21, డిసెంబర్ 2010, మంగళవారం

" పట్టు పుర్వుల నిర్వేదం "

*  ఒక నిశీథిని నిద్ర పట్టక కలంచి
   పట్టు పానుపు నెక్కి నేనట్టులిటుల
   పొరలి యొక స్వప్నసీమలో నరసినాను
   పట్టు పుర్వుల లోకమ్ము తుట్టతుదకు !!!

* నన్ను గారవించి మన్నన జూపించి
  యున్నతాసనమ్ము విన్నవించి
  తంతుకీట రాజు చింతా మనస్కుడై
  విషయమిట్లు పలికె వెరపు చెంది

* " జిలిబిలి యైన పట్టుగొని , చిక్కని చక్కని చీరలల్ల మా
   అలిబిలి జీవితమ్ములను - అంతమొనర్తురు ; పాపపుణ్యముల్
   తలపగబోరు మానవులు - తన్వికి భూషణమై ప్రకాశమై
   విలవిలలాడుచుంటిమి కవీ ! విరచింపవె మా వ్యథా కథల్ ?!

* తొల్లి పుష్పాలు విలపించె తల్లడిల్లి
  వాటి వెత విరచించె పాపయ్య శాస్త్రి
  పట్టుపుర్వులమయ్య మా బాధ ప్రజకు
  నెఱుక జేయ సమర్థుడవీవె సుకవి !!!


* ప్రాణులన్నింటిలోన నారాయణుండు
  కలడు కలడంచు నొక సూక్తి కలదు కాదె?
  మమ్ము హింసింప శ్రీహరి మానసమున
  సంతసము గల్గునే మహా చింత గాక!!!?

* బుద్ధుడు జన్మమందె నిట , బోధల సల్పె నహింస గూర్చి ; సం
  శుద్ధుడు గాంధి తాత తన సూత్రత దెల్పె నహింస ; సర్వ సం
  సిద్ధుడు కాదె క్రీస్తు ఒక చెంపను కొట్ట మరొండు చెంపనే
  క్రుద్ధుడు కాక జూపుటకు కొంత చరిత్ర పఠింపుమో నరా!!

* పుట్టిన రోజటంచు ; మది పొంగగ మెట్టిన రోజు భర్త చే
  పట్టిన రోజటంచు ; తన పట్టును వీడక నేటి నారి మా
   పట్టును  దాల్చు పుట్టముగ - పైకము వేలకు వేలు బోసి , క
  న్పట్టునె మా మనోవ్యథలు? పట్టునె మా కత లమ్మగారికిన్?

( పుట్టిన రోజని ఒక రోజూ.....మెట్టిన రోజనీ, పెళ్లిరోజని మరో రోజూ వేలకు వేలు పోసి , తన పట్టునూ , బెట్టునూ యేమాత్రం సడలించకుండా మా పట్టుదారాలతో నేసిన చీరను ధరిస్తారే? ఒక్కో పట్టు చీర ధగ ధగల వెనుక యెన్ని పట్టు పురువుల వ్యథార్త జీవన గాథలున్నాయో యేమైనా ఆలోచించారా? )

* పట్టు చీర గట్టి బహు గౌరవంబంచు
  పుడమి పైని కాంత పొంగిపోవు ;
  పరుల బాధ పెట్టి , వంశ క్షయము జేసి
  నేయు చీర గట్ట న్యాయమగునె???!!!

* పూజలందు పట్టు పుట్టమ్ములన్ దాల్చి
  అయ్య ! మీరు భగవదర్చనమున
  సేయు పూజలెట్లు స్వీకరించును స్వామి?
  అఖిల భూత రక్షణాత్మకుండు!!!

* ఇంపెసలార మేము శ్రమియించుచు సుందర మందిరంబులన్
  సొంపుగ కట్టుచో నరులు చోర శిఖామణులై హరించి, వే
  ధింపుల పాలు జేయుచు వధింతురె మమ్ముల ?  వేడి నీట మా
  కొంపలు ముంచి వేయుదురె ? కోకల బేరము నందపేక్షతోన్ !!!

 ( పట్టు పురుగులు వాటి చుట్టూ ఏర్పరచుకున్న ' కకూన్ ' అనే ఆ ఇంటిని వేడినీళ్లలో వేసి ఆ పురుగును చంపి , ఆ కకూన్ నుండి పట్టు దారాన్ని వేరు చేయడం....' కొంప ముంచడం ' గా పోల్చబడింది ...)


* స్వామి ! నిద్రింపగా పట్టు పాన్పులేల?
  పట్టుబట్టలకై పట్టు బట్టుటేల?
  కొంత యోచింపుమయ్య ! సంకోచమేల?
  నా పలుకులో నసత్యమ్ము చూపగలవె?

  ( కేవలం సౌఖ్యం కోసం పట్టుపాన్పు పై పవ్వళించడం అవసరమా?? మీ పట్టుబట్టలకోసం పట్టుబట్టడం సరే కానీ ఒక్క పట్టు చీర కోసం    ఒక్క పట్టు పంచె కోసం యెన్ని పట్టు పురుగుల ప్రాణత్యాగం అవసరమో ఆలోచించారా????!!!!)

* మీ ప్రాణమ్ములటన్నన్
  అప్రియమా మీకు చెప్పుడయ్యా ? మాకున్
  మా ప్రాణమ్ముల పైన మ
  హా ప్రేమ యటన్న నేరమా ? ఘోరమ్మా?

 (మీ ప్రాణాల మీద మీకెంత ప్రేమో......మాకూ మా ప్రాణాల మీద అంతే ప్రేమ అంటే అదేమైనా నేరమా??? ఘోరమా???? ఆలోచించండి )

* పులి సింహాదులకే నరు
  లిలలో ' రక్షణ వనాల ' నేర్పరచిరి ; ఆ
  పులి సింహంబులు క్రూర మ
  తులు ; మే మతి సాధువులము ; ద్రోహము మాకా???

 ( పులి సింహాల వంటి క్రూర జంతువులకే అభయారణ్యాలు ఏర్పాటు చేశారు కదా...మరి...అత్యంత సాధు జీవుల మైన మా పట్ల మాత్రం యింత ద్రోహమెందుకు ??? )


* మా జీవితముల పై నిటు
  మీ జాతి కదేల కక్ష ? మీ దయ మా పై
  ఈ జన్మకు రాదా ? మీ
  ప్రాజాపత్యమ్ము నాపి రక్షింపవయా !!!

 ( ప్రాజాపత్యము = అధికారం )

* పెంచు వారి ప్రేమ ప్రియమైనదను మాట
  మృషయె ; మాకు మంచి మేత పెట్టి
  పెద్ద జేసి పిదప , వేడి నీటను వేసి
  చిదిమివేయ నెట్లు చేతులాడు ???

    ( లోకంలో పెంచిన ప్రేమ గొప్పదని అందరూ అంటూ వుంటారు కదా....అదేమంత నిజం కాదు లే.....మమ్మల్ని పెంచి ,మంచి మేత పెట్టి ,    పెద్దజేసిన మీరే మా జీవితాలను చిదిమి వేస్తారు కదా....చేతులెట్లా వస్తాయయ్యా? )

* ఇంత ప్రాధేయపడిన నీకేల రాదు
  జాలి ? నర ! నరకమునకు జనెదవేల?
  మమ్ము పీడించి , హింసించి , మట్టుబెట్టి
  బావుకొనునదేమి పాపమ్ము తప్ప!!!! "


* అని పట్టు పుర్వు పలుకగ
  వెనువెంటనె మేలుకొంటి ; వికల స్వాంత
  మ్మున తద్విషాద గాథన్
  గొని యొక ఖండికను నేను గూర్ప దలచితిన్ !!!!

(జంధ్యాల వారి స్ఫూర్తితో  ఇది నా పదిహేనవ యేట రచించిన ఖండిక ! అందుకు తగినట్లే రచనలో అపరిపక్వత సుస్పష్టము ......యథాతథంగా  అప్పటి నా శైలిని అలాగే నిలపడం కోసం !!!!!  )

9 కామెంట్‌లు:

  1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం22 డిసెంబర్, 2010 8:34 AMకి

    అధ్భుతం డా. విష్ణు గారూ,
    పుష్పవిలాపం గుర్తుకు రావడమే కాకుండా కళ్ళు చెమర్చేశేటట్లు చేసారు (మీ పద్య కవితా ఝురి కి, పట్టు పురుగుల విలాపానికీ)
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  2. @ మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు
    మీ ప్రోత్సాహం కడు విలువైనది !!!! కృతజ్ఞతలు !!!!

    రిప్లయితొలగించండి
  3. విష్ణునందన్ గారూ, కీటకంలో కూడా ఆత్మను దర్శించిన మీ కవి సహృదయానికి జోహార్లు. చక్కని శైలి.

    రిప్లయితొలగించండి
  4. @ మిస్సన్న గారు
    ధన్యవాదాలు ...... మశకం నుండి మానవుడి వరకూ ఆత్మ తత్వాన్ని దర్శించడమే కదా సనాతన ధర్మం.....కృతజ్ఞతలు !!!!

    రిప్లయితొలగించండి
  5. విష్ణునందన్ గారూ,కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపము వలె హృదయ విదారకముగా కరుణా రసాన్ని చక్కని కవితలో నింపారు. అహింసలో నమ్మక మున్న వారు పట్టుబట్టలు కొనకూడదు. ఆ పాపము మరల చేయరాదని యీ మధ్యనే నిశ్చయించుకొన్నాను. మీ కవిత నా నిశ్చయాన్ని బలపరుస్తున్నది.

    రిప్లయితొలగించండి
  6. @ గన్నవరపు వారూ
    ధన్యవాదాలు ..... మీ నిర్ణయం సబబే....అభినందనలు .....అయితే యీ మధ్య కృత్రిమమైన ( సింథటిక్ ) పట్టుబట్టలు కూడా వున్నవనుకొంటాను.....అవయితే నియమభంగం కాకుండ , వ్రత భంగమూ కాకుండ సరిపోతుందేమో మరి!!!!

    రిప్లయితొలగించండి
  7. నేను బెంగుళూరు లో వుండే రోజుల్లో, మా ఇంటి ఓనర్ కి పట్టు పురుగుల వ్యాపారం వుండేది. వాళ్ళబ్బాయి నాకు పట్టు యెట్లా తీస్తారో వివరించి చెప్పినప్పుడు కళ్ళనీళ్ళు వచ్చాయి. మరలా మీ పద్యాలు చదివినప్పుడు అదే అయింది.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారు , ధన్యవాదాలు !!! ఈ పట్టుపురుగుల గురించి కొన్నాళ్ల క్రితం ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా ఉన్న రోజుల్లో , మా ఉపాధ్యాయులు చెప్పగా విని బాధ పడిన రోజులు గుర్తు వచ్చాయి . ఆ తరువాత అదే ఈ ఖండిక గూర్చడానికి ప్రేరణమయ్యింది .

    రిప్లయితొలగించండి
  9. Ye vayassuki aa saili. Baagundi .Manassulo sunnitatwaanni, maanavatvaanni melukoluputundi. Mee paandityaanni prasansinchi teeraalsinde! Vruthi, Pravruthi veru veru gaa, andamgaa yela untaayo ...mimmalnu choostene telustundi.

    రిప్లయితొలగించండి