ఆనాడెన్నడో విజృంభించిన శూన్యవాద మిథ్యావాదాల ధాటికి , ప్రాచీన సనాతన ధర్మం తాళలేక , చిగురుటాకు వలె వణికిపోతూ , ఆర్ష పథానికి దారీ తెన్నూ కనపడక , నిస్సహాయమైన స్థితిలో , కాలూ చేయీ ఆడక , క్రుంగిపోతూన్న దశలో , యిదిగో నేనున్నానంటూ ఆర్త త్రాణపరాయణుడై , ఆపన్న శరణాగతితో , ధర్మ గ్లాని ని తప్పించడానికి, ముక్తి మార్గ నిర్దేశానికి అవతరించిన సాక్షాత్తూ శంకరుడైన ఆ ఆదిశంకరాచార్యుల చేతిలోని దీక్షాదండమే ' ధర్మదండం ' కాబట్టి !
చక్రవర్తి చేతిలో ప్రకాశిస్తూ యిహ లోకాన్ని శాసించేది ' రాజదండమైతే ' ------ ఈ యతి సార్వభౌముని చేతిలో కొలువుండి ఆధ్యాత్మిక , పారలౌకిక ప్రపంచాన్ని ఒక దిక్సూచివలె నడిపిస్తూ పరిపాలించేది యీ ' ధర్మ దండం ' కాబట్టి !
యమ ధర్మ రాజు చేతిలోని ' మృత్యు దండాన్ని ' కసరికొట్టి , విసిరి వేయగల అమోఘమైన ప్రభావశీలి యీ ' ధర్మదండమే ' కాబట్టి !
సజ్జన మార్గం లో నడిచేవారికి ' వూతకర్ర ' గానూ.....దారితప్పి ప్రవర్తించే దుర్జనుల పాలి ' ముల్లు కర్ర ' గానూ .....యావత్ మానవ జాతికి ఒక ' జీవగర్ర ' గానూ ......దిశానిర్దేశం చేయగలిగే మహామహిమాన్వితమైన మంత్రదండం యీ ' ధర్మదండమే ' కాబట్టి !
మరి భవదీయునకూ , యీ ' ధర్మదండానికీ ' గల సంబంధమేమంటారా? భక్తవశంకరుడైన ఆ మహనీయుని జీవిత చరిత్ర ను పద్యకావ్య రూపంలో ' ధర్మదండం ' పేర వ్రాయగలిగే....వ్రాయబోయే అదృష్టం , ఆ పుణ్యం దక్కడమే ..... ప్రాక్తన పుణ్య లేశ ఫలితమే !
' ధర్మదండం ' ఒక ప్రతీకాత్మకం ..... ' ధర్మదండం ' ఒక గుణాత్మకం ..... ' ధర్మ దండం ' ఒక స్వభావాత్మకం ....అంతే !!!
* మహిత గుణప్రపూతమయి ; మార్మిక ధర్మ ఫల ప్రసాదమై ;
బహుముఖ దీవ్యదార్ష పథ వైభవ సంతత మార్గదర్శియై;
అహిత సమస్త లోక దురితాపనుదమ్మయి , సత్ప్రమాణమై;
సహిత సనాతన ప్రథిత సత్యమునైనది ధర్మ దండమే!!!
( మహా సుగుణములతో విశుద్ధమైనటువంటిదియూ , సూక్ష్మమైన రహస్యమైన ధర్మ ఫలాలను ప్రసాదించునటువంటిదైనదియూ , బహుముఖాలు గా విలసిల్లిన ఆర్ష సంప్రదాయ వైభవోపేతమైన మార్గాన్ని దర్శింపజేయునటువంటిదియూ , దుర్మార్గ లోకపు సమస్త పాపాలనూ దూరముగా పోగొట్టునదియూ , మంచి ప్రమాణాలను నెలకొల్పునదియూ , సనాతన మనే సత్యముతో కూడుకొన్నదియూ యీ ధర్మదండమే !!! )
* పురహరుడే తలంచి , యతి పోలిక నీభువి కేగుదెంచి , శం
కర గురుడై జనించి , యొక కారణ జన్ముడుగా జరించి , ని
ర్భర కరుణన్ వహించి , జిన బౌద్ధములన్ నిరసించి , మించె నా
వర యతి హస్త భూషణ శుభ ప్రతిపన్నము ధర్మదండమే !!!
(ఒకానొక సన్యాసి వోలె భువిపై శంకరాచార్యుడై అవతరించి , కారణ జన్ముడై , నాస్తిక వాదాలను పటాపంచలు చేసి , సనాతన ధర్మ పునః ప్రతిష్ఠ గావించి మించిన ఆ యీశ్వరుని అపరావతారమైన యతి సార్వభౌముని చేతిలో హస్తభూషణమై శుభప్రదమైనది యీ ధర్మదండమే !!! )
* శంకరు ; భక్త సంచయ వశంకరు ; మోహలతా సమూల నా
శంకరు ; జ్ఞానవాఙ్మయ భృశంకరు ; సార్వజనీన దివ్య సౌ
ఖ్యంకరు ; వేద విద్విష భయంకరు ; దీవ్యదమోఘ మోక్ష సా
ధ్యంకరు ; సర్వ పాప విలయంకరు గొల్తు నభీష్ట సిద్ధికై !!!
స్వస్తి !!!