9, ఫిబ్రవరి 2011, బుధవారం

సీతా మాతా ! అపరాధ క్షమాపణ స్తోత్రం !

"సీతాయాః చరితం మహత్ " అని కవి శ్రేష్ఠుల్ ప్రశంసించి సం
ప్రీతిన్ తత్కథ గూర్చినారు గద !  మూర్తీభూత సౌశీల్యమై
ప్రాతః సంస్మరణీయమై వెలుగు అంబా ! సీత ! మన్నింపవే
మా తప్పుల్ ఒక తల్లి వోలె గనవే ! మర్యాద గాపాడవే !


అగ్నిన్ దూకి పునీతవైన జననీ ! అత్యంత దుశ్చింతనా
మగ్నంబై చరియించు మానసములన్ మన్నించి , సన్మార్గ సం
లగ్నంబై తరియించునట్లు కనవే ! లాలిత్యమున్ జూపవే
భగ్నంబైన త్వదీయ భక్తుల మనోభావంబులన్ గావవే !!!


క్ష్మాపుత్రీ ! యిది భక్త కోటికి పరీక్షాకాలమే ! తల్లినే
కోపంబూని భరింపలేని కఠినాక్రోశమ్ముతో దిట్టుచో
ఏ పుత్రుండెటు సైపగా గలడు తల్లీ ! నీ మహత్త్వంబులన్
జూపింపన్ వలె ! వేగ రావె జననీ ! శోకమ్ము మాన్పించవే !!!!   


అమ్మా ! నీ సహనమ్ము భూమికి సమంబై యొప్పు ; ప్రేమో? అనం
తమ్మై అంబరమంటు ; నీ కృప వియద్గంగా సమానమ్ము ! రూ
పమ్మో సూర్య సమాన తేజమిక కోపమ్మో??? భరింపంగ శ
క్యమ్మా?  తీవ్ర మరుత్ప్రకంపనము ! మాతా ! " పంచభూతాకృతీ " !!!

వందే సత్య శుభాకృతీం ! ధరణిజాం ! వందే ప్రసన్నాకృతీం !
వందే శ్రీరఘు రామ పత్నిమమలాం ! వందే సుశీలాం సదా !
వందే సర్వ సుఖప్రదాం ! భగవతీం ! వందే సుభక్తార్చితాం !
వందేహం సతతం తదీయ చరణం !వందే పరాదేవతాం  !!!!

9 కామెంట్‌లు:

  1. మీ ఆవేదన ప్రస్తుతం చాలా సబబు. :)

    ఐతే, "అగ్నిపునీత" అని చెప్పేటప్పుడు "అగ్నిన్ దూకి పునీతవైన జననీ" అనటంకంటె "అగ్నిన్ పావకుఁ జేసినట్టి జననీ" అనటం ఉచితంగా ఉంటుందేమోనండీ.

    రిప్లయితొలగించండి
  2. ఎవరి అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయి. ఒక మహిళ సీతాదేవి గురించి ఏదో వ్రాసిందని ఇంతలా విమర్శించడం బాలేదు. ఆడవాళ్లు విమానాలు నడుపుతున్న ఈ రోజుల్లో ఆడవాళ్లు ఇంకా పూజలు, పురస్కారాలకే ప్రాధాన్యత ఇవ్వాలనడం భావ్యం కాదు. ఇల్లూ, పిల్లల మీదే ఎక్కువ శ్రద్ధ పెడితే జీవితాలలో గొప్ప మార్పులేమీ రావు.

    రిప్లయితొలగించండి
  3. క్షమించడంలో తన తల్లిభూమాతను మించినది సీతామాత.
    పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టుకున్నవాళ్ళకు మీ కవితా చికిత్స పనిచేస్తుందంటారా డాక్టర్‍గారూ!

    రిప్లయితొలగించండి
  4. ఇది ఒక వ్యక్తిగతమైన నివేదన. సాంప్రదాయిక కవిత్వంలో ' అపరాధ క్షమాపణ స్తోత్రం ' అనేది ఒక విధానము. అంతెందుకు? నిద్ర లేవగానే కాళ్లు నేల మీద పెడుతూన్నందుకుగానూ ' హే భూదేవి ! క్షమస్వ " అంటూ మంచం దిగే ఆచారం మనది. కనుక , నాకు నచ్చిన పద్ధతిలో , నాకు వచ్చిన మాటల్లో అపరాధ క్షమార్పణ స్తోత్రం చేశాను. వ్యక్తిగత ద్వేషాలు వద్దని మరీ మరీ మనవి. ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  5. పాపం శమించు గాక అని మనం చెప్పుకున్నట్టుగా
    చక్కటి పద్యాలతో చెప్పారు విష్ణు నందన్ గారూ!

    రిప్లయితొలగించండి
  6. అద్భుతమండీ, చివరి పద్యమైతే నిత్య పారాణయలో చదుకోవచ్చు చక్కగా

    రిప్లయితొలగించండి
  7. డాక్టర్ గారూ! 'పంచభూతాకృతీ' అంటూ సీతా మాతకు వే(చే)సిన పంచ రత్న స్తోత్ర మాల చక్కగా వెలుగొందు చున్నది.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  8. అద్భుతమైన శార్దూలపంచకమండీ.

    రిప్లయితొలగించండి