15, ఫిబ్రవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - మలిన కళంక జీవితను మైథిలి జేకొనుమయ్య రాఘవా !!!

ఎందుకో గానీ , మార్పు కోసం యీ సారి సాటి కవుల నుండి ఒక సమస్యకు పూరణలను ఆహ్వానించవలెననిపించింది.

                 మలిన కళంక జీవితను మైథిలి జేకొనుమయ్య రాఘవా!!!


ఇదీ ఆ సందర్భం . సందర్భోచిత పూరణలనాహ్వానిస్తూ ......

18 కామెంట్‌లు:

  1. శ్రీ రామునితో హనుమంతుడు పలుకు మాటలు:-

    విలువలు సిగ్గు లేని అవివేకులు పిచ్చిగ మాటలాడగన్
    తెలపగ వచ్చునే? మధుర తేనియ చేదను మూర్ఖులేగదా!
    తలపున తాను నిన్ను సతతమ్ముగఁ గొల్చును! దోషమేమి? కో
    మలి నకళంక జీవితను మైథిలిఁ జేకొనుమయ్య రాఘవా !!!

    కోమలిన్ + అకళంక = కోమలినకళంక

    రిప్లయితొలగించండి
  2. జిగురు సత్యనారాయణ గారూ , బహు చక్కని పూరణ . అభినందనలు. ఈ సమస్య నిచ్చినప్పుడు నేననుకున్న విధంగానే అదే విరుపుతో సాధించారు. ' మధుర తేనియ ' అసాధువు. " తెలపగ వచ్చునే ? భ్రమసి , తేనియ చేదను మూర్ఖులే కదా " అనో , లేక మరే యితర నగణముతోనో పూర్తి చేయవచ్చు .

    రిప్లయితొలగించండి
  3. ఇదన్యాయమండి. నేను రీడర్ లో మీ పోస్టు చదివి పూరణ రాసుకుని ఇక్కడకొస్తే, సత్యనారాయణ గారు అదే రకమైన పూరణను ముందుగానే వ్రాసేసారు. మీ ఉద్దేశ్యమూ అదని మీరంటున్నారు. సరే, విధిలేక నా పూరణను మీముందుంచుతున్నాను.

    తలఁపదు గాఁక దాశరథిఁ దక్క మరొక్కని మానసంబుఁ నె
    ట్టులయిన, బల్బజమ్ములు కడుంగడు పెంపగు సంపదల్ వినా
    చెలువుని సన్నిధానమున, శీలఁపు ప్రోది నసంశయంబుఁ కో
    మలి నకళంక జీవితను మైథిలిఁ జేకొనుమయ్య రాఘవా!!!

    రిప్లయితొలగించండి
  4. రవి గారూ , మీ పూరణ చాలా చక్కగా అమరినందులకు అభినందనలు. ' శీలపు ప్రోది ' చక్కని ప్రయోగం. ఇకపోతే , యిచ్చిన ప్రశ్నకు సమాధానం ఒక్కటే అయినప్పుడు , ఆ ఒక్క సమాధానం ఎవరు సరిగ్గా వూహించినా వారంతా కృతకృత్యులయినట్టే కదా !!! కాబట్టి ఆ లెక్కన మీకూ నూటికి నూరే !

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా! అంతంత మాత్ర పరిజ్ఞానంతో ఆపుకోలేని ఉత్సాహంతో చేసిన ప్రయత్నమిది:

    కలనయినన్ తలంచి యెరుగన్ పరులన్ మరి నీవెరుంగవే
    చెలువుడ! యొక్క పామరుని చెల్లని మాటల నెన్ని, కల్లలన్
    దెలిసియు, నన్ను కారడవి దించుట పాడియె? యెట్టులైతి నే
    మలిన కళంక జీవితను? మైథిలిఁ జేకొనుమయ్య రాఘవా!

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ ! అద్భుతం !!! ఇచ్చిన లెక్కకు ఒకే ఒక పద్ధతిలో సమాధానం వస్తుంది అంటే కాదూ ఇలాక్కూడా చేయొచ్చు కదండీ అని పలక మీద వ్రాసి చూపించినట్టుంది ( " ఆర్యా! అంతంత మాత్ర పరిజ్ఞానంతో ఆపుకోలేని ఉత్సాహంతో చేసిన ప్రయత్నమిది " అనడం వలన !!! )
    ఇది చాలా ఆర్ద్రతతో కూడిన రమణీయమైన భావం . బహు చక్కని పదజాలం. సుందరమైన పూరణ. అందుకోండి మనః పూర్వక అభినందనలు !!!

    అన్నన్నా ! అబ్బురమీ
    విన్నాణము ! పూరణమ్ము వింతగ దోచెన్ !
    కన్నారము మీ ధీ సం
    పన్నత నీకవిత లోన ; భళి ! మిస్సన్నా !!!

    రిప్లయితొలగించండి
  7. ఆర్యా ధన్యవాదాలు.
    కానీ మీరన్న విన్నాణము, ధీ సంపన్నత అంత గొప్పగా ఏమీ లేవు నా దగ్గర.
    ధన్యుడనైతిని విష్ణునందనా!

    రిప్లయితొలగించండి
  8. కాస్త ఆలస్యంగా చూసాను ఈ పోస్టును.
    జిగురు వారి, రవి గారి పూరణలు బాగున్నాయి. మిస్సన్న గారి పూరణ అత్యుత్తమం. మీ విశ్లేషణ నాకు ఆదర్శం.

    రిప్లయితొలగించండి
  9. విలసితమైన శంకరుని విల్లును ద్రుంచి యశంబు నాల్గు ది
    క్కులఁ బ్రసరింపఁ జేసిన యకుంఠితవీర్యుఁడవే! త్వదీయ కో
    మలపద మంటగా శిలయె మాలిని గాఁగ నహల్యఁ బ్రోచెతే
    మలిన కళంక జీవితను; మైథిలిఁ జేకొనవయ్య రాఘవా!

    రిప్లయితొలగించండి
  10. ఇది కమనీయ పూరణ మహీన బలాఢ్యము శైవ చాపమున్
    బదునుగ నొక్కమారు రఘు నాథునిచే విరుగంగ జేసి , ఆ
    తదుపరి గౌతమర్షి దయితన్ స్మరియింపగ జేసి సమ్ముద
    మ్మొదవగ గూర్చినార లిదివో కయిమోడ్పులు శంకరా ! సుధీ !!!

    ఈ చంపకమాల మీ మెడలో వేయవలసిందే !!!

    పరమోత్తమమైన పూరణ . ధారా శుద్ధి , శయ్యా సౌభాగ్యమూ కలగలసి భావ సౌందర్యాన్ని యినుమడింపజేస్తూన్న పూరణ. అభివందనాలు శంకరయ్య గారూ !!

    రిప్లయితొలగించండి
  11. ఆర్యా,
    ధన్యావాదాలు. మిమ్మల్ని మెప్పించ గలిగిన ఆనందంలో నాకు ఇంతకంటె పదాలు దొరకడం లేదు.

    రిప్లయితొలగించండి
  12. ఒక ఉద్దండ పండితులిచ్చిన సమస్య, మరొక ఉద్దండ పండితుల పూరణ,
    మరల మొదటివారి ప్రశంస వెరసి చదివే వారి సౌభాగ్యం.
    ఆర్యా! గురువుగారూ! మీ యిరువురి సహృదయత శ్లాఘనీయం.
    బ్లాగు దర్శకులం ధన్యులం.

    రిప్లయితొలగించండి
  13. విష్ణు నందన్ గారికి నమస్కారములు.ఈ రొజే మీ బ్లాగు చూడడం జరిగినది.మీ బ్లాగున నా మొదటి పూరణ ఎటులైనా పంపవలెనని పూరించి పంపుచున్నాను.
    పైనున్న పండిత పూరణల సరసన ఉంచే అర్హత వుందంటారా?
    ----------------------------------------
    నిలిపెను మానసంబునను నీదరహాసపు రూపు, ఓర్పు తో
    కలిగిన పెక్కు కష్టముల కాచెదవంచును సైచియుండె, తా
    నలుకలుబోక నేడు మరి అగ్ని పరీక్షకు నిల్చె, ఈమెయా!
    మలిన కళంక జీవి?తను మైథిలి!చేకొనుమయ్య రాఘవా!


    గోలి హనుమచ్చాస్త్రి.

    రిప్లయితొలగించండి
  14. అందరిపూరణలూ అలరించాయి.
    హనుమచ్ఛాస్త్రి గారూ! మీరు ఘంటాపథంగా చెప్పారండీ అమ్మవారి గురించి!
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శాస్త్రి గారు , స్వాగతము . చాల చక్కని పూరణము . హాయిగా సాగిపోయిన కవన ధార. ఇంపయిన పదాల పోహళింపు . భేష్ . మీ పూరణా సామర్థ్యం ఎరిగున్నవాడిగా మీకు ఇచ్చట ఉత్తమ స్థానం దొరుకుతుందనడంలో ఏ సందేహమూ లేదు. ఈ పూరణను ఆధునిక కవి భావజాలం నుండి చూస్తే నూటికి నూటా పది మార్కులివ్వాలి . ఎందుకంటే ఇది నేనే మాత్రం వూహించని విరుపు. చాలా బాగుంది.
    ప్రాచీన కవిభావజాలం నుండి చూస్తే ' తను ' శబ్దం మనమనుకున్న ప్రథమా ఏకవచనం క్రిందకు రాదు . తా , తాను ఇవీ ఆ రూపాలు . నాకు తెలిసినంతలో " తను " శబ్దప్రయోగం ఆధునిక వాఙ్మయ లక్షణం . పనిలో పని సందర్భవశాత్తూ , " అతను " అనే శబ్దం "అతడు " కు పర్యాయపదం గా చూస్తూంటాము లౌకికంగా . అది కూడ ప్రాచీన వాఙ్మయంలో కనపడదు . ఇంత సోదాహరణంగా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే మీరు సహృదయులు కనుక , అన్యథా భావించరని నమ్మకం వలన, చదివిన మరొక ఒకరిద్దరికి కూడ తెలుస్తుందనే ఉద్దేశం తోనూ . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  16. జి ఎస్ జీ !
    రవీజీ !
    మిస్సన్న మహాశయా !
    శంకరార్యా !
    శాస్త్రీజీ !
    ఒక దానిని మించి మరొకటి
    అద్భుతంగా ఉన్నవి
    మీ మీ పూరణలు !
    అందరికీ అభినందనలు !

    చక్కని సమస్య నిచ్చిన
    విష్ణునందనులకు
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  17. మందాకిని గారు ధన్యవాదాలు !

    వసంత మహాశయా ! అందరు కవిమిత్రుల పక్షాన , మీకివే కృతజ్ఞతానీకం !!!

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి.

    డా.విష్ణునందన్ గారికి నమస్కారములు.నా పూరణను ఆధునిక దృక్కోణముతో చూచి స్వీకరించినందులకు ధన్యవాదములు.వ్యాకరణము గురించి అంతగాతెలియని నాకు మీరు సవివరముగా చెప్పినందులకు చాలా సంతోషము."కలము హలములందు ఘనుడురా పోతన్న" అన్నట్లు మీరు డాక్టరు గారు కనుక "పథ్యము గురించి మరియు పద్యము గురించి" రెండు చెప్పుటలో ఘనులని నా అభిప్రాయము.మీరు అన్యధా భావించవలదని మనవి.

    పూరణలు రమ్యముగా పూరించిన శంకరం మాస్టారు గారికి, సత్యనారాయణ గారికి, మిస్సన్న గారికి, రవిగారికి అభినందనలు.నా పూరణను ప్రశంసించిన మందాకిని గారికి,వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి