22, జులై 2013, సోమవారం

గురు స్తుతి !

ఎవఁడు ప్రణవ స్వరూపుఁడై భువన భవన
సృష్టి సంస్థితి లయ కార్య శీలి యగునొ
యతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత !

ఆది మధ్యాంత రహితుడై వ్యాప్తిఁ జెంది
పంచ భూతాత్ముడై కాచుఁ బ్రకృతి నెవ్వఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత ! 

ఎవడు వాచామగోచరుండెవఁడు నిఖిల
తత్త్వ విజ్ఞాన సార నిధాన చిత్తుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత ! 

నిర్గుణుండు నిరాకార నిర్వికల్ప 
నియమి యెవ్వఁడు నిగమాంత నిత్య పూజ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత !  

చిన్మయానందుఁడెవఁడు విశేష బుద్ధి
కుశలుడెవ్వఁడు శ్రీ జగద్గురువరేణ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత !  

15, మే 2013, బుధవారం

ఆది శంకరాచార్యులు


ముప్పది రెండేడుల యతి
యిప్పుడమిని నేకధాటి నెటుల దిరిగెనో ?
యెప్పుడెటుల బుధజనులను
మెప్పించెనొ ? యెరుగ సాధ్యమే యితరులకున్ ?

శైశవమ్ముననె భాషాప్రౌఢి జూపించి
ప్రాజ్ఞుల నబ్బుర పరచినాడు ;
ఒక పేదరాలి యార్తికి గుంది బంగారు
తిష్య ఫలమ్ములందించినాడు ; 
తల్లి కష్టములకు దలడిల్లి పూర్ణా ఝ 
రిని నింటి ముందు పారించినాడు ;
పోటెత్తు నర్మదా పూర్ణ ప్రవాహమ్ము
నే యొక్క కడవ బంధించినాడు ;

ఏన్గు నద్దములోన జూపించు రీతి 
నిగమ సారమ్ము దేటగా నిఖిల జగతి 
తెలిసికొనునట్లు భాష్యమ్ము నిలిపినాడు 
కువలయమున ధర్మము బాదు కొలిపినాడు ! 

కవితల్లజుండయి కమనీయ రమణీయ
సత్కావ్యముల బెక్కు సంతరించె ;
బండిత ప్రవరుడై భాషా మహా ప్రౌఢి 
ద్రెళ్లు గ్రంథముల బరిష్కరించె ;
భక్తవరేణ్యుడై పలు దేవతా స్తోత్ర 
సంచయమ్ముల బేర్మి సంఘటించె ;
నుపదేష్ట యగుచు గీతోపనిషత్సూత్ర 
సార భాష్యమ్మును సంసృజించె ;

మనుజ జన్మమ్ము నందు సామాన్యుడొకడు 
వేయి వేయేండ్లకైనను జేయలేని 
పనుల ముప్పది రెండేండ్ల ప్రాయమందె 
లీల సాధించి గురు పీఠి నేలగల్గె !

కలి చెలరేగ లోకమున గాసట బీసటయై కృశించు ని
ర్మల నిగమాంత వాక్యముల గ్రమ్మర నిల్పి సమస్త పాప పం 
కిలముల రూపుమాప గల  కేవల శుద్ధ సనాతనార్ష వి
ద్యల సమకూర్చె శంకరుడు తాత్వికపాళికి నొజ్జబంతియై 

( ధర్మదండం - అవతార సమాప్తి ఘట్టం నుండి )

29, ఏప్రిల్ 2013, సోమవారం

గంగా స్తవం


కరముల్ మోడిచి సంస్తుతింతు మహితౌఘ ధ్వంసినీ ! పావనీ !
పరితశ్చంచల దూర్మికా ప్రచుర శోభా పూర్ణవై వైళమే 
ధరణిన్ జేరగ రావె మా జనని ! యౌదార్యమ్ము దీపింప శాం
కర జూటస్థలి వీడి రావె త్రిజగత్కళ్యాణి ! గంగాధునీ !


స్థిర దీక్షామతి నిన్ను గొల్తు పద మంజీర ధ్వని శ్రేణి పెం
పరయన్ ప్రోద్యదభంగ చారు లహరీ వ్యాలోలవై సత్కృపా 
పరిపూర్ణత్వము జూపి యీ భువికి నంబా రావె ! జాగేల ? శాం
కర జూటస్థలి వీడి రావె త్రిజగత్కళ్యాణి ! గంగాధునీ ! 


సరణిన్ నిన్ మది దల్తు ; నీ మహిమలన్ శ్లాఘింతు ; నీకున్ నమ
స్కరణమ్ముల్ రచియింతు ; భక్తి మెయి నీ గాథల్ సదా పాడుదున్ ;
మొరలాలింపవె ! ప్రేమ జూపవె ! కృపాపూర్తిన్ విరాజిల్లి శాం 
కర జూటస్థలి వీడి రావె త్రిజగత్కళ్యాణి ! గంగాధునీ ! 


సరి ! మాయమ్మ ! పరాఙ్ముఖత్వమికపై చాలింపవే ! ప్రేమతో 
గరుణా భావముతో ధరాస్థలికి వీకన్ జేరరావే భవ 
చ్చరణాబ్జాశ్రితులన్ గృపన్ దనుపవే ! సారాధ్వగా ! వేగ శాం 
కర జూటస్థలి వీడి రావె త్రిజగత్కళ్యాణి ! గంగాధునీ ! 


హరువై ఘూర్ణిత మీన కచ్ఛప సమూహ ప్రాకటమ్మై ధరా 
ధరముల్ గుట్టలు దాటి శీఘ్రముగ మైదానమ్ములం బారి చె
చ్చెర రావే దివిషత్తరంగిణి ! సదా సేవింతు నో తల్లి ! శాం 
కర జూటస్థలి వీడి రావె త్రిజగత్కళ్యాణి ! గంగాధునీ !    

(ధర్మదండం నుండి)
  

11, ఏప్రిల్ 2013, గురువారం

ఓ యుగాది !


రమ్ము మహాశయా విజయ ! రమ్ము ఫలించెను జూడుమా రసా
లమ్ము ; పికమ్ములొక్కెడ గళమ్ములనెత్తి కుహూ కుహూ స్వరా
లిమ్ముగ గూయుచుండినవి ; యించుక జేరగ రమ్ము మా కుటీ
రమ్మిక మల్లె పువ్వుల సరమ్ముల గంధి నలంకరించెదన్ ---- రమ్ము మహాశయా విజయ రమ్ము  !

నందన వత్సరమ్మొకటి నశ్వరమై గతియించినంత మా 
ముందుకు వచ్చి నిల్చితివి మోదముతో విజయా ! కృపా సుధా 
బిందువులొల్క నీ భువిని బ్రీతిగ బ్రోచెదొ ? కాలకూటమున్  
జిందుచు కాటు వైచెదవొ నిర్ఘృణ భీకర దందశూకమై ?

పాలక వర్గమ్ము బంధు ప్రీతిని వీడి 
        సేవా నిరతి తోడ జెలగవలయు ;
నధికారి సంచయ మ్మలసత్వమును దక్కి 
        నీతికి నెలవుగా నిలువవలయు ;
వర్తకవ్రజము వ్యాపాదమ్ము విడనాడి 
        న్యాయ మార్గంబున నడువవలయు  ;
దేశ జనాళి విద్వేషమ్ము బోనాడి 
        స్థిర విజయమ్ము సాధింపవలయు ;

నపుడె నీ పేరు నిలుచు నీ యవని పయిన  
నపుడె వెలుగొందు నీ విజయధ్వజమ్ము !
ఫలితమేముండు పది పైన పదునొకండు 
వోలె నరుదెంచి యేగిన నో యుగాది ! 

10, మార్చి 2013, ఆదివారం

శివ స్వరూపం


అవతంసీకృత చంద్రరేఖ రుచిరంబై కాంతులీనంగ శై
ల వధూరత్నము దేహమందు సగమై లావణ్యముం జూప శాం
భవ జూటాగ్ర నటత్తరంగిణి హొయల్ వైవశ్యమున్ గొల్ప బ్రా
భవమొప్పారెడు ఫాలనేత్రునెడదన్ బ్రార్థింతు నశ్రాంతమున్ !!! 

సిగబంతిగా చేయబడిన బాల చంద్ర రేఖ తలపై మేలివన్నెలు కురిపించుచుండగా , తన శరీరంలో సగ భాగమైన శైలరాజ కన్య అయిన పార్వతి లావణ్యమును చూపుచుండగా , శంభుని ఆ శీర్షముపై జటాజూటమునందు సుడులు తిరుగు గంగా నది హొయలు మైమరపు కల్గించుచుండగా , తన వైభవము జాటు ఆ ఫాలనేత్రుడైన పరమ శివుని ఎల్లప్పుడు ప్రార్థించెదను .  

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నిగ్రహవాదం !

చిత్రమ్మే యిది యుగ్రవాదమను పేచీకోరు పంతంబుతో
మిత్రత్వమ్మును శాంత్యహింసలను తామే బుగ్గి పాల్జేసి ది
ఙ్మాత్రంబైనను జంకు లేక యిదె ధర్మంబంచు మూఢాత్ములై
సూత్రాల్ వల్కెడి నీచ మానవులు దుష్టుల్ నాశమొందన్వలెన్ !


కోరి యమాయక ప్రజల కొంపల గోడుల గూల్చి పేల్చి హిం
సా రణ నీతి దాల్చి మనసా వచసా గరళమ్ము జిమ్మి హుం
కారము సేయు త్రాచుల వికార పిశాచుల బట్టి శీఘ్రమే
కోరల బీకి వేయవలె ; గూర్మిని బెంచవలెన్ ధరిత్రిలో !


బుద్ధదేవుడు సదా బోధించె బ్రేమతో
              శాంతి గరుణ నహింసా ప్రవృత్తి ;
నొక చెంప గొట్టుచో నొక చెంప జూపగా
              దగునని క్రీస్తు సత్యమ్ము నుడివె ;
సత్యాగ్రహమ్ముతో సాధింపవచ్చు గో
              ర్కెలనని బాపూజి ప్రీతి బల్కె ;
చీదరించుట కన్న నాదరించుట మిన్న
              యమ్మ తేరీసా హితమ్ము జెప్పె ;

పరమ హంస పుట్టిన నేల  బరమ హింస
కెటుల జేతులల్లాడె నోయీ నిహీన !
మానవుడె మాధవుండను మాట దలచి
కూర్మి జరియించుమికనైన ధార్మికముగ !


మంచి బెంచిన మంచిని బంచిపెట్టు
జెడును బోషించుచో నీకె చెడుపు జేయు ;
మానవత్వమ్ము మించిన మతము లేదు
మమత యేనాటికైనను మాసిపోదు !!!

21, ఫిబ్రవరి 2013, గురువారం

తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !


పలకపై నక్షరాభ్యాసమ్ము జేయించె
          నయమార మనకు నన్నయ్య సుకవి ;
తెలుగులో గల మేటి పలుకుబడుల సౌరు
          జూపించె తిక్కన్న సోమయాజి ;
శబ్దగతికి భావ శబలత గుదిగుచ్చి 
          వివరించె మన యెఱ్ఱ ప్రెగ్గడ కవి ;
పలికిన పదమెల్ల భాగవతము సేసి
          పులకించుటను నేర్పె పోతరాజు ;

ప్రౌఢ పదగుంఫనమ్మున బరిఢవిల్లు
నైగనిగ్యము జాటె శ్రీనాథ సూరి ;
సకల కావ్య ప్రబంధ లక్షణములెల్ల  
దెల్పినారు కదా యష్ట దిగ్గజములు ! గున్నమామిడి చెట్టు కొమ్మపై కోయిల 
             పంచమ స్వరమును పాడినట్లు ;
హోమగుండము ముందు హోత సస్వరముగా
             వేదమంత్రమ్ము జపించినట్లు ;
శారద రాత్రుల సారాభ్రమున మిన్కు  
             మినుకని తారలు మెరిసినట్లు ;
చెలగి వేగమ్ముగా జీవనదీ ప్రవా 
             హము ముందు ముందునకరిగినట్లు ;

తెలుగు గీతమ్ము నిత్యమై నిలుచుగాక 
తెలుగు పద్యమ్ము నిక్కమై పొలుచుగాక
తెలుగు పలుకులు స్థిరములై చెలగుగాక
తెలుగు వ్యవహార మనఘమై వెలయుగాక !  
(సీసము లోని మొదటి నాలుగు పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఎత్తుగీతి లోని ఒక్కొక్క పాదముతో అన్వయము )
 

నింగిలో సూర్యచంద్రులు నెగడు దనుక 
నవని పై జలనిధులింక నంత దనుక  
జాతి మున్ముందునకు బేర్మి సాగు దనుక
తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !

జయమహో తెల్గు తల్లీ !!!