18, డిసెంబర్ 2010, శనివారం

అహో ఆంధ్రభోజా!!!!

శ్రీకృష్ణ దేవరాయా !
ఆకల్పాంతమ్ము నిల్తు వాంధ్రుల మదిలో !
మా కవితలతో నీకభి
షేకంబొనరింతుమయ్య ! శ్రీమంతముగాన్ !!!

తులువ వంశ పయోధి కలువల రాయడై
    తుల లేని యశముతో నలరినాడు !
సాళ్వ తిమ్మరుసయ్య సంరక్షణమ్ములో
    దృఢ రాజనీతి సాధించినాడు!
మూరు రాయర గండ మూర్ధాభిషికుడై 
    రిపుతతి తల లుత్తరించినాడు  !
అలరు మేల్ మంగమ్మ కలలన్ని గుది గుచ్చి
    ఆముక్త మాల్యద నల్లినాడు !

భాషలొక పది శ్రద్ధగా పాఱజూచి
భాషయన నాంధ్రమే యని పల్కినాడు !
తెలుగు వారల చిర తపః ఫలమతండు ;
కృష్ణదేవరాయని కీర్తి నేమనందు???

కీర్తికాంత కపోల కిమ్మీర ఫలకాల
    మకరికా పత్ర సంక్రాంతి జేర్చి ;
కావ్య భాషా యోష కమనీయ చరణాల
    మురువుగా కవితల హరువు గూర్చి ;
పరిపంథి జన వధూ ఫాలభాగము పైన
    వైధవ్య శాసన వ్యాఖ్య వ్రాసి ;
స్వీయ రాజ్య రమా విశిష్ట హృద్వీధి లో
    సతత సౌఖ్య విపంచి సవదరించి ;

జయతు జయతు జయోస్తు రాజాధిరాజ
రాజ మార్తాండ ! శ్రీ కృష్ణరాయ ! యనుచు
జనులు కీర్తింప రాజ్యపాలనము జేసి
చరితకెక్కిన రాయల సన్నుతింతు!!!

(కీర్తి కాంత యొక్క చిత్ర వర్ణము కలిగిన కపోలం పై మకరికా పత్రం తో విలాసంగా అటూ యిటూ  రేఖా చిత్రాలు గీచాడట ( ఇదొక ప్రబంధకాలంలోని  శృంగార  చేష్టా విశేషం...నాయకుడు నాయిక ఏకాంతంలో నున్న సమయంలో ప్రేమానురాగాలను వెల్లడించే ఒకానొక సాధనం ...కీర్తికాంతతో అలా చెయ్యాలంటే మరి కీర్తి అనే స్త్రీ , కృష్ణ రాయలకు  ఎంతగా వశమయ్యిందో ఆలోచించాలి ...యిదొక ఉత్ప్రేక్ష... ఇక్కడ శృంగార రసం !!!

కావ్యమనే భాషా యోష (సరస్వతి ) కి భక్తి తో తన కవితలనే ఆభరణాలను , గండపెండేరంగా  సమర్పించిన బుద్ధిశాలి ...ఇక్కడ భక్తి రసం!!!

పరిపంథి జన వధూ  అంటే శత్రు రాజుల భార్యల నుదుటి మీద వైధవ్యమనే నూతన శాసనాన్ని లిఖించాడట ! శత్రురాజుల మీద విజయ సందర్భం గా విజయ శాసనాలు లిఖించడం కద్దు ....వాటితో పాటూ వారికి మరణ శాసనాన్నీ , వారి రాణులకు వైధవ్య శాసనాన్నీ కూడా లిఖించడం కవిసమయం ...ఇక్కడ వీర రసం!!!

తన రాజ్యరమ హృదయంలో నిరంతర సౌఖ్యాలు అనే వీణా రాగాలను మీటాడట ...అంత సుఖమయం గా , అంత ప్రశాంతం గా సాగిన పాలన అని...  ఇదొక శాంత రసం!!!

ఈ విధమైన పాలన జేసి రాణకెక్కిన శ్రీకృష్ణ రాయలను సదా అభినుతిస్తాను అని......)

శ్రీకృష్ణ రాయలకూ - సాక్షాత్తూ శ్రీకృష్ణుడికీ నామ సామ్యమేనా ,యింకేమైనా పోలికలున్నాయా అంటే -

అతడు యాదవుడంట - ఇతడు భూధవుడంట
   యెలమినాతని కన్న నితడె ఘనుడు !
అతడు పసుల గాచు - నితడు కవుల బ్రోచు
   నెలమి నాతని కన్న నితడె ఘనుడు !
అతడు గీతను బల్కు - నితడు కైతల జిల్కు
  నెలమి నాతని కన్న - నితడె ఘనుడు !
అతనివి మాయలు - యితడేమొ రాయలు
  యెలమి నాతని కన్న - నితడె ఘనుడు !

అతడు - ఒట్టి శ్రీకృష్ణుండు ; అరయ నితడు
అహహ ! శ్రీకృష్ణ దేవరాయ ప్రభుండు ;
భళిర వేమారు నీ కీర్తి ప్రస్తుతింతు
తెలుగు వల్లభ ! శ్రీకృష్ణ దేవరాయ!!!

( అతడేమో యాదవుడు , మరి యితడో  మహా మహీతలాన్నేలే   భూధవుడు - చక్రవర్తి !!!అతని కంటే ఇతనే గొప్ప!!! అతడేమో కేవలం వెర్రి మొర్రి పసుల కాపరి......మరి యితడో? జ్ఞాని వతంసులైన అష్టదిగ్గజాలనే బ్రోచే సరస దయానిధి...అతని కంటే యితడే గొప్ప కాదా? అతడేమో కేవలం ఒక్క గీతను చెప్పాడట ...మరి ఇతడో??? రసవంతములైన కైతలనేకం చిలుకుతాడట....మరి యెవరు గొప్ప?  అతనివన్నీ మాయలు ; మరి ఇతని పేరే  ' రాయలు '  ....అతని కంటే యితడే గొప్ప!!! పేరు చూద్దామా? అతనిది వట్టి ' శ్రీ కృష్ణుడు ' అంతే.....మరి యితనో??? " శ్రీ కృష్ణ దేవరాయ ప్రభువు ".........కనుక ఇతడే గొప్ప!!!!!!!!) 

హంపీ విరూపాక్ష హర్షాను కంపాను
  రక్తుడై యెవ్వడు రాజ్యమేలె?
శ్రీకాకుళాంధ్ర నిర్దేశమ్ము తలదాల్చి
  భక్తుడై యెవడు ప్రబంధమల్లె?
పెద్దన్న , సూరన్న , పేర్గన్న ధూర్జటి
  కొలువుండ నెవడు సద్గోష్ఠి సల్పె?
గడసరి గజపతి ; బుడతకీచుల పాలి
   యమరాజుగా నెవ్వడవతరించె?

విజయనగర సామ్రాజ్య సంవిద్వికీర్ణ
కీర్తి కాంతిచ్ఛటా ప్రభాకృతి యెవండు?
వాని రాయని బహుముఖ ప్రజ్ఞ మదిని
దలచి కైమోడ్తునీ శుభ తరుణమందు !!!!

(అర్థం సుగమం...* బుడతకీచులు = పోర్చుగీసు )

12 కామెంట్‌లు:

  1. మీ కలంలో ఏం పోసి రాస్తారండి ఇంత చక్కటి తేనెలొలుకుతున్నాయ్?

    రిప్లయితొలగించండి
  2. అద్భుతమండీ - గతం లో మురళి మోహన్ గారూ కవితాభీషేకం పేరిట రాయల వారికి అభినందనపూర్వకంగా ఓ శీర్షిక ప్రచురించారు. వీలు చిక్కినపుడు చూడండి
    http://turupumukka.blogspot.com/search/label/royal

    రిప్లయితొలగించండి
  3. డా.విష్ణునందన్ గారూ! మీ పద్యరచనా నైపుణ్యము అమోఘం. శ్రీకృష్ణ దేవరాయలపై నాబ్లాగులో చేసిన కవితాభిషేకాన్ని ఇక్కడ చదవండి.
    http://turupumukka.blogspot.com/search/label/royal

    రిప్లయితొలగించండి
  4. @ ఫణి ప్రసన్న కుమార్ గారు

    కలమున్ నమ్మితి ; జ్ఞాన సిద్ధికయి సంకల్పించి యా వేంకటా
    చలమున్ నమ్మితి ; అమ్మనాన్నలిడు ప్రోత్సాహమ్ము , వారిచ్చు ప్రో
    ద్బలమున్ నమ్మితి ; పూర్వ సత్కవి ప్రసాద మ్మైన సాహిత్య స
    త్ఫలమున్ నమ్మితి ; నా కవిత్వ మధుర వ్యాహార సంప్రాప్తికై !!!!

    అంతేనేమో కారణం !!!

    @ ఊకదంపుడు గారు - ధన్యవాదాలు

    @ కోడిహళ్లీ మురళీమోహన్ గారు
    చాలా సంతోషం.....చక్కని పద్యాలు......బహు చక్కని సేకరణ....పరమానందం!!!!

    రిప్లయితొలగించండి
  5. మాస్టారు, ఇవ్వాళ్ళ పొద్దున కళ్ళు తెరిచినందుకు సార్ధకత కలిగింది మీ యీ పద్యాలు చదివి.
    అద్భుతం.
    మొదటి వ్యాఖ్యలో ఫణిప్రసన్నకుమార్ చెప్పిందే నా మాట కూడా.

    రిప్లయితొలగించండి
  6. ఆంద్ర భోజుని ప్రస్తుతిస్తూ,వారి ప్రాభావాల్ని పలు రసాలలో ,ప్రశంసించిన తీరు అమోఘం.అనితర సాధ్యం.మీకు అభినందనలు.


    మీ బ్లాగును వీక్షిస్తున్నప్పు డల్లా నేను ఉహల్లోకి వెళ్లి పోతుంటాను ఆ ఉహల్లో రెండు కోరికలు మెదులుతూ ఉంటాయి.

    అవి తీరునో లేదో గాని తీరితే మాత్రం నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

    1 మన ప్రభుత్వానికి సెక్రటేరియట్ లో,తమ పాలనను గురించి తెలుసు కోవడానికి తమ పనితీరు పై ప్రజలు స్పందిస్తున్న

    తీరుని తెలుసుకొని, సమీక్షించుకొని తదనుగుణంగా ప్రణాళికలను రూపొందించే విభాగం ఒకటుంటుందని నేననుకొంటున్నాను .

    వారెవరైనా మీ బ్లాగును వీక్షించి ,మీరు వ్రాసిన వాటిని ,ముఖ్యంగా "తెలుగు భాష-తెలుగు వాడు" శీర్షికన వెలువరించిన పద్యాలను విద్యార్థులకు పాఠ్యాo శాలుగా నిర్ణయిస్తే చాలామందికి తెలుగు భాషపై మక్కువ ఏర్పడుతుందని నేనను కొంటాను .ఇది తీరలేనికోరిక కాదుగాని,తీరితే బాగుండనిపిస్తుంది.కాని తీరేదెలా ?

    2 కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారి సినిమాల గురించి,వారు సంగీత,సాహిత్యాలకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి అందరికి

    తెలిసిందే. తగిన సందర్భాలు సృష్టించి ,తనకిష్ట మైన సాహిత్య గుళికల్ని,తనదైన శైలిలో ,ప్రేక్షకులకు అందించి మెప్పించడం

    ఆయన ప్రత్యేకత.ఈ మద్య వారు తీసిన "శుభ ప్రదం" సినిమాలో నన్నయ గారు వ్రాసిన " బహు వన పాద పాబ్ధి కుల పర్వత

    పూర్ణ సస్సరస్వ తీ సహిత మహా మహీ--------------------మాకు ప్రసన్ను డయ్యెడున్."అనే పద్యం ద్వారా తెలుగు భాష

    గొప్పదనాన్ని సినిమా మాధ్యమం ద్వారా చెప్పిన విధానం చాలా గొప్పగా అనిపించింది . సినిమా రంగం తో సంబంధ మున్న

    ప్రముఖు లెవ రైనా ఈ బ్లాగును వీక్షించి కళా తపస్వి దృష్టికి తీసుక వస్తే ,వారు తప్పకుండా తగు విధంగా ఈ కవితలను

    ఉపయోగించుకొంటారని నా విశ్వాసం .ప్రసిద్ద సంగీత దర్శకుల సారధ్యంలో ,లబ్ద ప్రతిష్టులైన గాయక/గాయకీ మణుల చే ఈ కవితల్నిముఖ్యంగా "తెలుగు వాడు-తెలుగు వాడు""శుక్లాంబరధరం విష్ణుం --"లాంటివి పాడించి తాను తీయబోయే సినిమాలో

    తగిన సన్నివేశాలు సృష్టించి అందజేస్తే , ప్రేక్షక మహాశయులు మహదానంద పడతారు ఆ సినిమాలను ఆదరిస్తారు.ఆ C.D వింటూ ఆనందించాలని ,అవి అందరు వింటుంటే చూడాలనిపిస్తుంది.ఈ కోరికా తీరగలిగేదే ,కాని తీరగల ,తీర్చగల దారేది?

    రిప్లయితొలగించండి
  7. డాక్టరుగారూ! బహుశా అలనాటి శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాలలో ఒకరు విష్ణు నందనులై జన్మించారేమో అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  8. @ కొత్త పాళీ గారు

    హృదయపూర్వక ధన్యవాదాలు !!!

    @ మంద పీతాంబర్ గారు

    ధన్యోస్మి .....మీ ఆదరాభిమానాలకు సర్వదా సర్వధా కృతజ్ఞతానీకం!!!! వినయాంజలి సమర్పిస్తూన్నాను !!! స్వీకరించండి !!!!

    @ మిస్సన్న గారు

    అలా కాదండి.....అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన పింగళి సూరనది మా వూరే .....కర్నూలు జిల్లా నంద్యాల . బహుశః వారి శిష్య ప్రశిష్య కోటిలో ఒకడయ్యుందునేమో......అది చాలు జన్మ సార్థక్యానికి.......!!!!

    రిప్లయితొలగించండి
  9. బాలు మంత్రిప్రగడ18 డిసెంబర్, 2010 9:50 PMకి

    డా.విష్ణు గారూ,
    కృష్ణదేవరాయలు గూర్చి మీ కావ్యం చదివి అనిర్వచనీయమైన ఆనందంతో ఎలా అబినందించాలో కూడా తెలియటంలేదు, ఆంధ్ర భోజుడు చెప్పినట్లు "తేనెలొలుకు తెలుగుదనం" ఆస్వాదించడం తప్ప.
    శంకరాభరణం శంకరయ్య గురువు గారూ, మీరూ తెలుగు భాష తీయదనాన్ని ఇలా పంచి పెట్టడం శ్లాఘనీయం.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  10. ఆహా! ఎంత మధురమైన పద్యాలు. దాశరథి, గడియారం, విశ్వనాథ, జాషువాలను తలపింపజేసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మా స్పందనకు మీ ప్రతిస్పందనను చూస్తూంటే 'విద్య యొసగును వినయంబు' అన్న ఆర్యోక్తి యెంత సత్యమో తెలుస్తోంది.

    రిప్లయితొలగించండి
  12. @ బాలు మంత్రిప్రగడ

    ధన్యవాదాలు.....మీ అభినందనలకు నా అభివందనాలు

    @ కంది శంకరయ్య గారు

    వస్తువు ఉదాత్తమైనప్పుడు , పద్యాలలో పటుత్వం కూడా అలాగే వస్తుంది కదా! అయినా ఇది చంద్రుడికో నూలుపోగు వంటిదే !!! బహుధా ధన్యవాదాలు !!!

    @ మిస్సన్న గారు

    పునరభివాదాలు.....ధన్యవాదాలు !!!

    రిప్లయితొలగించండి