1, సెప్టెంబర్ 2011, గురువారం

కదలి రావయ్య భువికి మా గణపతయ్య !!!

వక్రతుండంబు నిర్వక్రమై సర్వ కా
           ర్యక్రమ ఫల సిద్ధి రహి నొసంగ ;
నేక దంతంబు లోకైక రక్షా కరం
           బై విఘ్నతతి జీల్చి వైచి బ్రోవ ;
శూర్ప కర్ణము కరుణార్పితంబై పాప
           వితతి దూరమ్ముగా విసరి వేయ ;
లంబోదరమ్ము సాలంబనమ్మై జగ
           త్త్రయ పోషణ విధాన నియతి గూర్ప ;


గజముఖము భక్తతతికి దిగ్విజయమొసగ ,
మందగమనము సంతతానందమొదవ,
కదలిరావయ్య భువికి మా గణపతయ్య !
కుడుములను మెక్కి తీర్పగా నిడుములెల్ల !!!

అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలతో .......

6 కామెంట్‌లు:

  1. విష్ణు నందన్ గారూ, మీ పద్యం చాల బాగుంది. నాకు పద్యం రాదు. అంతా గద్యమే.

    వంక పెట్టలేని మీ పద్యంబొక వంక
    వంక తొండమును వర్ణించె మరొక వంక
    వంక జూపుల నవ్వుకు శపించబడె నెలవంక
    వంకర బుద్ధుల కుంకా, సాగవు అవి నా వంక
    శంక గల జనులు నిను గనరు నా పూజ సేయకుండ
    శంకరనందను స్మరియించగ దొరకును అండ దండ

    మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. అయ్యా ఎన్నినాళ్ళకి మళ్ళా మీ టపా! మనోహరం!

    రిప్లయితొలగించండి
  3. డా.విష్ణునందన్ గారూ, "మందగమనము..." చాలా బాగుంది. గణపయ్య కనిపించాడు. శివకేశవ భేదం పాటించక శంకరయ్య గారి బ్లాగుకి రండి స్వామీ:). మీ పూరణ మెరుపులు, వ్యాకరణ పాఠం మెరుగులు, మిస్ అవుతున్నాము. భవదీయుడు-చంద్రశేఖర్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ విష్ణునందన్ గారికి నమస్కారములు. మరియు విజయ దశమి శుభాకాంక్షలు. చాలారోజుల తరువాత మీ ' సిరంజిని' ప్రక్కన పెట్టి వ్రా"సిరంజిం" ప జేసిన మీ పద్యమును చూసే భాగ్యం కలిగించారు. ధన్యవాదములు.
    ఒక్క సారి నా బ్లాగును సందర్శింప గోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య గారు , సూర్యనారాయణ గారు , మిస్సన్న గారు , చంద్రశేఖర్ గారు , హనుమచ్ఛాస్త్రి గారు , అందరికీ మరీ మరీ ధన్యవాదాలు - ఈ మధ్య బొత్తిగా తీరిక సమయం లేక , ఆలస్యం గా స్పందించినందులకు అన్యథా భావింపక , మన్నింప ప్రార్థన !

    రిప్లయితొలగించండి