5, సెప్టెంబర్ 2012, బుధవారం

గురుపూజ !


గురుపూజ - సకలోపాధ్యాయ బృందానికి అభివాదములతో - 

వర పాండిత్యము విస్తరిల్లగ మహా వాత్సల్యమేపార , సుం 
దర నానా రుచిరార్థ భావముల విన్నాణంబులింపార , భా
సుర జన్మాంతర పుణ్యసంచయము లచ్చో దాల్మి బొంగార , సు
స్థిర సంకల్పము తోడ నిర్మల వచశ్శ్రీ దీప్తి పొల్పొందగా 
కరుణా పూరము జిమ్ము కన్నుగవతో జ్ఞాన ప్రదాశూక్తితో 
గురుపీఠంబున నిల్చి దీక్షగొని సంకోచంబు బోనాడి ని
బ్బరపుం బల్కుల తోడ శిష్యతతి నిర్వ్యాజానురాగమ్ముతో 
నిరతానందము నొందజేసి ఘన చాంద్రీ పేశల ఖ్యాతి పెం
పరయన్ గాంచి సరస్వతీ చరణ దీవ్యద్పీఠ నిత్యార్చనో 
ద్ధుర భావంబును బూని , వీనులకు విందుం గూర్చు పాఠంబులన్
కరమాహ్లాదకరమ్ముగా బలుకు దీక్షా దక్షతల్ జూచి మె
చ్చిరి సచ్ఛాత్రులు ; పౌర సంచయము రాశీభూత సౌజన్య వై
ఖరి శ్లాఘించెను దద్విశిష్ట కృషి ; సాక్షాచ్ఛారదా మూర్తిగా 
గరముల్మోడ్చి నుతించె ; సంతత కృతజ్ఞత్వమ్ము నిండార మే
లి రథంబొక్కటి దెచ్చి యశ్వతతి నోలిం బ్రక్కకుం ద్రోసి యా
తురగస్థానములందునన్ నిలిచి సద్యో గౌరవ స్ఫూర్తి ని
ర్భరమై వెల్గగ దామె తాల్చిరి రథ ప్రాగ్ర్యమ్ము నీ యాదరం
బరయన్ ఒజ్జకు గాక యింకెవరిన్ బ్రాప్తించు ధాత్రీ స్థలిన్ ?
సిరికై యాసను వీడి చాత్రతతి నాశీః పూర్వకానంద వా
గ్ఝరిలో దన్పుచు సర్వ శాస్త్ర నిచయ శ్లాఘిష్ఠ పాండిత్య త
త్పరుడై శిష్య పరంపరాభ్యుదయ సంధాన ప్రతిజ్ఞాతయై 
పరమానందము తోడ చాత్ర నివహ వ్యక్తిత్వముం దీర్చి పా 
మరునిం బండితు జేయగా గలుగు మర్మంబెన్నగా నొజ్జకే 
ధరపై సొంతము ! తద్గురు ప్రతతిలో ధన్యాత్ముడైనట్టి సం
స్మరణీయున్ గణియింతు నెమ్మనమునన్ సర్వేపలిన్ పండితున్ !!! 

29, ఆగస్టు 2012, బుధవారం

జగద్గురవే నమః !


శ్రీమత్కాంచీ విలస
ద్కామాక్షీ సత్కృపా ప్రకల్పిత మృదు ర
మ్యామోఘ వశ్య వాక్కులు ;
స్వాములు ; శ్రీమజ్జయేంద్ర శారద గొలుతున్ !

గళ మాధురీ శుభంకర వాగ్విశేష ప్ర
         భా పూర్ణ ! హే పరివ్రాట్ ! జయేంద్ర !
దరహాస చంద్రికా స్ఫురదానన వికాస 
         స్వామీ ! విభో ! పరివ్రాట్ ! జయేంద్ర !
స్వచ్ఛ కాషాయాంబ రాచ్ఛాదిత విలాస 
         వర గాత్ర ! హే పరివ్రాట్ ! జయేంద్ర !
ప్రోల్లసద్దండ సముద్భాసిత పవిత్ర 
         పాణి ! ప్రభో ! పరివ్రాట్ ! జయేంద్ర ! 

శ్రీమదద్వైత తత్వ విశిష్ఠ పీఠ 
విలసదత్యంత సత్కృపా కలిత హృదయ 
స్తుతుల ఘటియింతు త్రికరణ శుద్ధిగా య
తీంద్ర ! హే సంయమీంద్ర ! జయేంద్ర స్వామి ! 

అటమట జెంది సంసృతి మహాటవిలో దిరుగాడి , దోష సం
పుటినొకదాని మోసికొని పుట్టకు జెట్టుకు బర్వులెత్తు మ
ర్కటమిది నా మనస్సు , యతిరాట్ ! దయ పావన ధర్మదండమున్ 
దిటవుగ నెత్తి దీని గరుణించి మరల్చవె సత్పథంబునన్ !

పూజింతు సద్భక్తి బూని శ్రీ శంకర 
         స్వామి పావన పాద పద్మ యుగము ;
సేవింతు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వ 
         తీ స్వామి వరసన్నిధిని సతమ్ము ;
ప్రణుతింతు శ్రీ జయేంద్ర స్వామి నిర్మల 
         మహిమ విభూతి సమ్యక్ఫలమ్ము ;
ప్రకటింతును విజయేంద్ర సరస్వతీ స్వామి 
         సంవిన్మహా శక్తి సంతతమ్ము ;

సత్కృప - మదీయ మోహపాశమ్ము ద్రుంచి 
జ్ఞాన మార్గమ్ము జూపింపగా దలంతు 
నిర్మలాంతఃకరణమున నియమమూని
గురుపరంపర నెరనమ్మి మరల మరల !!!


అద్వైతార్ష పథ ప్రబోధక ! యతీంద్రా ! జ్ఞాన సంధాయకా !
సద్వైదుష్య ఫల ప్రసాదక ! గుణజ్ఞా ! పాప విధ్వంసకా !
విద్వద్వైదిక పూజనీయ ! విలసద్వృత్తాంత ! యోగీంద్ర ! జ్ఞా
న ద్వంద్వాంచిత రూప ! సంయమి జయేంద్రా ! పాహిమాం ! పాహిమాం !!!


( ఈ మధ్య కాంచీపురంలో జగద్గురువుల దర్శనభాగ్యం లభించిన సందర్భంలో )

24, జులై 2012, మంగళవారం

నాదబ్రహ్మ!


శాంతము లేనిచో సుఖమసాధ్యము ; శ్రీ రఘురాము సేవయే 
భ్రాంతి దొలంగజేయునని వాకొని సార సరస్వతీ పదో
పాంత నిరంతరార్చన శుభ ప్రతిపాదిత గాన సత్కళా 
క్రాంత విరాడ్స్వరూపమును గాంచిన త్యాగయ సన్నుతించెదన్ !

నిధి మేలా ? శ్రిత భక్త బృంద కరుణా స్నిగ్ధాబ్ధి శ్రీరాము స
న్నిధి మేలా ? యని పారమార్థికము వర్ణింపంగ దీవ్యత్కళా 
నిధియై నాదమయ ప్రపంచమును - వాణీ సత్కృపా లబ్ధ వా
గ్సుధలన్ గొల్చిన త్యాగరాజునకివే స్తుత్యంజలుల్ గూర్చెదన్ !!!  

3, జులై 2012, మంగళవారం

వ్యాస పూర్ణిమ !


వ్యాసుడు , కమ్ర కవిత్వ వి
భాసుడు , శతకోటి సూర్య భాస్వరుడు , శుభా
వాసుడు , సంతత హరిపద 
దాసుడు ప్రత్యక్షమయ్యె దరహాసముతో 

కమనీయ సితవర్ణ కబరీ భరమ్ముతో 
          ధూర్జటి బోలు నస్తోక సుగుణు ;
నిగమాగమోక్తి స్వనించు నెమ్మోముతో 
          జతురాస్యు బోలు సంసార తరణు ;
మాయా నికృంతన మహిత తేజముతో హృ
          షీకేశు బోలు రాజీవ నయను ;
జ్ఞాన వీచీయుత మానసార్ణవముతో 
          దేవర్షి బోలు నాస్తిక్య హరణు ;

విష్ణు సేవా ప్రవణు ; భక్తి విధి విహరణు ;
భాగవత కథాకథన విభ్రాజమాను ;
తత భవలతా నిశిత లవిత్రాయమాను ;
బాదరాయణు తాపసాభరణు గొలుతు !!! 

( త్రిమూర్తులకూ , దేవర్షి యైన నారదునికి - వ్యాసునితో పోలిక గల్పించుట 
"కబరీభరమును" పోల్చాలి కాబట్టి - శివుడు 'ధూర్జటి ' యైనాడు ,  'నెమ్మోము ' ను వర్ణించాలి కాబట్టి బ్రహ్మ 'చతురాస్యుడై ' నాడు , 'మాయా విచ్చేదకమైన ' ఇంద్రియేశ్వరత్వము ఉపమేయము కాబట్టి విష్ణువు 'హృషీకేశు ' డైనాడు . 'నారదుడు ' వ్యాసుడు ' ఇరువురూ ' "జ్ఞాన" వీచీయుత మానసులే నని సామ్యము . ) 

6, మే 2012, ఆదివారం

తిరుపతి వేంకట కవులు !!!


'శ్రవణానందము ' గూర్చు సత్కవన ధారా పూత సాహిత్య మా
 ర్దవ మాంధ్రీ తలమందు పంచిన కవీంద్ర ద్వంద్వ మాహా!కనుం 
 గవకున్ దోచెను , పూర్వ పుణ్యమిది , సాక్షాచ్ఛారదాదేవియే 
 భువిపై నీ యవధాని చంద్రములుగా పొల్పొందె హేలాగతిన్ !  

 ఒక చరణంబతండు మరి యొండు నితండు మహాశుధారతో 
 సకల సభాంగణమ్ము మది సంతసమంద శిరః ప్రకంపన
 ప్రకటిత మోదమై , స్ఫురిత పావన వాఙ్మయ వేదనాదమై
 శుకపిక యుగ్మమొండు విన సొంపుగ పాడిన రీతి బల్కుచో
 చకిత మనస్కులై నృపులు సాగిలి మొక్కరె ? పండితోత్తముల్
 ముకుళిత హస్తులై నిలిచి మోదముతో వినుతింపరే ? కవి
 ప్రకరములేకమై భళి సెబాసని పల్కవె ? చారు పుష్ప మా 
 లికల నలంకరింపవె? చలింపక వీరవధాన రంగమం
 దొక సుకుమార లీల విజయోద్ధతి జూపిన సంతసించి ప్రే
 క్షకులు రసజ్ఞ శేఖరులు సమ్మతి నేనుగు పైన దిప్పరే ?
 సకల జనానురంజన యశః పరికల్పిత వాగ్విలాసులీ 
 సుకవులు , దేశికోత్తములు , సూరివరేణ్యుల నిచ్చ మెచ్చెదన్ !

 తెలుగు సంస్కృత భాషా సుధీ యుతములు  
 మీసములు పెంచినారలు రోసమొప్ప
 బ్రాహ్మ్యమొక వైపు కనగ క్షాత్రమొక వైపు 
 దర్శనమ్మిచ్చు -  వీరల తత్వమిదియె !!! 


 

26, ఏప్రిల్ 2012, గురువారం

వందే లోక శంకరం !!!


కాషాయ వస్త్ర సంకలితోత్తమాంగంబు ;
          తీక్ష్ణ భాను మయూఖ దృక్ప్రశస్తి ;
రుద్రాక్ష మాలా శిరోధి ; దక్షిణ భుజా 
          ధారిత సద్ధర్మ దండ దీప్తి ;
భాష్య కావ్యాన్విత వామ హస్తంబు ; చి
          న్ముద్రాంక దక్షిణామోఘ పాణి ;
వ్యాఘ్రాజినోపరి పద్మాసన స్థితి ;
         సురుచిరాకృతి ; శ్రుతి స్థూల శక్తి ;


సకల విశ్వంభరాధార సంప్రయుక్త 
మహిత సుకృత సంధాన సమ్యగ్యతీశ 
సార్వభౌమ స్వరూపంబు సన్నుతింప 
దమ్మిచూలికి నైన సాధ్యమ్మె జగతి ?! 

23, మార్చి 2012, శుక్రవారం

నందనాఖ్య !


తెలుగు మాట్లాడెడి జిలిబిలి బాలుర
    నొజ్జలు శిక్షింపకున్ననాడు ;
ఇరువురు తెలుగు వారెదురెదురై యాంగ్ల
   మున పల్కరింపుల గొనని నాడు ; 
ఒక తల్లి పిల్లలే వికల మనస్కులై  
    ఒండొరుల్ కలహింపకున్ననాడు ; 
అన్నమ్ము 'రైసు ' గా నా మంచి నీరమ్ము
    ' వాటరు ' గా పిల్వబడని నాడు ;

నాడె నిను మెచ్చుకుందునో నందనాఖ్య !
నాడె నిను సంస్తుతింతునో నందనాఖ్య !
నాడె నిను గూర్చి నయమైన నవ్య పద్య
చందన విలాసమును గూర్తు నందనాఖ్య !!!

నందనము సకల భువి కా
నందమ్మును గూర్చి జన గణంబుల చేతో
మందిరముల సుఖ శాంతుల 
నందమ్ముగ నింపుననుచు నాశంసింతున్ !!! 


 

 

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

తెలుగు నేల - తెలుగు భాష


తెలుగుం జాతి జనించుటే కద మహాదృష్టమ్ము , భావింపగా
దెలుగుం కైతలు వ్రాయగల్గుట శుభాధిక్యమ్ము , తీయందనాల్
జిలుకన్ చిక్కని తేనెలూరు కవితా శ్రీగంధమున్ జిమ్మగా
దెలుగుం గబ్బము గూర్చగల్గుట మహాంధ్రీ వాణి మాహాత్మ్యమే !!! 


త్రైలింగమ్మిది , నిత్య పావనము ; సద్యః పుణ్య సంధాయక
మ్మై లాలిత్య గుణాత్మకమ్మయి తిరమ్మై వెల్గు నీ తెల్గు సీ
మా లావణ్య విభూతి నెన్న దరమే ? మా జన్మ ధన్యంబె , యీ
నేలన్ బుట్టువు నొందు కారణము చింతింపన్ పురా భాగ్యమే !!! 


పాట పాడునట్లు , కోటి వీణలు మ్రోగు
నట్లు , పనస జెప్పునట్లు దోచు -
తెలుగు భాష మాట తీరు తెన్నులు , సదా 
తేజరిల్లవలయు తెలుగు భాష !!!

20, ఫిబ్రవరి 2012, సోమవారం

వందే శివం శంకరం !!!


వందే లోక శుభంకరం భవహరం వాత్సల్య వారాన్నిధిం 
వందే భూతగణాదిసేవిత విభుం వందే భవానీ పతిం 
వందే సచ్చిదనంత రూప కలితం భాస్వజ్జటాజూటినం 
వందే చంద్ర కలాధరం స్మరహరం వందే శివం శంకరం !!!

అనంతం త్వదీయం చిదానందరూపం 
న జానామి శంభోహమజ్ఞాన చిత్తః 
విభో త్వత్కృపా దివ్య వీక్షా ప్రసాదం  
మహేశాహమిఛ్చామి శంభో ! ప్రసీద !!!

అవిద్యాతపాయస్త చిత్తాన్వితోహం 
త్వదీయాద్భుత జ్ఞాన పీయూష వార్ధౌ 
పవిత్రం హితం స్నానభాగ్యం మహేశ 
సదా పాలయాభీష్ట దాతః ప్రసీద !!!

లసచ్చారు  గాత్రం లలాటస్థ నేత్రం
దయాభావనాన్వీత సౌజన్య చిత్తం
మహాజ్ఞానవంతం గురూణాం గురుం త్వాం
నితాంత ప్రసిద్ధం భజేహం భజేహం !!!

భుజంగేంద్ర హారం విభూత్యాప్త దేహం 
శశాంకావతంసేన సందీప్త శీర్షం 
పరం దైవతం మోహ విచ్చేదకం త్వాం
తవామోఘ కీర్తిం స్మరామి స్మరామి !!!

శ్రీమన్మహాదేవ దేవేశ ! లోకేశ ! సద్భక్తమందార ! విశ్వంభరాధార ! నీ లీల వర్ణింప నేనెంతవాడన్ మహాకాల ! దేవాదిదేవా ! భవా !  శంకరా   ! తొల్లి సంకల్పమున్ జేసి యా దేవతల్ రాక్షసుల్ పూని పీయూషమున్ పొందనా వాసుకిన్ త్రాడుగా జేసి యా మంధరన్ గవ్వమున్ జేసి క్షీరాబ్ధి నౌత్సుక్యులై తత్సుధా పాననాభీష్ట సంపూర్తికై బల్మి తోడన్ మధింపంగ దావానల జ్వాలలన్ జిమ్ము హాలాహలమ్మున్ జనింపంగ లోకమ్ము భీతిల్లి నీ రక్ష గోరంగ నా యాపదన్ దీర్చి యా కాలకూటంబు సేవించి విశ్వంబు రక్షించి శ్రీకంఠ నామంబునన్ గీర్తి బొల్పొంది దక్షాధ్వరంబెల్ల విధ్వంసమున్ సల్పి కందర్ప దర్పంబు భస్మంబుగా జేసి యా యర్జునాఢ్యున్ ద్వదీయాద్భుతాస్త్ర ప్రసాదమ్ముతో దన్పి సర్వప్రజానీకమున్ నిచ్చలున్ సౌఖ్యవారాశి దేలించు గంగన్ దలన్ దాల్చి ఫాలానలాక్షిన్ బ్రకాశించి మైబూది దట్టించి కాళంబు కంఠంబునన్ నిల్పి శూలంబు హస్తంబునన్ బూని భక్తావళిన్ బ్రోచు నీ దివ్యరూపంబు త్రైలోక్య దీపంబు దర్శింపగా జాలినన్ దొల్గవే పాపముల్ - తీరవే మోహముల్ - పాయవే విఘ్నముల్ - కల్గవే పుణ్యముల్ - డాయవే క్షేమముల్ - విశ్వేశ నీ భక్త కోటిన్ గటాక్షించి యజ్ఞాన గర్వాంధకారమ్ములన్ ద్రుంచి సంసార కూపంబునన్ గొట్టుమిట్టాడు నీ భక్తులౌ మాదృశీ భూతులన్ గావవే వేదవేదాంత విద్యా స్వరూపా ! ప్రభో ! పాహిమాం లోకనాథా ! విభో విశ్వనాథా నమస్తే నమస్తే నమస్తే నమః !!! 

15, జనవరి 2012, ఆదివారం

భోగి - సంక్రాంతి - కనుము


తెల తెలవారుచుండ  చలి తీవ్రము గాగ సహింపలేక  రే
నెలత తపించి మన్మథుని నెయ్యము బూని కలంత మాని - ము
ద్దుల చెలికాని బాసి మది దోరపు వేదన సైపలేని అ
య్యలికులవేణి బృంద విరహాగ్ని సుఖించెను భోగిమంటలన్ !!! 

( రాత్రి అనే సుందరీమణి తెలతెలవారు జాములో విపరీతమైన చలి తో బాధింపబడి , దుస్సహమైన ఆ చలితీవ్రత భరింపలేక , మన్మథుని ప్రేరేచి , ముద్దుల చెలికాండ్ల నెడబాసి యున్న తరుణీ బృందపు మనసుల్లో విరహాగ్నిని రగిల్చి , ఆ భోగిమంటల్లో చలి కాచుకుని ఆనందించిందట !!!)

హరిదాసు సంకీర్తనాభిమంత్రణములే 
       సంక్రాంతి లక్ష్మికి స్వాగతములు ;
ముంగిట దిద్దిన రంగవల్లియె గదా 
       పౌష్య లక్ష్మికి మేల్మి పాదపీఠి ;
బండ్లపై నిలు జేరు బంగారు పంటలే 
       ధాన్య లక్ష్మికి నివేదన ఫలములు ;
పౌరుషమ్ముల కోడి పందాల చందాలు
      ధైర్య లక్ష్మికి వినోదాల విందు


లదిగొ గంగిరెద్దులు, గొబ్బియలును, రేగు
పళ్లు, చెరకు గడలు, గాలి పటములింక
తీయ గుమ్మడి కాయలు తెలిపె నతులు
శ్రీమహా లక్ష్మికివియె జేజేలటంచు !!! 


( సంక్రాంతి లక్ష్మికి చేతనైన ఉపచారాలను చేయడానికి సంకల్పించినప్పుడు ,

హరిదాసుని సంకీర్తనలనే ఆ మధురమైన పిలుపులే అమ్మవారికి ఆవాహన పూర్వకమైన స్వాగతాలు - ఇంటి ముందు అందంగా దిద్దిన రంగవల్లి అమ్మవారికి అందమైన అపరంజి పాదపీఠమట ! బండ్లపై నింటికి తీసుకుని వచ్చిన బంగారు పంటలే అమ్మవారికి సమర్పించే నైవేద్యం ! పౌరుషాగ్నులు జ్వలించే కోడిపందాలే అమ్మవారికి వినోద ప్రదర్శనమట ! గంగిరెద్దులు , గొబ్బెమ్మలు , రేగుపళ్లు , చెరకు గడలు , గాలిపటాలు , తీయగుమ్మడి కాయలు మొదలైన సంక్రాంతి ప్రత్యేక సంభారాలన్నీ అమ్మవారికి జేజేలు పలుకుతున్నాయా అన్నట్లున్నాయట !!! )నింగి గలట్టి సూర్యు డవనీతల మొక్కెడ దర్పణంబుగా  
బంగరు కాంతులీన గనుపట్టెను దా ప్రతిబింబ రూపియై
రంగుల రంగవల్లుల - తిరంబుగ దివ్య రథంబుపైన గే
హాంగణ సీమలందు కనుమా , కనుమన్ , విలసత్స్వరూపుడై !!! 

( ధరణీ తలమంతా బంగారు కాంతులీనుతూ ఒక స్వచ్చమైన అద్దము వలె మారిపోగా , పైన నింగిలోని సూర్య బింబం , విలసత్స్వరూపుడై , ప్రతిబింబము వోలె - కనుమ నాడు  ప్రతి ఇంటి ముందూ  అందం గా రంగు రంగుల్లో తీర్చిదిద్దబడిన ముగ్గుల్లో కొలువై ఉన్నాడు కనుము !!! కనుము నాడు సూర్యుని రథం ముగ్గు వేయడం ఒక ఆచారం , అదే ఇక్కడ సూచించబడింది !!! )

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో -
     

8, జనవరి 2012, ఆదివారం

వేంకటావధానీ ! నీకు వేల నతులు !!!


దివాకర్ల వేంకటావధాని - జగమెరిగిన బ్రాహ్మణుడు ! శుద్ధ శ్రోత్రియుడు , ఆధునిక కాలంలో ఋషితుల్యుడు ! కవి , పండితుడు , విమర్శకుడు , పరిశోధకుడు , పరిశోధకులకు మార్గదర్శి , అవధాని , ఉపన్యాసకుడు , భువనవిజయేత్యాది రూపక విధివిధాన నిర్ణేత ! అన్నింటికీ మించి సౌమ్యశీలి , మృదు స్వభావి .

అంతటి పండితుడూ , తనకంటే వయస్సులో , విద్వత్తులో , అనుభవంలో అన్ని రకాలుగా చిన్న వారైన వారి పట్ల చూపే ఒకానొక గౌరవపురస్సరాదరాభిమానాలు నిజంగా ఆశ్చర్య జనకాలే  , కొండొకచో నమ్మశక్యం కానివి కూడా అని ఆ అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించిన మా చిన్నాన్న పలుకులు !

వేదం సశాస్త్రీయం గా చిన్నతనం లోనే అభ్యసించి , సనాతనార్ష ధర్మాన్ని అణువణువునా నింపుకుని , బయట ఎక్కడా పచ్చి మంచి నీరూ ముట్టని ఋషితుల్యమైన సాత్విక నిరాడంబర జీవనం వారిది ! తెలుగుభాషా ప్రచారాన్ని భుజాన వేసుకుని ఆంధ్రదేశం నాలుగు చెరగులా వారు పర్యటించే రోజుల్లో , మా నంద్యాలకు వారిని ఆహ్వానించడమూ , అందుకంగీకరిస్తూ వారు మా నాన్నగారికి పంపిన ఉత్తరం లో " నేను కొంచెం శ్రోత్రియుడను , అందులకవసరమైన పద్దతులను సమకూర్చమని మనవి" అంటూ వ్రాయడమూ , తదనుగుణ్యంగా మా ఇంట వారు ఆతిథ్యం స్వీకరించడమూ , మా నాన్నగారు ఇప్పటికీ ఆ ఉత్తరాన్ని అపురూపంగా భావిస్తూ ఆ వాక్యాలను మననం చేసుకుంటూ మురిసిపోవడమూ ప్రత్యక్షానుభవం !

ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే , ఇది కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని వారి శతజయంత్యుత్సవ మహానంద కారక సంవత్సరం కాబట్టీ , వారి శతజయంత్యుత్సవాలు భాగ్యనగరం మొదలుకొని , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోలాహలం గా జరుగుతూన్నాయి కాబట్టీ , అలా నిన్న అనంతపురం లో  జరిగిన ఒకానొక సభలో పాల్గొని - పురస్కారమందుకునే మహాభాగ్యం భవదీయునికి కలిగింది కాబట్టీ , భావస్థిరాని జననాంతర సౌహృదాని !

దివాకర్లవారు జన్మించిందే మూలా నక్షత్రం లో , గురుపూర్ణిమ నాడు , ఆ రెంటి మహత్వాన్ని మరలా వివరించవలసిన పనేముంది ?! తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి స్వయాన అన్నగారి కొడుకైన వారు , ఏకసంథాగ్రాహి , ధారణలో ఆ చిన్నాన్న కు ఏమాత్రం తీసిపోని అపారమైన ప్రజ్ఞాపాటవాలు . నన్నయ్యభట్టారక భారతం మీద పరిశోధనలు సలిపిన వారు , ఆంధ్ర వాజ్మయ చరిత్ర , సాహిత్య సోపానాలు మొదలైన గ్రంథాలనందించి , తెలుగు భాషా సేవ సలిపినవారు .

ఒక్క మాటలో ఆంధ్ర భాషాయోష కొక రమణీయమైన భూష యైన ఆ మహానుభావునికి సాదర సంస్మృత్యంజలులు !!!

" ఆంధ్ర వాజ్మయ చరిత్రామృతమ్మును గూర్చి 
          తెలుగు భాషా సేవ జెలగినావు ;
  సాహిత్య సోపాన సంగ్రథనమ్ముతో 
          సారస్వతార్చన సలిపినావు ;
  నన్నయ్య కావ్యంపు విన్నాణముల పైన 
          పరిశోధనమ్ముల నెరపినావు ;
  భువన విజయ రూపక విధాన సృజనతో 
          పెద్దన్న కవిని జూపించినావు ;


  ఆర్ష ధర్మానుసరణమే ధ్యాస యగుచు 
  శ్రోత్రియుడవై త్రికరణ విశుద్ధ నియత
  వర్తనము జేసినట్టి పుంభావ వాణి !
  వేంకటావధానీ ! నీకు వేల నతులు !!! "