22, జులై 2013, సోమవారం

గురు స్తుతి !

ఎవఁడు ప్రణవ స్వరూపుఁడై భువన భవన
సృష్టి సంస్థితి లయ కార్య శీలి యగునొ
యతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత !

ఆది మధ్యాంత రహితుడై వ్యాప్తిఁ జెంది
పంచ భూతాత్ముడై కాచుఁ బ్రకృతి నెవ్వఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత ! 

ఎవడు వాచామగోచరుండెవఁడు నిఖిల
తత్త్వ విజ్ఞాన సార నిధాన చిత్తుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత ! 

నిర్గుణుండు నిరాకార నిర్వికల్ప 
నియమి యెవ్వఁడు నిగమాంత నిత్య పూజ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత !  

చిన్మయానందుఁడెవఁడు విశేష బుద్ధి
కుశలుడెవ్వఁడు శ్రీ జగద్గురువరేణ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు నను దరిఁ జేర్చు గాత !  

4 కామెంట్‌లు:

  1. డా. విష్ణు నందన్ గారూ,
    అద్భుతంగా ఉన్న ఈ గురుస్తుతిని మీరు మీ బ్లాగులో ప్రకటించిన విషయం తెలియక, (కేవలం వ్యాఖ్యగా చూడలేక) మీ అనుమతి లేకుండా నా బ్లాగులో పోస్ట్ చేసాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  2. అయ్యో ఎంత మాట శంకరయ్య గారూ , మీ వంటి కవి పండితుల మెప్పు పొందగలగడం మా బోంట్ల అదృష్టము !మీ సుహృదభినందనలకు శతథా ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి