8, జనవరి 2012, ఆదివారం

వేంకటావధానీ ! నీకు వేల నతులు !!!


దివాకర్ల వేంకటావధాని - జగమెరిగిన బ్రాహ్మణుడు ! శుద్ధ శ్రోత్రియుడు , ఆధునిక కాలంలో ఋషితుల్యుడు ! కవి , పండితుడు , విమర్శకుడు , పరిశోధకుడు , పరిశోధకులకు మార్గదర్శి , అవధాని , ఉపన్యాసకుడు , భువనవిజయేత్యాది రూపక విధివిధాన నిర్ణేత ! అన్నింటికీ మించి సౌమ్యశీలి , మృదు స్వభావి .

అంతటి పండితుడూ , తనకంటే వయస్సులో , విద్వత్తులో , అనుభవంలో అన్ని రకాలుగా చిన్న వారైన వారి పట్ల చూపే ఒకానొక గౌరవపురస్సరాదరాభిమానాలు నిజంగా ఆశ్చర్య జనకాలే  , కొండొకచో నమ్మశక్యం కానివి కూడా అని ఆ అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించిన మా చిన్నాన్న పలుకులు !

వేదం సశాస్త్రీయం గా చిన్నతనం లోనే అభ్యసించి , సనాతనార్ష ధర్మాన్ని అణువణువునా నింపుకుని , బయట ఎక్కడా పచ్చి మంచి నీరూ ముట్టని ఋషితుల్యమైన సాత్విక నిరాడంబర జీవనం వారిది ! తెలుగుభాషా ప్రచారాన్ని భుజాన వేసుకుని ఆంధ్రదేశం నాలుగు చెరగులా వారు పర్యటించే రోజుల్లో , మా నంద్యాలకు వారిని ఆహ్వానించడమూ , అందుకంగీకరిస్తూ వారు మా నాన్నగారికి పంపిన ఉత్తరం లో " నేను కొంచెం శ్రోత్రియుడను , అందులకవసరమైన పద్దతులను సమకూర్చమని మనవి" అంటూ వ్రాయడమూ , తదనుగుణ్యంగా మా ఇంట వారు ఆతిథ్యం స్వీకరించడమూ , మా నాన్నగారు ఇప్పటికీ ఆ ఉత్తరాన్ని అపురూపంగా భావిస్తూ ఆ వాక్యాలను మననం చేసుకుంటూ మురిసిపోవడమూ ప్రత్యక్షానుభవం !

ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే , ఇది కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని వారి శతజయంత్యుత్సవ మహానంద కారక సంవత్సరం కాబట్టీ , వారి శతజయంత్యుత్సవాలు భాగ్యనగరం మొదలుకొని , రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోలాహలం గా జరుగుతూన్నాయి కాబట్టీ , అలా నిన్న అనంతపురం లో  జరిగిన ఒకానొక సభలో పాల్గొని - పురస్కారమందుకునే మహాభాగ్యం భవదీయునికి కలిగింది కాబట్టీ , భావస్థిరాని జననాంతర సౌహృదాని !

దివాకర్లవారు జన్మించిందే మూలా నక్షత్రం లో , గురుపూర్ణిమ నాడు , ఆ రెంటి మహత్వాన్ని మరలా వివరించవలసిన పనేముంది ?! తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారికి స్వయాన అన్నగారి కొడుకైన వారు , ఏకసంథాగ్రాహి , ధారణలో ఆ చిన్నాన్న కు ఏమాత్రం తీసిపోని అపారమైన ప్రజ్ఞాపాటవాలు . నన్నయ్యభట్టారక భారతం మీద పరిశోధనలు సలిపిన వారు , ఆంధ్ర వాజ్మయ చరిత్ర , సాహిత్య సోపానాలు మొదలైన గ్రంథాలనందించి , తెలుగు భాషా సేవ సలిపినవారు .

ఒక్క మాటలో ఆంధ్ర భాషాయోష కొక రమణీయమైన భూష యైన ఆ మహానుభావునికి సాదర సంస్మృత్యంజలులు !!!

" ఆంధ్ర వాజ్మయ చరిత్రామృతమ్మును గూర్చి 
          తెలుగు భాషా సేవ జెలగినావు ;
  సాహిత్య సోపాన సంగ్రథనమ్ముతో 
          సారస్వతార్చన సలిపినావు ;
  నన్నయ్య కావ్యంపు విన్నాణముల పైన 
          పరిశోధనమ్ముల నెరపినావు ;
  భువన విజయ రూపక విధాన సృజనతో 
          పెద్దన్న కవిని జూపించినావు ;


  ఆర్ష ధర్మానుసరణమే ధ్యాస యగుచు 
  శ్రోత్రియుడవై త్రికరణ విశుద్ధ నియత
  వర్తనము జేసినట్టి పుంభావ వాణి !
  వేంకటావధానీ ! నీకు వేల నతులు !!! "

6 కామెంట్‌లు:

  1. తెనుగను భాషకు ముద్దుల
    తనయులు, పావన చరితులు, తరియించిరయా!
    ఘనమగు కీర్తుల దెచ్చిరి
    మనదగు నీ భాషకిట్లు, మాన్యులు వారై.

    మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండి. వారిని తలచుకొనటం మన ధర్మము.

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారికి ధన్యవాదాలు ! మహానుభావుల సంస్మరణంతోనే పాపాలు నశించి పుణ్యం సమకూరుతుందంటారు , అలాంటి మహానుభావుల కోవకు చెందిన దివాకర్లవారి సంస్మరణంతో మనం ధన్యత చెందుతామనడంలో ఎలాంటి సంశయమూ లేదు !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విష్ణు నందన్ గారూ! దివాకర్ల వారిని స్మరిమ్పజేసి మమ్మల్నీ తరిమ్పజేశారు.
      ధన్యవాదాలండీ.

      తొలగించండి
    2. మిస్సన్న మహోదయులకు ధన్యవాదాలు !

      తొలగించండి
  3. శ్రీ దివాకర్ల వెంకటావధాని గారికి నా నమస్సులు. పుణ్య పురుషుల స్మరణ శుభప్రదము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గన్నవరపు నరసింహ మూర్తి గారూ , సత్యం !!! జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం !!! కృతజ్ఞతలు !!!

      తొలగించండి