20, డిసెంబర్ 2010, సోమవారం

నా అభిమాన కవి విశ్వనాథ !!!

* భద్రాలంకృత మూర్తివై ; సుకవితా వ్యాపార సంధాన ని
  ర్ణిద్రాహంకృత కీర్తివై ; బహుముఖాన్వీతోజ్జ్వలత్సాహితీ
  చిద్రూపమ్ము ధరించి ' యాంధ్రుల ప్రశస్తి ' న్ జాటినావయ్య ! శ్రీ
  మద్రామాయణ కల్ప వృక్ష కవి సమ్రాట్! విశ్వనాథా ! నతుల్ !!!

(కథా, కథానిక , నవల, పద్యమూ, పాట, విమర్శ, గేయమూ ,కావ్యమూ , యిలా ఒక్కటేమిటి? అన్ని రంగాల్లోనూ అందంగా అలంకరించబడిన బహుముఖ ప్రజ్ఞ సాధించి - సుకవిత్వ సంధాన ప్రక్రియలో కొండొకచో ధిషణా అహంకారాన్ని మేళవించి ఆంధ్రుల ప్రశస్తి   ( ' ఆంధ్ర ప్రశస్తి ' ఆయన కావ్యమే ) ఇదీ అని చాటి చెప్పిన శ్రీమద్రామాయణ కల్పవృక్ష కవిరాజా ! విశ్వనాథ ప్రభో !!!! నమస్సులు )

* నీ వైయక్తిక భావజాలము , కథా నిర్మాణ వైచిత్రి , శై
  లీ వైశిష్ట్యము , వాక్చమత్కృతి , మహా క్లిష్టాన్వయ స్ఫూర్తి నౌ
  రా ! విశ్వంభర యెల్ల మెచ్చుకొనుచున్ హర్షాతిరేకంబునన్
  సేవించెన్ నిను జ్ఞానపీఠమున రాశీభూత సంవిన్నిధీ!!!

* లలితమ్మైన పదాలతో సుకవితా లావణ్యమున్ జూపినన్ ,
  కలిత క్లిష్ట సమాస బంధురముగా కావ్యమ్ము నిర్మించినన్ ,
  శిలలైనన్ దలలూచి మెచ్చెడి రస శ్రీ గంధమున్ జిమ్ము మం
  జుల పాండిత్యము నీకు దక్క మరి యెందున్ గందుమోయీ ప్రభూ!!!

( లలిత లలితమైన పదాలతో కిన్నెరసాని పాటలు రచించినా , " నిష్ఠా వర్షదమోఘ మేఘ పటలీ " అంటూ సమాసార్భటితో కావ్యాలు నిర్మించినా , ఆ పాండిత్యానికి శిలలైనా తలలూచి మెచ్చాల్సిందే ....అంతటి నేర్పు  విశ్వనాథ వారికి కాక మరెక్కడుంది? ఎవరిలో ఉంది??? )

* ప్రాచీనార్ష పథ ప్రబోధముల నర్వాచీన గాథోక్తిగా
  నాచంద్రార్కము నిల్ప ' వేయి పడగల్ ' ఆడించుచున్ వాఙ్మయ
  ప్రాచుర్యామృతమున్ స్రవించు ధిషణా వాగ్భోగ భోగీంద్ర ! నీ
  ధీ చిహ్నమ్ముల నెన్న నా తరమె?  సంధింతున్ నమోవాకముల్ !!!

(నీవు సాక్షాత్తూ వేయి ముఖాలతో జ్ఞాన స్వరూపుడవైన ఆదిశేషుడవే అని చెప్పడం...అయితే  ఆ ఆది శేషునికీ , యీ విశ్వనాథునికీ ఒక తేడా ఉంది....అతడేమో తన వేయి పడగల ద్వారా భయంకరమైన కాలకూట విషాన్ని చిమ్ముతాడు......మరి యితడేమో తన ' వేయి పడగల ' ద్వారా వాఙ్మయమనే అమృత రసాన్ని చిందుతాడు !!!! అదీ ఈ తేడా)

* వాగను శాసన ప్రాభవమందున
    ఒక నన్నయార్యుడే నోయి నీవు!
  పద్య శిల్ప విభవ విద్యా విభూతిలో
    నొక తిక్క యజ్వయే నోయి నీవు !
  మహిత ప్రబంధ నిర్మాణ వైచిత్రిలో
    నొక యెఱ్ఱనార్యుడే నోయి నీవు !
  సంస్కృతాంధ్రోభయ శబ్ద సంవిత్ప్రౌఢి
    నొక్క శ్రీనాథుడే నోయి నీవు !

  ఒకడు నాచన సోమన్న ; ఒక్క పోత
  రాజు ; పెద్దన్న ; తెన్నాలి రామకృష్ణు
  డాది ప్రాచీన కవిముఖ్యు లందరొకట
  కలసి నీ రూపమేర్పడె ! కవివరేణ్య !!!

* సంస్కృతాంధ్రాంగ్ల భాషల సరి సమాన
  పాండితీ శక్తి నీకున్న ప్రజ్ఞ జాటు ;
  ఛందముల నేలగల్గిన ఛాందసుడవు !
  దార్శనికుడవు ; ఘన సద్విమర్శకుడవు !!!!

( విశ్వనాథ వారంటే యేదో పరమ ఛాందసుడూ , సంస్కృతం , తెలుగూ తప్ప మరేమీ పట్టవనుకొంటే పొరపాటే ! ఆకాలానికే ఆంగ్లం లో వచ్చిన నూతన నవలలన్నీ ఆయన ఔపోశన పట్టేవారు...యింకా విచిత్రమైన విషయమేమంటే విజయవాడలో వచ్చిన ఆంగ్ల చలనచిత్రాలను క్రమం తప్పకుండా దర్శించేవారు కూడానూ!!!)  

* గురువును మించిన శిష్యుం
  డరయగ మా విశ్వనాథ యని గురువరులే
  పరమాదరమున పలికిన
  గురుతర ధీశాలి ! అందుకొనుమయ్య నతుల్ !!!

(విశ్వనాథ వారి గురువరేణ్యులు - తిరుపతి వేంకట కవులలో నొకరైన చెళ్లపిళ్ల వారు , విశ్వనాథ వారిని ప్రశంసిస్తూ పలికిన సందర్భం ! )

* అనుమానమ్మది యేలనయ్య ? నిజమే ! ఆ జ్ఞానపీఠమ్ము చం
  ద్రునకర్పించిన నూలుపోగు ; భవదుత్తుంగ ప్రతాపోజ్జ్వలత్
  ఘన సారస్వత భావ సంకలిత మేథా శక్తికేమేమి యి
  చ్చిన గానీ సరిపోదు ; నీ ఋణము కై చెల్లింపనేమున్నదో???!!!!

(ఆ జ్ఞాన పీఠమిచ్చామే గానీ , నీ అత్యద్భుతమైన మేథా శక్తి ముందర అదొక చంద్రునికి నూలుపోగు వంటిది ....ఏమిస్తే నీవు చేసిన భాషా సేవకు ఋణము తీరుతుంది????)

స్వస్తి !!!!

(ఛాయాచిత్రానికి ఈ మాట వారికి కృతజ్ఞతలతో )

9 కామెంట్‌లు:

  1. విష్ణునందన్ గారూ! విశ్వనాథుల వారి గురించి బహుచక్కగా చెప్పారు.
    మీకు సమకాలీనులమై ఉండి మీ పద్యాలను చదవ గలగటం మా అదృష్టం. మీరు నంద్యాలకు చెందినవారని తెలిసి మరీ సంతోషం కలిగింది.

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం20 డిసెంబర్, 2010 2:09 PMకి

    అనుమానమ్మది యేలనయ్య ? నిజమే !
    సరిలేరు మీకెవ్వరు.
    మీ పాండిత్యానికి వందానాలు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  3. @ మందాకిని గారు

    మీ సుహృద్భావానికి ధన్యవాదాలు ....

    @ మంత్రిప్రగడ వేంకట బాల సుబ్రహ్మణ్యం గారు

    మీ సరసజ్ఞత ప్రశంసనీయం .... మరొక్కసారి ధన్యవాదాలు !!!

    రిప్లయితొలగించండి
  4. విశ్వనాథ వారి బహుముఖ ప్రజ్ఞను ప్రస్తావించిన మీ కవిత అత్యంతానంద ప్రదాయిని. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. అద్భుతమండీ - పరమానందమైంది ఈ పద్యాలు చదువుతూంటే

    రిప్లయితొలగించండి
  6. మీ కవిత్వం గురించి ఏమనను!నేనేమనను?

    ఎన్న దగినట్టి సుకవుల వన్నెలన్ని
    విశ్వ నాథుని కృతులలో దృశ్యమాయె
    ననుట సత్యము, పరికింప అందరూను
    ఉందురందును మీడెందమందుగూడ!

    మందాకినీ గారన్నట్లు మేము మీ సమ కాలికులం కావడం మాకు ఒక భాగ్యము.అందునా బ్లాగ్పరిచయం కలగడం ఇంకొక భాగ్యము .మీ కవిత్యం ఆస్వాదించడం మాకు కలిగిన మరో మహద్భాగ్యము .

    రిప్లయితొలగించండి
  7. @ కంది శంకరయ్య గారు
    కృతజ్ఞతలు....మీ ఆదరాభిమానాలు సంతోషదాయకం........!!! ధన్యోస్మి !

    @ ఊకదంపుడు గారు
    మీ అభినందనలతో పరమానందం కలిగింది ..... సరసులైన పాఠకులు లభించడమూ అదృష్టమే కదా!!!

    @ మంద పీతాంబర్ గారు
    చాలా పెద్ద ప్రశంస ! కృతజ్ఞతా సాహస్రి !!! మీ బోంట్ల అభినందనలు సదా స్ఫూర్తిదాయకములు !!! ప్రణామాలు !!!

    విశ్వనాథుని కృతులలో వెలుగులీనె (యతి కోసం) ..... ననుట సత్యము పరికింప నఖిల కవులు ( వ్యావహారిక భాష నివారణ కోసం ) గా మారిస్తే బాగుంటుందేమో ....

    పునరపి నమామి !!!!

    రిప్లయితొలగించండి
  8. విశ్వనాధ వారి గురించి యెంత చెప్పినా సరిపోదు. వారు మా మాతామహ స్థానం నుంచి తాతగారు. వారు ఛాందసులు కాదని మీలాంటి వారు వ్రాయటం చాలా బాగుంది. ఆయనను అర్థం చేసుకోవటం అంత తేలిక గాదు. ఏదో ఒకటి అని, మేమూ మొరగ గలం అనిపించు కొనే వారి సంఖ్య ఎక్కువవుతున్న రోజులలో, విజ్ఞులైన మీ వ్యాఖ్యలు చదివి ఆనందించాను.
    ఈ పోస్టు వరకు అజ్ఞాత గానే వుంటా.

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత గారు .. విశ్వనాథ వారు మీ మాతామహులా? అయ్యా సంతోషం. అంతకన్నా అదృష్టమేముంటుంది ? మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి