2, మార్చి 2011, బుధవారం

శివోహం ! శివోహం !!!

సుర నిమ్నగా జటా జూటంబు తోడ , శీ
   ర్ష న్యస్త శశిధర ప్రభల తోడ ;
ఫాల నేత్రము తోడ , ఫణిభూషణము తోడ ,
   హస్తి చర్మోత్తరీయంబు తోడ ;
భస్మాంగ రాగ విభ్రాజితాంగము తోడ ,
   లంబితంబగు కపాలంబు తోడ ;
సునిశితంబైన త్రిశూలాయుధము తోడ ,
   ఢమఢమ ధ్వని యుక్త ఢక్క తోడ ;

ఘన కకుద్యుక్త నంది వాహనము తోడ
వెలుగు నెవ్వండు ? వాడె సర్వేశ్వరుండు !
నిర్వికల్ప చిదానంద నియత మూర్తి 
మహిత దీప్తిచ్చటా ప్రభామయ విభూతి !!! 



( ఆకాశ గంగను బంధించిన జటాజూటం తోనూ, తలపైన అలంకరించబడిన చంద్రరేఖ వెలుగు జిలుగుల తోనూ , ముల్లోకాలనూ భస్మీపటలం చేయగల ఫాలనేత్రము తోనూ , ఆభరణాలుగా  ప్రకాశించుచున్న సర్ప రాజములతోనూ , వసనంగా చుట్టుకున్న గజ చర్మం తోనూ , శ్మశాన భస్మమనే మైపూత నలమిన ప్రకాశమానమైన శరీరం తోనూ , వేలాడదీయబడిన కపాల మాల తోనూ , వాడియైన త్రిశూలం తోనూ , ఢమఢమ ధ్వానాలు వెలువరించే ఢక్క తోనూ , గొప్పనైన మూపురం తో ఒప్పారే నంది వాహనంతోనూ వెలుగొందేవాడెవ్వడు?? నిర్వికల్ప చిదానంద మూర్తి , మహిత ప్రభాకలితమైన ఐశ్వర్యమూ అయిన ఆ సర్వేశ్వరుడే !!!! )

11 కామెంట్‌లు:

  1. విష్ణు నందన్ గారూ!నమస్కారములు.

    పద్య మందు భవుని ప్రభలనే వెలిగించి
    శివుని జూపినారు సీసమునను
    పర్వ దినము నందు పండుగే మాకాయె
    శుభము లిచ్చు గాక అభవు డిపుడు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  2. శివరాత్రి పర్వ దినాన శివున్ని దృశ్యమానం చేసిన మీ సీస పద్యం చాలా హృద్యంగా ఉంది .

    రిప్లయితొలగించండి
  3. ఆహా! శివుని తలపైని గంగలా అద్భుతమైన ధార. మీరు విష్ణునందనులే కాదు, ఈశ్వర నందనులు కూడాను.

    రిప్లయితొలగించండి
  4. శివరాత్రి సందర్భంగా అద్భుతమైన పద్యాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. బాగుందండి. సంయుక్తాక్షరాల వాడుక పద్యానికి ఒక గాంభీర్యం తెచ్చి పెట్టింది, పైకి చదువుతున్నప్పుడు.

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రి గారూ , పద్యం చాలా బావుంది. ధన్యవాదాలు .

    పీతాంబర్ గారూ , కృతజ్ఞతలు .

    రవి గారూ మీ ప్రశంసా పూర్వక వచో ధారకు కృతజ్ఞతలు.

    శంకరయ్య గారూ , నమామి . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  7. ఆర్యా పద్యం చదువుతూంటే శివ స్వరూపం కన్నులకు గట్టుతోంది.
    నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  8. కొత్త పాళీ గారూ , కృతజ్ఞతా సహస్రం !!!

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ బహుధా ధన్యవాదాలు . రసజ్ఞులైన తమబోటి పాఠకోత్తములెందరో లభించడం మత్పురాకృత శుభాధిక్యమేమో !!!

    రిప్లయితొలగించండి
  10. విష్ణునందన్ గారు,
    చాలా బాగా వర్ణించారండీ శివయ్యను.

    రిప్లయితొలగించండి