26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి - చుట్టుముట్టిన శాపావళి

ఉద్యమమ్ములు నేటి విద్యార్థి భవితపై
      నీలినీడలు గ్రమ్ము కాలమిద్ది ;
విద్యుత్ప్రవాహమ్ము వెలితియై రైతు క
      ష్టాల పాలైనట్టి సమయమిద్ది ;
జ్వర రోగ పీడ దుర్భరమై జనావళి
      తలడిల్లి కుందెడి తరుణమిద్ది ;
వైషమ్య భావ విద్వేషాగ్ని రాష్ట్రమే
      విలపించి కుమిలెడి వేళ యిద్ది ;


అకట దుస్సహమైన గాఢాంధకార
మలుముకున్నది ; మనసులు కలత జెంది
వగచు నిత్తఱి నే రీతి స్వాగతింతు 
రమ్య దీపావళీ నిన్ను రమ్మటంచు ?!!! 


అయిననెక్కడో యొక మూల నాశ కలదు
వెలుగులను విరజిమ్ము దివ్వెలను బేర్చి -
తిమిరమును ద్రోలగా స్వాగతింతు నిన్ను
రమ్ము దీపావళి ! సుఖమ్ము తెమ్ము మాకు !!!


యావజ్జనావళికీ దీపావళి శుభాకాంక్షలు !!!!

4 కామెంట్‌లు:

  1. విష్ణు నందన్ గారు,
    మీరు దీపావళికి ఆహ్వానము పలికిన తీరు బాగుంది. కవి ఆశావాది కావాలంటారు. కాబట్టి మీ 3వ పద్యము సమంజసముగా ఉన్నది. మీ (మా) ఆశలు తీరాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. మీకు మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. జిగురు సత్యనారాయణ గారూ ,
    సూరి ఉలిమిరి గారూ మరియు శ్యామలీయం గారూ - బహుధా ధన్యవాదాలు ! ఆలస్యమైన ప్రతిస్పందనకు క్షంతవ్యుడను .

    రిప్లయితొలగించండి