12, జూన్ 2017, సోమవారం

కర్నూలు వైభవం


ఒకానొక సందర్భంలో కర్నూలు జిల్లా పద్య కవుల సమావేశం కోసం తీర్చిన పద్యాలు.



శ్రీగిరి మల్లన్న యాగంటి బసవన్న

**** ఓబుల నరసన్న లోముచుండ;

నవనందులొక చోట నయమారఁగా నిల్చి 

**** వరకృపఁ జూపి కాపాడుచుండ;

విజయనగర రీతి బీజపూర్ విఖ్యాతి 

**** పెనగొన్న సంస్కృతులెనయుచుండ;

కళలకు నిలయమై కవుల పుట్టిల్లునై 

**** స్థిరమైన కీర్తి సాధించుచుండ;

రాజకీయ రంగమ్మున రాణకెక్కె
సాంస్కృతిక రంగమందుఁ బ్రశస్తిఁ గాంచె 
మురిపముగ తెల్గు తల్లికి ముద్దు బిడ్డ
మేలు గుణములఁ గ్రాలు కర్నూలు గడ్డ.


సూరన్న సుకవి యెచ్చోట జన్మించెను?

**** పోతులూరయ్య తాఁ బుట్టె నెచట?

ఉయ్యాలవాడ ధీరోదాత్తుఁడెటఁ బుట్టె?

**** వెంగళ రెడ్డి తా వెలసెనెచట? 

ఆదోని లక్షమ్మ యవతరించినదేడ?

**** గాడిచెర్ల ఘనుఁడెక్కడ జనించె?

పెరుగు శివారెడ్డి యరయ నెచ్చటఁ బుట్టె?

**** చండ్ర పుల్లారెడ్డి జననమెచట?

బహుముఖీన విరాజిత ప్రజ్ఞఁ గల్గి 
యంచితమ్మగు యశము నార్జించెనౌర!
మురిపముగ తెల్గు తల్లికి ముద్దు బిడ్డ
మేలు గుణములఁ గ్రాలు కర్నూలు గడ్డ.