ్య శాసనాన్నీ కూడా లిఖించడం కవిసమయం ...ఇక్కడ వీర రసం!!!

తన రాజ్యరమ హృదయంలో నిరంతర సౌఖ్యాలు అనే వీణా రాగాలను మీటాడట ...అంత సుఖమయం గా , అంత ప్రశాంతం గా సాగిన పాలన అని...  ఇదొక శాంత రసం!!!

ఈ విధమైన పాలన జేసి రాణకెక్కిన శ్రీకృష్ణ రాయలను సదా అభినుతిస్తాను అని......)

శ్రీకృష్ణ రాయలకూ - సాక్షాత్తూ శ్రీకృష్ణుడికీ నామ సామ్యమేనా ,యింకేమైనా పోలికలున్నాయా అంటే -

అతడు యాదవుడంట - ఇతడు భూధవుడంట
   యెలమినాతని కన్న నితడె ఘనుడు !
అతడు పసుల గాచు - నితడు కవుల బ్రోచు
   నెలమి నాతని కన్న నితడె ఘనుడు !
అతడు గీతను బల్కు - నితడు కైతల జిల్కు
  నెలమి నాతని కన్న - నితడె ఘనుడు !
అతనివి మాయలు - యితడేమొ రాయలు
  యెలమి నాతని కన్న - నితడె ఘనుడు !

అతడు - ఒట్టి శ్రీకృష్ణుండు ; అరయ నితడు
అహహ ! శ్రీకృష్ణ దేవరాయ ప్రభుండు ;
భళిర వేమారు నీ కీర్తి ప్రస్తుతింతు
తెలుగు వల్లభ ! శ్రీకృష్ణ దేవరాయ!!!

( అతడేమో యాదవుడు , మరి యితడో  మహా మహీతలాన్నేలే   భూధవుడు - చక్రవర్తి !!!అతని కంటే ఇతనే గొప్ప!!! అతడేమో కేవలం వెర్రి మొర్రి పసుల కాపరి......మరి యితడో? జ్ఞాని వతంసులైన అష్టదిగ్గజాలనే బ్రోచే సరస దయానిధి...అతని కంటే యితడే గొప్ప కాదా? అతడేమో కేవలం ఒక్క గీతను చెప్పాడట ...మరి ఇతడో??? రసవంతములైన కైతలనేకం చిలుకుతాడట....మరి యెవరు గొప్ప?  అతనివన్నీ మాయలు ; మరి ఇతని పేరే  ' రాయలు '  ....అతని కంటే యితడే గొప్ప!!! పేరు చూద్దామా? అతనిది వట్టి ' శ్రీ కృష్ణుడు ' అంతే.....మరి యితనో??? " శ్రీ కృష్ణ దేవరాయ ప్రభువు ".........కనుక ఇతడే గొప్ప!!!!!!!!) 

హంపీ విరూపాక్ష హర్షాను కంపాను
  రక్తుడై యెవ్వడు రాజ్యమేలె?
శ్రీకాకుళాంధ్ర నిర్దేశమ్ము తలదాల్చి
  భక్తుడై యెవడు ప్రబంధమల్లె?
పెద్దన్న , సూరన్న , పేర్గన్న ధూర్జటి
  కొలువుండ నెవడు సద్గోష్ఠి సల్పె?
గడసరి గజపతి ; బుడతకీచుల పాలి
   యమరాజుగా నెవ్వడవతరించె?

విజయనగర సామ్రాజ్య సంవిద్వికీర్ణ
కీర్తి కాంతిచ్ఛటా ప్రభాకృతి యెవండు?
వాని రాయని బహుముఖ ప్రజ్ఞ మదిని
దలచి కైమోడ్తునీ శుభ తరుణమందు !!!!

(అర్థం సుగమం...* బుడతకీచులు = పోర్చుగీసు )

17, డిసెంబర్ 2010, శుక్రవారం

నమో వేంకటేశం!!!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగదైవమైన ఆ శ్రీవేంకటేశ్వరుని ధ్యానిస్తూ

సుర దిక్పాలక సర్వ మౌనిగణ రక్షో యక్ష గంధర్వ కి
న్నర కింపూరుష సేవితామల మహా జ్ఞాన స్వరూపా ! నిరం
తర సద్భక్త శుభ క్రమాకలన సంధానా ! విభో ! వేంకటే
శ్వర ! నీ పాదయుగమ్ము గొల్తును మదాశా పూర్తి సంసిద్ధికై !!!!

( సురులూ , దిక్పాలకులూ , సకల మునిజనాలూ , రాక్షస , యక్ష , గంధర్వ ,కిన్నర , కింపురుషాది సకల గణాలచే సేవింపబడే శుద్ధ జ్ఞాన స్వరూపమైనటువంటి వాడా!!!! నమ్ముకున్న సద్భక్తులకు నిరంతరమూ శుభ క్రమాల వరుసలను చేకూర్చే మహా ప్రభో !!!! శ్రీ వేంకటేశ్వరా!!!నా ఆశాపూర్తి చేయుటకు నిన్నే శరణు వేడెదను స్వామీ !!! )  

అంటూ ప్రశంసించి మున్నెన్నడో ' శంకరాభరణ ' మందునొసంగబడిన " నయా , కియా , దియా , గయా " లనే పదాలతో

" వినయాంభోధి తరంగ శీకరములావేశించి హృద్వీధిలో
వనమాలాంకిత వేంకటేశునికి  యావచ్ఛక్తి సంప్రీతి పూ
జనముల్ సేయుచు చందనమ్మలది యా సన్మంగళాకారు నే
ననయంబున్ నుతియింతు నిక్కముగ ! యాజ్యంబైన తద్రూపమున్!!!!

( వినయమనే మహాసముద్ర తరంగాల చెమ్మ నా హృదయానికి వ్యాపించి భక్తిభావం నిండగా , వనమాలా సంయుతుడైన ఆ శ్రీ వేంకటేశ్వరునికి యావచ్ఛక్తి ధ్యాన ,ఆవాహనాది షోడశోపచార పూజావిధి నిర్వర్తించి , ఆ లసన్మంగళాకార స్వరూపానికి భక్తితో చందన చర్చ చేసి , శ్రద్ధతో యజ్ఞము చేయదగిన రూపము గలిగిన ఆ స్వామినే నిరంతరమూ నుతియిస్తాను!!!!)

అంటూ మరొక్కమారు మనసా వాచా కర్మణా ప్రణమిల్లుతూ ...... స్వస్తి!!!!!

16, డిసెంబర్ 2010, గురువారం

వైద్యుడంటే ఎవరూ? అతడెలా ఉండాలి???

వైద్యుడంటే ఎవరూ???అతనికి ఎలాంటి లక్షణాలుండాలి??? అని జన సామాన్యంలో ఒక ప్రశ్న.

కొందరైతే " వైద్యో నారాయణో హరిః " అంటూ వైద్యుణ్ని సాక్షాత్తూ దైవ సమానుడి గా మార్చేశారు. మంచిదే!!! మృత్యు ముఖం లో చిక్కుకుని....గిల గిలలాడుతూ...నరక యాతన అనుభవించే రోగి పాలిట చక్కని వైద్యాన్నందించే వైద్యుడు ఖచ్చితంగా నారాయణ స్వరూపుడే!!!

మరి అధే ఇంకొంత మంది ప్రాచీనులు వైద్యుడిని యమరాజ సహోదరుడిగా పోల్చిన సందర్భాలూ లేకపోలేదు.....

" వైద్య రాజ ! నమస్తుభ్యం!
యమరాజ సహోదర!!!
యమస్తు హరతే ప్రాణాన్
త్వం తు ప్రాణాన్ ధనాని చ "!!!

పాపం యముడైతే ఒక్క ప్రాణాలని మాత్రమే హరిస్తాడట.....మరి యీ వైద్యరాజేమో రోగి నుండి, వారి బంధువుల నుండి వసూలు చేసినంతా చేసి.......వారి ధనాన్ని.....వచ్చీ రాని వైద్యం తో చివరికి చేతులెత్తేసి వారి ప్రాణాన్నీ కూడా హరించగలడట....

వైద్యుడెలా ఉండకూడదో చెప్పుకొన్న తరువాత , ఎలా ఉండాలో చెప్పుకుందాం!!!


పూర్వం ఆయుర్వేద కాలం లో ఒకానొక వైద్యుడుండే వాడట....అవసాన కాలంలో తన కుమారుడిని పిలిచి యిలా ఉపదేశించాడట
"అబ్బాయీ...మా తాత వైద్యుడు...మా నాన్నా ఓ మోస్తరు వైద్యుడే....ఇక నా సంగతి సరే సరి....మరి మాలా నువ్వూ పేరు తెచ్చుకోకుంటే యెలా? వైద్యం లో నీకు ఓనమాలూ రావని బాధపడకు ....యిదిగో సూక్ష్మం చెబుతా విను.....


"యస్య కస్య తరోర్మూలం
యేనకేనాపి మేలయేత్
యస్మై కస్మై ప్రదాతవ్యం
యద్వా తద్వా భవిష్యతి "


" ఏదో ఒక మూలిక తీసుకో.....ఇంకేదో ఒక మూలిక తో కలిపి బాగా కల్వంలో వేసి నూరు....ఎవడికో ఒకడికి మాత్రగా ఇచ్చెయ్య్ ...ఏదైతే అదవుతుంది పో ...ఇంతే వైద్యమంటే " అన్నాడట!!!


వైద్యుడంటే యిలా మాత్రం ఉండకూడదు....తననే నమ్ముకుని ఒక రోగి వస్తే , సావకాశంగా తన బాధలన్నీ విని.... సానునయ వాక్యాలు పలుకుతూ ......అత్యుత్తమ చికిత్స అందించిన నాడే నిజమైన వైద్యుడు....


" ఒకపరి తల్లిగా నొప్పారి రోగుల
లాలించుచు చికిత్సలందజేయు;
ఒకపరి తండ్రిగా నొప్పారి రోగుల
అవసరాలను దీర్చి అభయమిచ్చు;
ఒకపరి గురువుగా నొప్పారి రోగికి
హితబోధలనుజేసి వెతలదీర్చు;
ఒకపరి సఖుని గా నొప్పారి రోగుల
కష్టసుఖములెంచి తుష్టి చెందు ;

తల్లిదండ్రుల మరియు సంతతము గురుని
సఖుని మరిపింపజేయును ; సుఖము గూర్చు;
అహరహమ్మును ప్రజల శ్రేయస్సు కొరకు
పాటువడు దైవసముడు - సద్వైద్యుడెపుడు!!!! " - ( డా. విష్ణునందన్ )

15, డిసెంబర్ 2010, బుధవారం

" శుక్లాంబరధరం విష్ణుం "

ముందెన్నడో చేయవలసిన ప్రార్థన.....ఇప్పటికి చేస్తూన్నాను......సరే....విఘ్ననాయకు డనుగ్రహిస్తాడనే నమ్మకం!!!

సతతావిఘ్న మహాప్రసాదమునకై , శ్లాఘించెదన్ వ్యాస భా
రత సత్కావ్య విలేఖకున్ ; గజముఖున్ ; ప్రజ్ఞా యశః కారకున్ ;
తత దీవ్యద్గణ నాయకున్ ; మహిత భక్త క్లేశ విధ్వంసకున్ ;
శ్రిత సంసేవక మూషికున్ ; సుకవితా శ్రీ భావ సంధాయకున్!!!!!

వ్యాస భారత విలేఖనా భార దురంధరుడూ , గజ ముఖుడూ , వేడినంతనే అమితమైన బుద్ధి , అంతులేని కీర్తులని ప్రసాదించేవాడూ , పెక్కు గణములకు అధినాయకుడూ , భక్తుల మహా క్లేశాలను విధ్వంసం చేసే వాడూ , ఎల్లప్పుడూ తనకు ఆశ్రితుడై సేవకుడైన మూషికుని కలిగియుండేవాడూ , సత్కవిత్వ భావనలనే సంపదనొసంగగలిగే వాడూ అయిన ఆ విఘ్నేశ్వరుని ఎల్లప్పుడూ ' అవిఘ్న సిద్ధి ' అనే మహా ప్రసాదం కొరకు ప్రార్థిస్థాను !!!!

14, డిసెంబర్ 2010, మంగళవారం

తెలుగు భాష - తెలుగు వాడు!!!

తెలుగు సమస్త భాషలకు తీరును నేర్పెడి యొజ్జ బంతి ; యీ
జిలిబిలి పల్కులో వెలుగు జీవము , భావము వేరు భాషకున్
కలుగునె??? రాజహంస నడకల్ , నడతల్ , నయగారముల్ , హొయల్
అలవడునే గనన్ కువలయమ్మున వేరొక పక్షి జాతికిన్????

అమృతము చిందు భాష ; పరమాన్నము పోలిక నుండు భాష ; సా
రమున తుషారమై రుచుల రాజిలు భాష ; విపంచికా ధ్వనుల్
సుమధుర రీతి బల్కు వినసొంపగు భాష ; అజంత భాష ; వే
దము వలె శుద్ధమైన పరతత్వము నిక్కము తెల్గు భాషయే !!!

కవితలు ; గేయముల్ ; కథలు ; కావ్యములున్ ; బలు నాటకమ్ములున్
వివిధములైన  ఛందముల  ప్రీతిని గూర్చు మహేతిహాసముల్ ;
నవయుగ విప్లవమ్ము ; వచనమ్ము ; కథానిక ; గీతముల్ ; గజల్;
భువిపయి తెల్గు భాష - పరిపుష్టముగా వెలుగొందు నన్నిటన్!!!

మరి  యింతటి మహోత్కృష్ట సంపదకు వారసుడైన తెలుగు వాడేమైనా తక్కువా???....కానేకాదు!!!

ఆవకాయ , ఘృతమ్ము లాహారమున లేక
       తినబోనిదెవ్వండు??? ' తెల్గు వాడు ' !!!
భుజముపై పైపంచె నిజ గౌరవము దెల్ప
      తేజరిల్లునెవండు ??? ' తెల్గు వాడు ' !!!!
ఆత్మాభిమానాన అకాశమంతెత్తు
      వెల్గుచుండు నెవండు ??? ' తెల్గు వాడు ' !!!!
శాంతికి మారుగా - సహనమ్మె పేరుగా
       తెలియవచ్చు నెవండు??? ' తెల్గు వాడు ' !!!

ప్రాణ దానమ్ము సేయు విరాగి వాడు !
జ్ఞాన పీఠమ్ము గెల్చిన జాణ వాడు !
దేశమును చక్కదిద్దిన దిట్ట వాడు !
సకల రంగాల తన ప్రజ్ఞ చాటు వాడు !!!

తెలుగు వెలుగులు వర్థిల్లాలి....!!!!!

( ఆంధ్రత్వ మాంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలం - అప్పయ్య దీక్షితులు )

"కవిత్వం"

మల్లెలు పూచు భంగి ; పవమానుడు చల్లగ వీచు భంగి ;రే

పల్లెను గొల్ల పిల్లడలవాటుగ వేణువు నూదు భంగి; వి

ద్యుల్లత తళ్కుమంచు దివి తోచిన భంగి; వధూవరుల్ సదా

యుల్లములుల్లసిల్లు మధురోక్తుల నాడెడు భంగి; వర్షపున్

జల్లులు రాలగా నెమలి సమ్మతి నృత్యము సేయు భంగి; పూ

విల్లు ధరించి మన్మథుడు వేమరు తూపుల వేయు భంగి ; రం

జిల్లి ముదమ్మునన్ శిశువు చెల్వుగ నవ్విన భంగి ; నిండు జా

బిల్లి సుధాప్రసారమన వెన్నెల వన్నెలనీను భంగి ; మేల్

పల్లకి నెక్కి రాసుత విలాస విహారము సల్పు భంగి ; సం

పల్లలితాంగి సత్కరుణ భాగ్యములిచ్చిన భంగి ; కచ్ఛపీ

వల్లకిపై సరాగముల భారతి మీటిన భంగి; కోవెలన్

ఘల్లున నుల్లముల్ తనియ గంటలు మ్రోగెడు భంగి ; కోయిలల్

పల్లవముల్ భుజించి గరువమ్మున నిమ్ముగ కూయు భంగి ; సం

ఫుల్ల సరోజముల్ సరసి మోహన రీతిని బొల్చు భంగి ; మేల్

చల్లని చందనమ్మలది స్వామికి తాపము బాపు భంగి ; ధీ

తల్లజు డాశు రీతి కవితా రస ధారల జిమ్ము భంగి ; మే

నెల్ల శ్రమంబు మాని పులకింపగ నింపుగ సొంపు మీరగా

పల్లె పడంతి శ్రావ్యముగ పాడెడు జానపదమ్ము భంగి ; వ

ర్తిల్లవలెన్ కవిత్వము ; మరిన్ ప్రజ నాలుకలందు నిల్చి వ

ర్థిల్లవలెన్ కవీంద్రు డతిరిక్త యశస్సముదీర్ణ సాంద్రుడై!!!

"పరిచయం"

అజ్ఞాతృత్వము వీడి నేనిటుల సమ్యక్స్వస్వరూపమ్ముతో
విజ్ఞానాంబుధినోలలాడుటకునై విచ్చేసి కైమోడ్చెదన్!!!
యజ్ఞంబీయది ; అక్షర క్రతువు ; ధ్యేయంబూని పాల్గొందు నో
విజ్ఞుల్ ; పేరుకు -' విష్ణు నందనుడ ' - సర్వేభ్య : ప్రణామశ్శతం!!!!

ప్రాక్తన పుణ్యలేశమున పద్యము లల్లుచునుందు ; పాండితీ
శక్తియు నావగింజ ; మరి సంస్కృత మేధయు సున్న; భారతీ
భక్తుడనామె దివ్య పద పద్మములన్ భజియించి పుణ్య సం
సక్తుడనైతి- 'ఛాందసపు  జాడలెరుంగని వాడ జూడగన్ ' !!!

వైద్యుడ వృత్తికి ; కవితా
సేద్యమ్మే నా ప్రవృత్తి ; శ్రీ కవితా నై
వేద్యమ్మిడి సత్కవితా
విద్యా భారతిని గొల్తు వినయాంజలితో !!!!