15, జనవరి 2012, ఆదివారం

భోగి - సంక్రాంతి - కనుము


తెల తెలవారుచుండ  చలి తీవ్రము గాగ సహింపలేక  రే
నెలత తపించి మన్మథుని నెయ్యము బూని కలంత మాని - ము
ద్దుల చెలికాని బాసి మది దోరపు వేదన సైపలేని అ
య్యలికులవేణి బృంద విరహాగ్ని సుఖించెను భోగిమంటలన్ !!! 

( రాత్రి అనే సుందరీమణి తెలతెలవారు జాములో విపరీతమైన చలి తో బాధింపబడి , దుస్సహమైన ఆ చలితీవ్రత భరింపలేక , మన్మథుని ప్రేరేచి , ముద్దుల చెలికాండ్ల నెడబాసి యున్న తరుణీ బృందపు మనసుల్లో విరహాగ్నిని రగిల్చి , ఆ భోగిమంటల్లో చలి కాచుకుని ఆనందించిందట !!!)

హరిదాసు సంకీర్తనాభిమంత్రణములే 
       సంక్రాంతి లక్ష్మికి స్వాగతములు ;
ముంగిట దిద్దిన రంగవల్లియె గదా 
       పౌష్య లక్ష్మికి మేల్మి పాదపీఠి ;
బండ్లపై నిలు జేరు బంగారు పంటలే 
       ధాన్య లక్ష్మికి నివేదన ఫలములు ;
పౌరుషమ్ముల కోడి పందాల చందాలు
      ధైర్య లక్ష్మికి వినోదాల విందు


లదిగొ గంగిరెద్దులు, గొబ్బియలును, రేగు
పళ్లు, చెరకు గడలు, గాలి పటములింక
తీయ గుమ్మడి కాయలు తెలిపె నతులు
శ్రీమహా లక్ష్మికివియె జేజేలటంచు !!! 


( సంక్రాంతి లక్ష్మికి చేతనైన ఉపచారాలను చేయడానికి సంకల్పించినప్పుడు ,

హరిదాసుని సంకీర్తనలనే ఆ మధురమైన పిలుపులే అమ్మవారికి ఆవాహన పూర్వకమైన స్వాగతాలు - ఇంటి ముందు అందంగా దిద్దిన రంగవల్లి అమ్మవారికి అందమైన అపరంజి పాదపీఠమట ! బండ్లపై నింటికి తీసుకుని వచ్చిన బంగారు పంటలే అమ్మవారికి సమర్పించే నైవేద్యం ! పౌరుషాగ్నులు జ్వలించే కోడిపందాలే అమ్మవారికి వినోద ప్రదర్శనమట ! గంగిరెద్దులు , గొబ్బెమ్మలు , రేగుపళ్లు , చెరకు గడలు , గాలిపటాలు , తీయగుమ్మడి కాయలు మొదలైన సంక్రాంతి ప్రత్యేక సంభారాలన్నీ అమ్మవారికి జేజేలు పలుకుతున్నాయా అన్నట్లున్నాయట !!! )



నింగి గలట్టి సూర్యు డవనీతల మొక్కెడ దర్పణంబుగా  
బంగరు కాంతులీన గనుపట్టెను దా ప్రతిబింబ రూపియై
రంగుల రంగవల్లుల - తిరంబుగ దివ్య రథంబుపైన గే
హాంగణ సీమలందు కనుమా , కనుమన్ , విలసత్స్వరూపుడై !!! 

( ధరణీ తలమంతా బంగారు కాంతులీనుతూ ఒక స్వచ్చమైన అద్దము వలె మారిపోగా , పైన నింగిలోని సూర్య బింబం , విలసత్స్వరూపుడై , ప్రతిబింబము వోలె - కనుమ నాడు  ప్రతి ఇంటి ముందూ  అందం గా రంగు రంగుల్లో తీర్చిదిద్దబడిన ముగ్గుల్లో కొలువై ఉన్నాడు కనుము !!! కనుము నాడు సూర్యుని రథం ముగ్గు వేయడం ఒక ఆచారం , అదే ఇక్కడ సూచించబడింది !!! )

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో -
     

2 కామెంట్‌లు: