14, డిసెంబర్ 2010, మంగళవారం

తెలుగు భాష - తెలుగు వాడు!!!

తెలుగు సమస్త భాషలకు తీరును నేర్పెడి యొజ్జ బంతి ; యీ
జిలిబిలి పల్కులో వెలుగు జీవము , భావము వేరు భాషకున్
కలుగునె??? రాజహంస నడకల్ , నడతల్ , నయగారముల్ , హొయల్
అలవడునే గనన్ కువలయమ్మున వేరొక పక్షి జాతికిన్????

అమృతము చిందు భాష ; పరమాన్నము పోలిక నుండు భాష ; సా
రమున తుషారమై రుచుల రాజిలు భాష ; విపంచికా ధ్వనుల్
సుమధుర రీతి బల్కు వినసొంపగు భాష ; అజంత భాష ; వే
దము వలె శుద్ధమైన పరతత్వము నిక్కము తెల్గు భాషయే !!!

కవితలు ; గేయముల్ ; కథలు ; కావ్యములున్ ; బలు నాటకమ్ములున్
వివిధములైన  ఛందముల  ప్రీతిని గూర్చు మహేతిహాసముల్ ;
నవయుగ విప్లవమ్ము ; వచనమ్ము ; కథానిక ; గీతముల్ ; గజల్;
భువిపయి తెల్గు భాష - పరిపుష్టముగా వెలుగొందు నన్నిటన్!!!

మరి  యింతటి మహోత్కృష్ట సంపదకు వారసుడైన తెలుగు వాడేమైనా తక్కువా???....కానేకాదు!!!

ఆవకాయ , ఘృతమ్ము లాహారమున లేక
       తినబోనిదెవ్వండు??? ' తెల్గు వాడు ' !!!
భుజముపై పైపంచె నిజ గౌరవము దెల్ప
      తేజరిల్లునెవండు ??? ' తెల్గు వాడు ' !!!!
ఆత్మాభిమానాన అకాశమంతెత్తు
      వెల్గుచుండు నెవండు ??? ' తెల్గు వాడు ' !!!!
శాంతికి మారుగా - సహనమ్మె పేరుగా
       తెలియవచ్చు నెవండు??? ' తెల్గు వాడు ' !!!

ప్రాణ దానమ్ము సేయు విరాగి వాడు !
జ్ఞాన పీఠమ్ము గెల్చిన జాణ వాడు !
దేశమును చక్కదిద్దిన దిట్ట వాడు !
సకల రంగాల తన ప్రజ్ఞ చాటు వాడు !!!

తెలుగు వెలుగులు వర్థిల్లాలి....!!!!!

( ఆంధ్రత్వ మాంధ్ర భాషా చ నాల్పస్య తపసః ఫలం - అప్పయ్య దీక్షితులు )

6 కామెంట్‌లు:

  1. విష్ణు నందన్ గారూ శారదాంబ మీకు చక్కని కవితా శైలిని ప్రసాదించింది.మీ కవితలు చదివే భాగ్యము మాకు గురువులు శంకరయ్య గారి వలన ప్రాప్తించింది. మీ యిరువురుకు నమస్కృతులు.

    రిప్లయితొలగించండి
  2. నిజమేనండీ!!! నా యీ తృప్తినిచ్చే సాహిత్య విద్యా మరియు భుక్తినొసగే లౌకిక విద్యా రెండూ ఆ తల్లి ప్రసాదమే!!!! ధన్యవాదాలు!!!!

    రిప్లయితొలగించండి
  3. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం15 డిసెంబర్, 2010 11:24 AMకి

    డా. విష్ణు నందన్ గారూ,
    'మన ' గురుంచీ, మన భాష గురించీ మీ పద్యాలు అమోఘం
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  4. " అచ్చపు జుంటి తేనియల ......సుధారసాల గోర్వెచ్చని పాల మీగడల మచ్చరింకించు యీ మధుర మంజుల మోహన ముగ్ధ భావనల్ ఎచ్చటినుండి నేర్చితివి ......సుకవీ సుకుమార కళా కాళానిధీ !!!" జంధ్యాల పాపయ్య గారు ,బమ్మెర పోతనామాత్యుని
    గురించి వ్రాసిన పద్యం మీకు అక్షరాలా సరిపోతుంది . వారిప్పుడు ఉండిఉంటే, మీ కవితలను చూసి ఉంటే అలానే అనేవారేమో!
    పైనుండి చదివి ఆనందిస్తున్నరేమో కూడా! మీలో పోతన గారున్నారా? లేక పోతనలోనే మీరుండిరా ? చెప్పడం కష్టమే!

    మీ కవితలు ఒకసారి చదివి వదిలేసేవి కావు .మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూ మదిలో పదిల పరచుకోదగినవి.ఎన్నిమార్లు చదివితే
    ఆన్ని సార్లు అదే స్థాయిలో ,అంతే రసాస్వాదన పొంద వచ్చును.చదివిన కొద్దీ మానిసికానందం ,దానితో పాటు ఆరోగ్యమూ పెరుగుతుంది .ఎంతైనా మీరు సత్కవితా వైద్యులు కదా మరి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పద్యాలు వ్రాస్తున్న మాలాంటి వారికి మీ కవితలు చక్కని మార్గ దర్శకాలు . క్రొత్త కవిని గదా ,పద్యంలో స్పదించాలని అనిపించడం సహజమే కదా తప్పులుంటే వదిలేయండి.



    వీచె సుగంధముల్ దగిలి వీవలి,దేహము పుల్కరించె,నన్
    జుచితివా యటంచు దన చూపులు , పైనను జిల్కరించె, చే
    సాచియు ,వెన్నుదట్టి మనసారగ కైతలు ,పల్కరించగా
    పూచెను మల్లియల్ మదిలొ పుణ్యము పూర్వము జేసియుంటినో!!


    చదివిన కొలదియు ,వదలక,
    చదువాలని పించు చుండు, చదువుల తల్లే
    పద పద మందున నిలబడి,
    చదువరులకు విందు జేయు,చందము దోచున్!!!

    రిప్లయితొలగించండి
  5. @ మంత్రిప్రగడ గారు
    కృతజ్ఞతలు

    @ మంద పీతాంబర్ గారు
    ధన్యోస్మి !!!

    మీ పద్యాల్లో మాధుర్యం పుష్కలంగా ఉంది. ఇంతకూ నా అభిమాన కవుల్లో పోతన అగ్రగణ్యుడు.....ఆ మహానుభావుడికీ నాకూ పోలిక కాదు కానీ ఆయన మార్గాన్ని అనుసరించాలని ప్రయత్నించడం కూడా నాకెంతో యిష్టం కూడానూ.....

    శౌరికి ; దానవ కుల సం
    హారికి; నాశ్రిత మనోవిహారికి ; నరిష
    డ్వైరికి ; జగదుపకారికి ;
    క్షీరాబ్ధిజ సౌఖ్యకారికిన్ - శ్రీహరికిన్....!!!!

    మొదలైన నా పద్యాలు ఆయన పెట్టిన భిక్షయే!!!!

    రిప్లయితొలగించండి
  6. తెలుగు వాడిగా పుట్టాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలి. పూర్వ దుష్కృతం వల్ల అలా తెలుగు వాడిగా పుట్టి కూడా కొందరు ఆ జుంటి తేనెతెలుగుకు దూరమౌతున్నారు. ఇక మీ కవితా వైభవం దైవదత్తం. మీ సాంగత్యం మా అదృష్టం.

    రిప్లయితొలగించండి