6, మే 2012, ఆదివారం

తిరుపతి వేంకట కవులు !!!


'శ్రవణానందము ' గూర్చు సత్కవన ధారా పూత సాహిత్య మా
 ర్దవ మాంధ్రీ తలమందు పంచిన కవీంద్ర ద్వంద్వ మాహా!కనుం 
 గవకున్ దోచెను , పూర్వ పుణ్యమిది , సాక్షాచ్ఛారదాదేవియే 
 భువిపై నీ యవధాని చంద్రములుగా పొల్పొందె హేలాగతిన్ !  

 ఒక చరణంబతండు మరి యొండు నితండు మహాశుధారతో 
 సకల సభాంగణమ్ము మది సంతసమంద శిరః ప్రకంపన
 ప్రకటిత మోదమై , స్ఫురిత పావన వాఙ్మయ వేదనాదమై
 శుకపిక యుగ్మమొండు విన సొంపుగ పాడిన రీతి బల్కుచో
 చకిత మనస్కులై నృపులు సాగిలి మొక్కరె ? పండితోత్తముల్
 ముకుళిత హస్తులై నిలిచి మోదముతో వినుతింపరే ? కవి
 ప్రకరములేకమై భళి సెబాసని పల్కవె ? చారు పుష్ప మా 
 లికల నలంకరింపవె? చలింపక వీరవధాన రంగమం
 దొక సుకుమార లీల విజయోద్ధతి జూపిన సంతసించి ప్రే
 క్షకులు రసజ్ఞ శేఖరులు సమ్మతి నేనుగు పైన దిప్పరే ?
 సకల జనానురంజన యశః పరికల్పిత వాగ్విలాసులీ 
 సుకవులు , దేశికోత్తములు , సూరివరేణ్యుల నిచ్చ మెచ్చెదన్ !

 తెలుగు సంస్కృత భాషా సుధీ యుతములు  
 మీసములు పెంచినారలు రోసమొప్ప
 బ్రాహ్మ్యమొక వైపు కనగ క్షాత్రమొక వైపు 
 దర్శనమ్మిచ్చు -  వీరల తత్వమిదియె !!! 


 

9 కామెంట్‌లు:

  1. 'శ్రవణానందము ' గూర్చు సత్కవన ధారతో తిరుపతి వేంకట కవుల తత్వమును చక్కగా చెప్పినారు.

    రిప్లయితొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారూ ! బహుధా కృతజ్ఞతలు !!!

    రిప్లయితొలగించండి
  3. చక్కని పద్యాలు. అవును వారు అపర శారదాస్వరూపులే మరి. వారికీ, మీకూ నమస్సుమాంజలులు.

    రిప్లయితొలగించండి
  4. మాన్యశ్రీ డా. విష్ణు నందన్ గారికి
    నమస్సులతో,

    ఆర్షసంస్కృతిని అక్షరాక్షరం సాక్షాత్కరింపజేస్తున్న భావము, పవిత్రమైన అంతఃకరణశుద్ధి ఉట్టిపడుతున్న భాష మీ రచనకు సహృన్మోహకమైన శక్తిని, సంస్కారాన్ని, ఆత్మీయతను, ఆర్జవాన్ని సమకూర్చిపెట్టాయి.

    మీ సాహితీసృజనకు జేజేలు పలుకుతూ, మీ అన్యతమ(ముద్రిత)గ్రంథావళిని గుఱించి కూడా తెలుసుకోవాలని మక్కువపడుతున్నాను!

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  5. శ్రీయుత ఏల్చూరి మురళీధరరావు గారికి , సాదర నమస్కారశ్శతం. శంకరాభరణం లో మీ సంస్కృతాంధ్ర భాషా విశేష శేముషీ వైభవాన్ని , మీ విద్యావివేక సంపత్తినీ చూసి చాలా సంతోషించినాను . మీ పదకోశం విస్తృతమైనది , అభినందనలు . పద్యాలను మెచ్చుకున్న మీ పెద్దమనసుకు ధన్యవాదాలు . నా ముద్రిత రచన ఒక్కటే - ధర్మదండం పేరిట ' శంకరాచార్య జీవిత చిత్రణం' . మరొక్క పర్యాయం కృతజ్ఞతలతో - విష్ణునందన్.

    రిప్లయితొలగించండి
  6. డా.విష్ణునందన్గారూ, మీ 'శంకరాచార్య జీవిత చిత్రణం" మాకు యెలా లభిస్తుంది? మేము డల్లాస్, టెక్సాస్ లో ఉంటాము. PDF format లో ఉంటే దయచేసి ఈమెయిలు ద్వారా పంపగలరా? నా ఈమెయిలు lanpad@gmail.com.
    ధన్యవాదాలతో,
    చంద్రశేఖర్ (మనతెలుగు)

    రిప్లయితొలగించండి
  7. వారి మీసాల ప్రస్తావన మీది పద్యం బాగుంది. "ఇదం బ్రాహ్మమిదం క్షాత్రం" అన్నట్లుగా వారు "శాపాదపి శరాదపి" కి కూడా సమర్దులే కదా!

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ (మన తెలుగు ) గారు , చాలా సంతోషం, ధన్యవాదాలు . ఇంతదాకా స్ఫురించని ఒక మంచి ఆలోచననిచ్చినారు . పీడీఎఫ్ రూపంలో ఈ కావ్యాన్నుంచే ప్రయత్నం ప్రారంభిస్తాను. కృతజ్ఞతలు !!!

    రిప్లయితొలగించండి