2, జనవరి 2011, ఆదివారం

ఆంధ్ర కవి ప్రశంసా మాలిక

* మును తానాంధ్ర కవిత్వ భూజమున కామోదమ్ముతో ప్రేమతో
  ననురాగమ్మొనరన్ జలంబులిడి యాప్యాయమ్ముగా పాదు తీ
  సిన ధీశాలిని నన్నపార్యుని కవిశ్రేష్ఠున్ మదిన్ గొల్చి ; తి
  క్కన సమ్యక్కృత పద్యశిల్ప ఘన యజ్ఞ శ్లాఘ్య నిర్వాహకున్
  వినయంబొప్పగ సంస్తుతించి ; విబుధున్ , విస్తార విఖ్యాతు నె
  ఱ్ఱన సత్కావ్య మహాప్రబంధ రచనా ప్రాగ్రేసరున్ దల్చి ; పో
  తన మందార మరందు బిందు సమ పద్యప్రౌఢి సౌలభ్య శై
  లిని సద్భక్తి భజించి ; కీర్తి వనితాశ్లేషాప్త సద్భాగ్య శీ
  లిని శ్రీనాథ కవీంద్రు చాటు కవితా లీలా చమత్కార వా
  గ్ధను బూజించి ; మహాంతరార్థయుత సత్కావ్యాను సంధాను బె
  ద్దన బాండిత్య నిధిన్ నుతించి ; సుగుణోద్యత్ కీర్తి పాత్రున్ సుధీ
  జన చిత్తప్రియు రామకృష్ణకవి సంశ్లాఘించి ; పేర్మిన్ మన
  మ్మున నత్యద్భుత భావసంయుత ' కళా పూర్ణోదయ స్రష్ట ' సూ
  రన విద్వత్కవి , ద్వ్యర్థి కావ్యరచనా ప్రాజ్ఞున్ ప్రశంసించి ; భూ
  వనితా కాంతుని నాంధ్రభోజ బిరుద భ్రాజిష్ణు శ్రీ కృష్ణ రా
  యని సంప్రీతి స్మరించి పూర్వకవి సమ్యక్ రీతి  సారస్వతా
  ర్చనమెల్లన్ గణియించి వారల సుధీ సంపన్నతన్ మెచ్చెదన్ !!!

3 కామెంట్‌లు:

  1. కవి ప్రశస్తి బాగున్నది. కవి రాజులు ముందు నడవగా రాజకవి రాయలవారి ప్రవేశం!

    రిప్లయితొలగించండి
  2. @ మందాకిని గారు
    సూక్ష్మం గ్రహించినారు...ధన్యవాదాలు !!!!..... పరితృప్తోస్మి......!!!!! :)

    రిప్లయితొలగించండి
  3. ఈ మాలిక వ్రాసినప్పటి నా ఆలోచనలు ఒక్క సారి మరలా----

    తెలుగు కవిత్వమనే ప్రక్రియ మొత్తాన్ని ఒక చెట్టు అనుకొంటే......అది యింత శాఖోపశాఖలుగా విస్తరిల్లక మునుపు, ఒక చిరు మొక్కగా నున్న దశలో, దానికి పాదు తీసి,నీరు పోసిన మహానుభావుడు నన్నయ - ఆదికవి కాబట్టి.

    ' తిక్కన్న శిల్పంపు తెనుగు తోట '- విశ్వనాథ వారి మాట ...అందుకే ' పద్య శిల్ప ఘన యజ్ఞ శ్లాఘ్య నిర్వాహకున్ ' అనడం జరిగింది ....పద్య శిల్పమనే యజ్ఞాన్ని గొప్పగా నిర్వహించేవాడు అని...యజ్ఞమనే పోలికే యెందుకంటే , ఆయన తిక్కన సోమయాజి కదా మరి !!!

    ఎఱ్ఱన ను ప్రబంధ పరమేశ్వరుడంటారు కదా అందుకని ఆ ప్రబంధ పదాన్ని చేర్చడం ఆయన విశేషణాల్లో !

    సరే! పోతన మందార మకరందం వినని తెలుగు వాడెలాగూ వుండడు...అదే ఆయన కవిత్వ విశేషణం !

    శ్రీనాథుడు రసిక కవివరేణ్యుడని అందరికీ తెలిసినదే కదా.....మరి " కీర్తి వనితాశ్లేషాప్త సద్భాగ్య శీలి " అంటే కీర్తి అనే స్త్రీ కౌగిలిని పొందగలిగిన అదృష్టశాలి అని.....మరాయనకు అలాంటి విశేషణాలే ఔచిత్యం కదా !!!
    అందులోనూ చాటు కవితలకు పెట్టింది పేరాయన !

    సరే.....పెద్దన మనుచరిత్రలోని అంతరార్థాలను గురించి తెలియని వారెవరు? తవ్వినకొలదీ బయటపడుతూనే వుంటాయి కదా !

    రామకృష్ణుడంటే తెలుగింట ఆబాలగోపాలానికీ ప్రియమైనవాడే కదా .....

    ఒకే పద్యానికి ఒకలా చదివితే రామాయణార్థమూ , మరోలా విరిచి చదివితే భారతార్థమూ ,వచ్చేలా చేయాలంటే యెంత విద్వత్తూ,మరెంతటి కవిత్వ సంపదా కావాలి? అందుకే ఆ సూరన విద్వత్కవి

    ఇక యింత మంది కవి రాజుల తరువాత రాజకవి ప్రవేశం...(మందాకిని గారి మాటల్లోనే )
    ఆంధ్రభోజ బిరుదం తో ప్రకాశించే మహా చక్రవర్తి ......అదీ సంగతి.....

    ఏదో మరొక్కసారి వుబుసుపోక విడమరిచి చెప్పానండి .....పాఠక మహాశయులకు తెలియదనీ కాదు....తెలుసుకోలేరనీ కాదు...మన్నింతురు గాక !

    రిప్లయితొలగించండి