16, డిసెంబర్ 2010, గురువారం

వైద్యుడంటే ఎవరూ? అతడెలా ఉండాలి???

వైద్యుడంటే ఎవరూ???అతనికి ఎలాంటి లక్షణాలుండాలి??? అని జన సామాన్యంలో ఒక ప్రశ్న.

కొందరైతే " వైద్యో నారాయణో హరిః " అంటూ వైద్యుణ్ని సాక్షాత్తూ దైవ సమానుడి గా మార్చేశారు. మంచిదే!!! మృత్యు ముఖం లో చిక్కుకుని....గిల గిలలాడుతూ...నరక యాతన అనుభవించే రోగి పాలిట చక్కని వైద్యాన్నందించే వైద్యుడు ఖచ్చితంగా నారాయణ స్వరూపుడే!!!

మరి అధే ఇంకొంత మంది ప్రాచీనులు వైద్యుడిని యమరాజ సహోదరుడిగా పోల్చిన సందర్భాలూ లేకపోలేదు.....

" వైద్య రాజ ! నమస్తుభ్యం!
యమరాజ సహోదర!!!
యమస్తు హరతే ప్రాణాన్
త్వం తు ప్రాణాన్ ధనాని చ "!!!

పాపం యముడైతే ఒక్క ప్రాణాలని మాత్రమే హరిస్తాడట.....మరి యీ వైద్యరాజేమో రోగి నుండి, వారి బంధువుల నుండి వసూలు చేసినంతా చేసి.......వారి ధనాన్ని.....వచ్చీ రాని వైద్యం తో చివరికి చేతులెత్తేసి వారి ప్రాణాన్నీ కూడా హరించగలడట....

వైద్యుడెలా ఉండకూడదో చెప్పుకొన్న తరువాత , ఎలా ఉండాలో చెప్పుకుందాం!!!


పూర్వం ఆయుర్వేద కాలం లో ఒకానొక వైద్యుడుండే వాడట....అవసాన కాలంలో తన కుమారుడిని పిలిచి యిలా ఉపదేశించాడట
"అబ్బాయీ...మా తాత వైద్యుడు...మా నాన్నా ఓ మోస్తరు వైద్యుడే....ఇక నా సంగతి సరే సరి....మరి మాలా నువ్వూ పేరు తెచ్చుకోకుంటే యెలా? వైద్యం లో నీకు ఓనమాలూ రావని బాధపడకు ....యిదిగో సూక్ష్మం చెబుతా విను.....


"యస్య కస్య తరోర్మూలం
యేనకేనాపి మేలయేత్
యస్మై కస్మై ప్రదాతవ్యం
యద్వా తద్వా భవిష్యతి "


" ఏదో ఒక మూలిక తీసుకో.....ఇంకేదో ఒక మూలిక తో కలిపి బాగా కల్వంలో వేసి నూరు....ఎవడికో ఒకడికి మాత్రగా ఇచ్చెయ్య్ ...ఏదైతే అదవుతుంది పో ...ఇంతే వైద్యమంటే " అన్నాడట!!!


వైద్యుడంటే యిలా మాత్రం ఉండకూడదు....తననే నమ్ముకుని ఒక రోగి వస్తే , సావకాశంగా తన బాధలన్నీ విని.... సానునయ వాక్యాలు పలుకుతూ ......అత్యుత్తమ చికిత్స అందించిన నాడే నిజమైన వైద్యుడు....


" ఒకపరి తల్లిగా నొప్పారి రోగుల
లాలించుచు చికిత్సలందజేయు;
ఒకపరి తండ్రిగా నొప్పారి రోగుల
అవసరాలను దీర్చి అభయమిచ్చు;
ఒకపరి గురువుగా నొప్పారి రోగికి
హితబోధలనుజేసి వెతలదీర్చు;
ఒకపరి సఖుని గా నొప్పారి రోగుల
కష్టసుఖములెంచి తుష్టి చెందు ;

తల్లిదండ్రుల మరియు సంతతము గురుని
సఖుని మరిపింపజేయును ; సుఖము గూర్చు;
అహరహమ్మును ప్రజల శ్రేయస్సు కొరకు
పాటువడు దైవసముడు - సద్వైద్యుడెపుడు!!!! " - ( డా. విష్ణునందన్ )

10 కామెంట్‌లు:

  1. విష్ణునందన్ గారూ,
    ఇందరు కవిమిత్రుల రచనలను ఆస్వాదించటమే నా భాగ్యమని అనుకొంటుండగా,
    మీరు మీ రచనలతో ఆ అదృష్టాన్ని ద్విగుణీకృతం చేశారు.
    ధన్యురాలిని.
    ప్రతి శాస్త్రాన్నీ బోధించగలిగేది భాష అనే మాధ్యమమని ,భాషాప్రాముఖ్యతని గుర్తెరిగే వారు కరువైనారు.

    రిప్లయితొలగించండి
  2. మీ కవిత్వాన్ని గురించి చెబుతే ,సూర్యుని ప్రకాశాన్ని ,వెన్నెల చల్ల దనాన్ని,సుమాల పరిమళాన్ని ,సుగంధపు వాసనల్ని గురించి మళ్లీ మళ్లీ చెబినట్లవుతుంది.అవి సహజమైన, స్వభావసిద్ద మైన, ప్రకృతి ప్రసాదించిన గుణాలు .అలాగే మె కవిత్వ మునూ.ఒక విషయాన్ని పలు రకాల వ్యక్తులు పలు సందర్భాల్లో పలు రీతుల్లో చెబుతూవుంటారు.విషయం ఒకటే అయినా చెప్పే వారి ప్రాధాన్యత బట్టి విషయ సాంద్రత మారుతూ ఉంటుంది .చెప్పగలిగివారు వారు చెబితేనే పరిస్థితులు మారతాయి వినే వారూ వింటారు
    వైద్యుడు ఎలాఉండాలో!ఎలా ఉండ కూడదో మీరు చెప్పిన తీరు గొప్పగా ఉంది . అదీ వైద్యులైన మీ వంటి ద్వారా విషయం రావడం విషయ ప్రాధాన్యత సంతరించుకొంది .ఇది ముఖ్యంగా వైదులకు ఒక code of conduct. కొందరైనా నేడు కూడా ఇలాంటి వైద్యులు
    ఉండి ఉండ వచ్చును .ఇలాంటి వైద్యుల వద్ద చేరిన రోగులు ,ఉన్ననూ, పోయిననూ అదృష్టవంతులే గదా!!! మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. రోగిని పూర్తి గా తెలుసుకునే సమయం ఇప్పటి వైద్యులకి లేదు దాక్టర్ గారూ. వాళ్ళు భారీ ట్రాఫిక్ లో ఒక కార్పోరేట్ హాస్పిటల్ నుంచి ఇంకొకదానికి అప్పాయింట్ మెంట్స్ అటెండ్ అవ్వడానికి పరుగులు తీస్తూ ప్రతీ పేషెంట్ కీ వెచ్చించిన సమయంలో రిపోర్ట్స్ చూసి మందులు వ్రాసేస్తున్నారు. మీరు చెప్పినట్లు డాక్టర్స్ కొండకచో ఉండేవుండవచ్చు. మీ భావుకత బట్టి మీరూ అటువంటి వైద్యులని తెలుస్తూనేవుంది. మీకూ, అంటువంటి డాక్టర్స్ కీ, వారి పేషెంట్స్ కీ అభినందనలు. - బాలు

    రిప్లయితొలగించండి
  4. good post.:)) Yama is only one, but his doctor brothers are many.
    snkr

    రిప్లయితొలగించండి
  5. @ మందాకిని గారు
    తెలుగు భాష యెందుకు తీయనో , యెంత తీయనో భావితరాల వారికి తెలియజేస్తూనే ఉండాలి ( విన్నా, వినకపోయినా...).ఏదో ఒకనాటికి ఎవరో ఒకరు విన్నా మన శ్రమకు తగిన ఫలితం లభించినట్టే !!!

    @ మంద పీతాంబర్ గారు
    ఇలాంటి వైద్యులు లేకేమండి?ఇప్పటికీ బోలెడంత మంది ఉన్నారు....అసలీ పద్యం నేను వ్రాసిందే అలాంటి ఒకానొక వైద్యుడిని కళ్లారా చూచిన అనందంలో ( అప్పటికి నా వయసు 17 సంవత్సరాలు......నేనింకా వైద్య వృత్తి లోకి కూడా ప్రవేశించని కాలమది!!!!)

    @ బాలు
    దురదృష్టవశాత్తూ మీరు చెప్పింది నిజమే ...ముఖ్యంగా ఈ నాటి మహానగరాల్లో.....ఇది కాస్త బాధాకరమే!!!
    మీ మెచ్చుకోళ్లకు ధన్యవాదాలు !!!

    @ యెసెన్కేఆర్
    ధన్యవాదాలు....పరిస్థితిలో మార్పు రావాలని ఆశిద్దాం....

    రిప్లయితొలగించండి
  6. నిజంగా మీ ఈ ధర్మదండం బ్లాగు "సారస్వతామృత భాండమే". ఇప్పటి వరకు మీరు బ్లాగులో ప్రకటించిన పోస్టుల నన్నింటినీ చదివి పులకించి పోయాను. ముఖ్యంగా "కవిత్వం" శీర్షికతో వ్రాసిన ఉత్పలమాలిక నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఆ శారదాదేవి కటాక్షంతో మీ బ్లాగు వర్ధిల్లాలని, పద్య కవితాభిమానులను నిరంతరం అలరించాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  7. మీరేమో వైద్యు డంటే ఇలా ఉండాలని చెప్పారు. మరి మా చిన్నప్పుడేమో అప్పిచ్చు వాడు వైద్యుడు అని చెప్పారు. (క్షమాపణలతో)

    రిప్లయితొలగించండి
  8. @ మిస్సన్న గారు
    : )
    అప్పు = నీళ్లు.....(అప్పు సంస్కృతార్థం నీళ్లే కదా!!! ) ...
    మళ్లీ
    నీళ్లు = జీవనము .......(జీవనము కు నానార్థాలలో నీళ్లు కూడ ఉంది మరి!!! )

    కనుక ఏతా వాతా అప్పు = జీవనము (నైఘంటికమే ! )

    మరి ఆ లెక్కన ' అప్పిచ్చు వాడు ' వైద్యుడు నిజమే కదా!!!!! మహా కవులు వశ్య వాక్కులు !!!!!

    రిప్లయితొలగించండి
  9. డాక్టరు గారూ, అప్పుఎవరిస్తారా అని తెగ మధనపడుతున్న సమయానికి తగవు మాట్లాడారు, మీ ఇల్లెక్కడో చెప్పరూ...:)

    రిప్లయితొలగించండి