14, డిసెంబర్ 2010, మంగళవారం

"పరిచయం"

అజ్ఞాతృత్వము వీడి నేనిటుల సమ్యక్స్వస్వరూపమ్ముతో
విజ్ఞానాంబుధినోలలాడుటకునై విచ్చేసి కైమోడ్చెదన్!!!
యజ్ఞంబీయది ; అక్షర క్రతువు ; ధ్యేయంబూని పాల్గొందు నో
విజ్ఞుల్ ; పేరుకు -' విష్ణు నందనుడ ' - సర్వేభ్య : ప్రణామశ్శతం!!!!

ప్రాక్తన పుణ్యలేశమున పద్యము లల్లుచునుందు ; పాండితీ
శక్తియు నావగింజ ; మరి సంస్కృత మేధయు సున్న; భారతీ
భక్తుడనామె దివ్య పద పద్మములన్ భజియించి పుణ్య సం
సక్తుడనైతి- 'ఛాందసపు  జాడలెరుంగని వాడ జూడగన్ ' !!!

వైద్యుడ వృత్తికి ; కవితా
సేద్యమ్మే నా ప్రవృత్తి ; శ్రీ కవితా నై
వేద్యమ్మిడి సత్కవితా
విద్యా భారతిని గొల్తు వినయాంజలితో !!!!

9 కామెంట్‌లు:

  1. డా. విష్ణు నందన్ గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నాయి.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  2. వేంకట బాలసుబ్రహ్మణ్యం గారికి- శతథా కృతజ్ఞతలు!!!!

    రిప్లయితొలగించండి
  3. చంద్రశేఖర్ (క్యాంపు విజయవాడ)15 డిసెంబర్, 2010 10:28 AMకి

    అలాగే మీ ఈమెయిలు, ఫోన్ నెంబర్ అందిస్తే ఇంకా దగ్గరగా సంభాశించుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. నా ఈమెయిలు lanpad@gmail.com. వ్రాయటం మరిచాను.

    రిప్లయితొలగించండి
  5. శంకరాభరణం బ్లాగులో మీరు అజ్ఞాతగా చేసే పూరణలన్నింటినీ చదివి ఆనందించే వాడిని. ఇప్పుడా అజ్ఞాతవాసాన్ని వీడడమే కాకుండా బ్లాగు కూడా మొదలుపెట్టడం చాలా సంతోషకరం.

    అజ్ఞాతమ్మును వీడి మీరిటుల సద్వ్యాహార సంలేఖనా
    భిజ్ఞత్వమ్మున విష్ణునందనులుగా విచ్చేయ నిచ్చోటికిన్
    తజ్ఞామోదము కల్గె పద్యమకరందస్వాదనామాధురిన్
    ప్రజ్ఞాలుంఠిత సౌహృదీ వినయసంపన్నా నమోవాకముల్

    విరిశరముల సరిపోలెడు
    వరధారాపూర మధుర పద్యముల వెసన్
    సరసుల యెద దోచెడు సుం
    దర! సార్థకనామ! విష్ణునందన జయహో!

    రిప్లయితొలగించండి
  6. @ భైరవభట్ల గారు
    ధన్యవాద పరశ్శతం!!!! మీ పద్య సుమమాల సౌరు హాయిగొలిపింది. చక్కని ధార !!! అంతకన్నా చక్కని శయ్య !!! ఇంకా చక్కని భావం!!! కృతజ్ఞతలు !!!మనలో మన మాట ......తద్జ్ఞులు కదా......అర్థం చేసుకొంటారు!!!!

    రిప్లయితొలగించండి
  7. నిజమేనండి! ప్రాస వేసే తొందరలో పద స్వరూపాన్ని మరచిపోయాను. సరిదిద్దిన పద్యం:

    అజ్ఞాతమ్మును వీడి మీరిటుల సద్వ్యాహార సంలేఖనా
    భిజ్ఞత్వమ్మున విష్ణునందనులుగా విచ్చేయ నిచ్చోట న
    ర్థజ్ఞా! మోదము కల్గె పద్యమకరందస్వాదనామాధురిన్
    ప్రజ్ఞాలుంఠిత సౌహృదీ వినయసంపన్నా నమోవాకముల్

    రిప్లయితొలగించండి
  8. @ భైరవభట్ల గారు

    భేష్!!!! సాహో!!! తీరైన పదాల పోహళింపు!!!! మనః పూర్వకాభినందనలు !!!!
    కృతజ్ఞతా సహస్రం !!!

    రిప్లయితొలగించండి
  9. స్వాగతండీ - మీరు శతసహస్రం గా పద్యాలు వ్రాయాలని కోరుకుంటున్నాను.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి