27, డిసెంబర్ 2010, సోమవారం

కరుణశ్రీ

* తీయని పాలధారలును ; తేనెల సోనలు - పూల వానలున్
  హాయిని గూర్చు తెమ్మెరలు ; అల్లన పిల్లనగ్రోవి వోలె ' ఓ
  హో ' యనిపించు రాగములు , నుల్లము నూయెలలూపు భావముల్
  మాయురె ! నీ కవిత్వ రస మాధురి లో రవళించు సత్కవీ!!!

* మనసుకు నచ్చినట్టి సుకుమారుడు - మారుడు , వీని చెంత కో
  రిన యశమున్ గడింతును ; వరింతు ; తరింతు ; చరింతు వీని నా
  ల్కను యని నిన్ను చేరినది కమ్ర కవిత్వ వధూటి ; పాండితీ
  ధనమును శుల్కమిచ్చినది - ధన్యత గాంచితివయ్య సత్కవీ !!!

* అలతి అలతి పదాలతో నార్ద్రమైన
  భావములు పల్కగా నీకు నీవ సాటి !
  కరుణ రసమును చిందు నీ కవితలందు
  వెల్లి విరియును తెలుగుల వెలుగులవని !

* నీవు పద్యమ్ములను ' వ్రాయ ' లేవు స్వామి !
  నేత్రపర్వ మ్మపూర్వమౌ చిత్రములను
  కుంచె తో చిత్రకారుడు కూర్చు భంగి
  కలముతో ' భావ చిత్రణ ' సలుపగలవు !!!

( కుంతీ కుమారి వంటి పద్యాలు అక్షర సాక్ష్యాలు )

* విరుల కన్నీటి వెతలను వెల్లడించు
  కవితతో పాఠకుల కన్నుగవల యందు
  దుఃఖ హర్షాశ్రుధారలు తొణకునట్లు
  చేసినావయ్య సత్కవీ వాసికెక్కి !

* నయముగ - విద్వత్ శ్రేష్ఠ వి
  జయముగ - రసమయముగా - లసత్ జ్ఞాన మహో
  దయముగ - నీ కవితా సం
  చయ ' ముదయశ్రీ '  యశస్సు సంపాదించెన్ !!!

* సుందరమగు నీ కవితా
  మందార మరంద బిందు మాధుర్యమునన్
  చిందుల్ ద్రొక్కని యాంధ్రుం
  డెందుండును ? సందియమ్ములేలా? సుకవీ! 

* కమనీయము ; రమణీయము
  సుమనోజ్ఞము ; సురుచిరమ్ము ; శోభామయమై
  యమకాలంకారమ్ముల
  గమకించెడి నీ కవిత్వ కాంతన్ దలతున్ !!!

5 కామెంట్‌లు:

  1. పద్యాలు చాలా బాగున్నాయండీ. కరుణశ్రీ గారికి సముచితమైన నివాళి

    రిప్లయితొలగించండి
  2. డా.విష్ణునందన్ గారూ
    మీబ్లాగ్ పేరు ధర్మదండం అని ఎంచుకోవడానికి కారణం తెలుసుకోవాలని ఉందండీ

    రిప్లయితొలగించండి
  3. నేను హైస్కులు చదివే రోజుల్లో తెలుగు పుస్తకాల్లో నన్నయ,తిక్కన,మరియు పోతన గారలు వ్రాసిన

    "పాతాళైక నికేతనాంతరామునన్ బర్వెన్ ----------భాడభానల శిఖా శంకాది కాతంకమై " " భీష్మ ద్రోణ కృపాది ధన్వి ----నే జేరంగశక్తుండనే ! " జ్యావల్లీధ్వని గర్జనంబుగా ----బాణ చయ మంభశ్శీకరశ్రేణిగాన్" లాంటి పద్యాలు ఉండేవి . అప్పుడే నేను ఒకసారి

    కరుణశ్రీ వ్రాసిన కుంతీ కుమారి లోని
    " అది రమణీయ పుష్ప వన మా వనమందొక మేడ, మేడపై

    అది యొక మారు మూల గది యాగది తల్పులు తీసి మెల్లగా

    పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచ బిడ్డ ,జం

    కొదివెడు కాళ్ళ తోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగాన్"

    లాంటి పద్యాలు చదివి పుస్తకాల్లో ఎలాంటి పద్యాలు పెట్టక, అలాంటి పద్యాలు పెట్టి మమ్మల్ని చంపుతారెందుకో అని అనుకునే వాణ్ని .మీరు వారిపై వ్రాసిన ఈ పద్యాలు వారి పద్యాలకు సరి తూగు విధంగా ,హృద్యంగా ఉన్నాయి .

    రిప్లయితొలగించండి
  4. @ ఊకదంపుడు గారు
    నాకు విశ్వనాథ వారంటే భయభక్తులూ ....కరుణశ్రీ గారంటే ఆదరాభిమానాలూనూ ..... మహాకవులు వారు !!! నమోనమః !!!

    @ మంద పీతాంబర్ గారు
    కరుణశ్రీ గారి పద్యాల మాధుర్యం నిజంగా చదివి ఆనందించవలసిందే .... పంచదారపలుకులూ, రసగుళికలే .....అభివాద పురస్సర ధన్యవాదాలు !!!!

    రిప్లయితొలగించండి
  5. కరుణశ్రీ గారికి చాల హృద్యమైన నివాళి అందించినారు మహోత్తమా !!

    రిప్లయితొలగించండి