23, డిసెంబర్ 2010, గురువారం

" ప్రేయసి ! స్వప్న సుందరి !!! "

* నిన్నే నేనుగ నాత్మలో దలచితిన్ ; నీ ప్రేమకై వేచితిన్ ;
  సున్నాయౌ బ్రతుకీవు లేక చెలి ! దాసున్ నన్ను మన్నింపవే !
  చిన్నారీ ! కరుణార్ద్ర చిత్తమున సంక్షేమంబు సంధింపవే !
  నన్నో ప్రేయసి ! స్వప్న సుందరి ! మహానందాబ్ధి దేలింపవే !!!

* విద్యా గంధము , సద్వినీత విలసద్వృత్తాంతమున్ , సర్వధా
  హృద్యంబౌ కమనీయ రూపమును , దేవీ ! వూహ గల్పించు నీ
  వా ద్యౌ లోకపు కాంతవే యనుచు -  సమ్యక్ రీతి నే వ్రాసితిన్
  పద్యాల్ ; ప్రేయసి ! స్వప్న సుందరి మనోభావానుగుణ్యంబుగన్ !!!

( ఓ నా ప్రేయసీ ! స్వప్న సుందరీ !!! నీకున్న విద్యా బుద్ధులూ , మంచి నడవడిక , నీ సర్వాంగ సుందరమైన రూపమూ , యివన్నీ గమనిస్తే నువ్వు సాధారణ మానవ కాంత కాదేమో....సాక్షాత్తూ దేవ కన్యవేమో అని అనిపిస్తూంది ......నా యీ వూహకు , యీ మనోభావాలకూ తగినట్టుగా పద్యాలు రచిస్తూన్నాను !!! ) 

* ఆ రాయంచకు లేదు నీ నడకలో రాజిల్లు వయ్యార మౌ
  రా ! రాచిల్కకు లేదు నీ నుడువులో రంజిల్లు తీయందన
  మ్మా రంభాదులకైన లేవు కద ! నీ అందమ్ము చందమ్ము ల
  య్యారే ! ప్రేయసి ! స్వప్న సుందరి ! అమందానంద సంధాయినీ !!!

( అమితమైన ఆనందాన్ని చేకూర్చే నా ప్రేయసీ ! ఓ నా స్వప్న సుందరీ !!! నీ నడకలో రాజిల్లే వయ్యారాలు , కులుకులూ  ఆ రాజహంసకైనా లేనే లేవు...నీ పలుకు లో కదలాడే మృదుత్వమూ , ఆ తీయందనమూ ఆ రామ చిలుక పలుకుల్లోనూ లేవు....యిక నీ అందచందమ్ములా ? రంభాదులకైనా ముమ్మాటికీ లేనే లేవు కదా !!!.......)

* నీ కంఠమ్ము స్రవించు వాక్సుధల ; కానీ దేవి ! శంఖమ్ము హా
 హా కారమ్ములె సేయుచుండు సఖియా ! ఆకార సామ్యమ్మునన్
 నీ కంఠమ్మున పోల్పగాదగదు దానిన్ రాణి ముమ్మాటికిన్ !
 నీకున్ ప్రేయసి ! స్వప్న సుందరి ! చెలీ ! నీ రూపమే సాటియౌ !!!

( ప్రబంధ నాయికల అందాన్ని పోల్చేటప్పుడు సాధారణంగా ముఖాన్ని చంద్రుడితోనూ , ముంగురులను తుమ్మెదలతోనూ , కంఠాన్ని శంఖంతోనూ పోల్చడం పరిపాటి....అయితే నీ కంఠమేమో తీయని , మృదు మధురమైన వాక్కులనే అమృతాన్ని స్రవిస్తూ వుంటే , ఆ శంఖమేమో ' హాహాకారాలను ' ధ్వనిస్తూ వుంటుంది ....కేవలం ఆకార సామ్యం వున్నంత మాత్రాన , నీ కంఠాన్ని ఆ శంఖం తో పోల్చడం ఎంత మాత్రమూ సరికాదు ....నీకు నీవే ఉపమానమూ.....  నీకు నీవే ఉపమేయమూ !!! )

* ఔరా ! నిన్ గనలేని కన్నులివి యేలా ! వ్యర్థమే !!! నిన్ను ప్రే
  మారన్ కౌగిట జేర్చలేనివివి యీ హస్తంబులేలా ప్రియా ?
  నీ రమ్యంబగు ముద్దు పల్కు వినవేనిన్ కర్ణముల్ యేల ? నిన్
  చేరన్ ప్రేయసి ! స్వప్న సుందరి ! మదిన్ చింతింతు నస్రాంతమున్ !!!

( అప్పుడెప్పుడో భాగవతంలో ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లేఖ వ్రాసి పంపిస్తూ " ప్రాణేశ ! నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల? భువన మోహన నిన్ను పొడగానగా లేని  చక్షురింద్రియముల సత్వమేల ? " అని ప్రశ్నించుకొన్నట్టే నాకూ అనిపిస్తోంది చెలీ!!! నిన్ను చూడలేని యీ కన్నులు వుండీ లేనట్టే ! నిన్ను ప్రియమారా కౌగిలింపలేని యీ హస్తాలు వుండీ యేమి ప్రయోజనం? నీ ముద్దు ముద్దు పలుకులను విని తరించలేని నా యీ చెవులకు సార్థక్యమేమీ? సదా నిన్ను చేరి పరవశించాలనే నా మదిలో చింతిస్తూ వుంటాను నా ప్రేయసీ ! నా స్వప్న సుందరీ !!! )

* భామా ! అందము , సద్వివేకము , నిగర్వమ్మున్ , గుణశ్రేష్ఠతల్
  శ్రీమద్రూపము గాంచె నీవగుచు నారీ రత్నమా ! కాంచగా
  సామాన్యాంశము కాదు ; జన్మగత సంస్కార ప్రభావమ్మె ; కా
  కేమౌ ? ప్రేయసి ! స్వప్న సుందరి ! సదా కీర్తింతు నీ పుణ్యమున్ !!!

( ఈ లోకంలో అందం వున్నవాళ్లకు మంచి తెలివితేటలు లేకపోవచ్చు ....అందమూ , తెలివితేటలూ వుంటే , అహంకారమూ వుండి తీరుతుంది....అందమూ, తెలివితేటలూ ,గర్వం లేకుండా వుండగలగడమూ అరుదు ....ఈ మూడూ వున్న వాళ్లకు సద్గుణగణాలు కూడా తోడవ్వడం మరీ అరుదు ....కానీ నీలో మాత్రం అందమూ , తెలివితేటలూ , నిగర్వమూ , గుణ శ్రేష్ఠతా అన్నీ మూర్తీభవించినాయి ....ఇదేదో సామాన్యమైన విషయమెంత మాత్రమూ కాదు లే ! జన్మ సంస్కారమే కారణం ...యెంత భాగ్యశాలివో కదా నా ప్రేయసీ ! నా స్వప్న సుందరీ !!! )

* ఆలస్యమ్మును జేయగా నమృతమే హాలాహలమ్మౌను ; నే
  నే లీలన్ నిను గాంచగా గలనొ ? నాకేదీ వుపాయమ్ము ? నన్
  పాలన్ దేల్తువొ ? నీట ముంచెదవొ ? నా భాగ్యమ్మదెట్లున్నదో ?
  ఏలా ప్రేయసి ! స్వప్న సుందరి ! పరీక్షించేవు నన్నీ గతిన్ ?

( ఆలస్యం చేస్తే అమృతమే విషమౌతుందట ...నేనెలా నిన్ను చేరగలను ? నాకేదీ దారి ? నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం ! ఓ నా ప్రేయసీ ! స్వప్న సుందరీ ! యెందుకిలా నన్ను పరీక్షిస్తున్నావు??? ) 

* ఆ మేఘంబెట కేగెనో? ఎటకు నా హంసోత్తముండేగెనో ?
  ఏ మార్గంబున నా మనోగతము దేవీ ! నీకు నే దెల్పెదన్?
  ఆమోదించవె నా అమోఘమగు పద్యాహ్వానమున్ ; నా మన
  స్సీమన్ ప్రేయసి ! స్వప్న సుందరి ! సదా చింతింతు నీ రూపమున్ !!!

( కాళిదాసు మేఘసందేశంలో వలె మేఘముతో రాయబారం పంపిద్దామన్న ఆ మేఘుడెక్కడున్నాడో యేమో? పోనీ నల దమయంతులను ఒక్కటి చేయగా రాయబారం సలిపిన ఆ 'శుచిముఖు ' డనే రాజ హంస యిప్పుడెక్కడికి వెళ్లినాడో ? ఏమైనాడో ? నా మనోగతాన్ని నీకు తెలిపే వేరే దారి యేదీ? సరే....అమోఘమయిన నా పద్య కవిత్వంతోనే ఆహ్వానం పలుకుతున్నాను ....ఆమోదించి విచ్చేయవే ..!!! ఓ నా ప్రేయసీ ! స్వప్న సుందరీ ! నా మనస్సీమలో యెల్లప్పుడూ నీ రూపాన్నే ధ్యానిస్తూ వుంటాను !!!)

2 కామెంట్‌లు:

  1. మనందరికీ ఒక మానసిక ప్రేయసి వుంటుందని ఎక్కడో చదివాను. ఆ ప్రేయసి ని మీ కవిత్వం ద్వారా కళ్ళెదుట చూపారు.

    రిప్లయితొలగించండి
  2. Mee swapna sundariki ujjwala sthaanaanni ichaaru goppagaa!

    రిప్లయితొలగించండి