17, డిసెంబర్ 2010, శుక్రవారం

నమో వేంకటేశం!!!

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగదైవమైన ఆ శ్రీవేంకటేశ్వరుని ధ్యానిస్తూ

సుర దిక్పాలక సర్వ మౌనిగణ రక్షో యక్ష గంధర్వ కి
న్నర కింపూరుష సేవితామల మహా జ్ఞాన స్వరూపా ! నిరం
తర సద్భక్త శుభ క్రమాకలన సంధానా ! విభో ! వేంకటే
శ్వర ! నీ పాదయుగమ్ము గొల్తును మదాశా పూర్తి సంసిద్ధికై !!!!

( సురులూ , దిక్పాలకులూ , సకల మునిజనాలూ , రాక్షస , యక్ష , గంధర్వ ,కిన్నర , కింపురుషాది సకల గణాలచే సేవింపబడే శుద్ధ జ్ఞాన స్వరూపమైనటువంటి వాడా!!!! నమ్ముకున్న సద్భక్తులకు నిరంతరమూ శుభ క్రమాల వరుసలను చేకూర్చే మహా ప్రభో !!!! శ్రీ వేంకటేశ్వరా!!!నా ఆశాపూర్తి చేయుటకు నిన్నే శరణు వేడెదను స్వామీ !!! )  

అంటూ ప్రశంసించి మున్నెన్నడో ' శంకరాభరణ ' మందునొసంగబడిన " నయా , కియా , దియా , గయా " లనే పదాలతో

" వినయాంభోధి తరంగ శీకరములావేశించి హృద్వీధిలో
వనమాలాంకిత వేంకటేశునికి  యావచ్ఛక్తి సంప్రీతి పూ
జనముల్ సేయుచు చందనమ్మలది యా సన్మంగళాకారు నే
ననయంబున్ నుతియింతు నిక్కముగ ! యాజ్యంబైన తద్రూపమున్!!!!

( వినయమనే మహాసముద్ర తరంగాల చెమ్మ నా హృదయానికి వ్యాపించి భక్తిభావం నిండగా , వనమాలా సంయుతుడైన ఆ శ్రీ వేంకటేశ్వరునికి యావచ్ఛక్తి ధ్యాన ,ఆవాహనాది షోడశోపచార పూజావిధి నిర్వర్తించి , ఆ లసన్మంగళాకార స్వరూపానికి భక్తితో చందన చర్చ చేసి , శ్రద్ధతో యజ్ఞము చేయదగిన రూపము గలిగిన ఆ స్వామినే నిరంతరమూ నుతియిస్తాను!!!!)

అంటూ మరొక్కమారు మనసా వాచా కర్మణా ప్రణమిల్లుతూ ...... స్వస్తి!!!!!

5 కామెంట్‌లు:

  1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం17 డిసెంబర్, 2010 4:00 PMకి

    గోవిందా... హరి గోవిందా... - బాలు మంత్రిప్రగడ

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు.పర్వవ దినాన భగవంతుని స్తుతింప జేసినందుకు ధన్య వాదములు. వైద్య వృత్తిలొ ఉండి ఇంతటి పాండిత్యాన్ని కలిగి ఉన్న మీ ఘనత పండితులైన ప్రముఖలందరి కలాలనుంచి జాలు వారిన ప్రసంసలను చదువుతుంటే ,కనీసం చదవ గల అదృష్టం నాకు లభించి నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ రంతా సరస్వతీ పుత్రులు. పాండితీ స్రష్టలు. మీ రంతా అందించె సాహిత్యపు వెన్నెల వెలుగు కిరణాలు సోకితె చాలు జన్మ ధన్య మౌతుంది.సెలవు

    రిప్లయితొలగించండి
  3. @ మిస్సన్న , దుర్గేశ్వర , మంత్రిప్రగడ
    ధన్యవాదాలు !!!

    @ రాజేశ్వరి నేదునూరి
    నమోవాకం ప్రశాస్మహే !

    రిప్లయితొలగించండి