14, డిసెంబర్ 2010, మంగళవారం

"కవిత్వం"

మల్లెలు పూచు భంగి ; పవమానుడు చల్లగ వీచు భంగి ;రే

పల్లెను గొల్ల పిల్లడలవాటుగ వేణువు నూదు భంగి; వి

ద్యుల్లత తళ్కుమంచు దివి తోచిన భంగి; వధూవరుల్ సదా

యుల్లములుల్లసిల్లు మధురోక్తుల నాడెడు భంగి; వర్షపున్

జల్లులు రాలగా నెమలి సమ్మతి నృత్యము సేయు భంగి; పూ

విల్లు ధరించి మన్మథుడు వేమరు తూపుల వేయు భంగి ; రం

జిల్లి ముదమ్మునన్ శిశువు చెల్వుగ నవ్విన భంగి ; నిండు జా

బిల్లి సుధాప్రసారమన వెన్నెల వన్నెలనీను భంగి ; మేల్

పల్లకి నెక్కి రాసుత విలాస విహారము సల్పు భంగి ; సం

పల్లలితాంగి సత్కరుణ భాగ్యములిచ్చిన భంగి ; కచ్ఛపీ

వల్లకిపై సరాగముల భారతి మీటిన భంగి; కోవెలన్

ఘల్లున నుల్లముల్ తనియ గంటలు మ్రోగెడు భంగి ; కోయిలల్

పల్లవముల్ భుజించి గరువమ్మున నిమ్ముగ కూయు భంగి ; సం

ఫుల్ల సరోజముల్ సరసి మోహన రీతిని బొల్చు భంగి ; మేల్

చల్లని చందనమ్మలది స్వామికి తాపము బాపు భంగి ; ధీ

తల్లజు డాశు రీతి కవితా రస ధారల జిమ్ము భంగి ; మే

నెల్ల శ్రమంబు మాని పులకింపగ నింపుగ సొంపు మీరగా

పల్లె పడంతి శ్రావ్యముగ పాడెడు జానపదమ్ము భంగి ; వ

ర్తిల్లవలెన్ కవిత్వము ; మరిన్ ప్రజ నాలుకలందు నిల్చి వ

ర్థిల్లవలెన్ కవీంద్రు డతిరిక్త యశస్సముదీర్ణ సాంద్రుడై!!!

6 కామెంట్‌లు:

  1. మీ ఉత్పలమాలిక బహు పసందుగా ఉంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. ఆ ! ఇది!! ఇదీ కవిత్వ మంటె !!! చాలా బాగుంది !!!!

    రిప్లయితొలగించండి
  3. ఫణి ప్రసన్న కుమార్ గారికి
    మంద పీతాంబర్ గారికి

    మీ సహృదయ వ్యాఖ్యానాలకు ధన్యవాదాలు!!!!

    రిప్లయితొలగించండి
  4. డా. విష్ణునందన్ గారూ,
    అపూర్వం మీ పద్య రచనా భంగి
    అద్భుతంగా వస్తోంది మీ కవిత్వం ఉప్పొంగి
    మీ ప్రతిభ కి పెడ్తున్నాను సలాములు వంగి వంగి

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  5. పెద్దన్న గారు పదేపదే గుర్తుకు వస్తున్నారు.

    రిప్లయితొలగించండి