సంసార భయజ్వలన
ధ్వంసన ఝంఝానిలమ్ము ధార్మిక సుగుణో
త్తంసుని పాద ధ్యానమె
శంసా పాత్రము జయేంద్ర సద్బోధనమే!
సన్యాసమ్మును స్వీకరించి యతిరాట్చంద్రుండునై సత్కృపా
జన్యంబౌ చిరునవ్వు మోము పయి నిచ్చల్ కొల్వుదీరంగ ధ
ర్మ న్యాయంబుల శిష్యకోటికి జయేంద్ర స్వామి బోధింపగా
ధన్యత్వంబును గాంచె నీ పుడమి యద్వైత ప్రభాకీర్ణమై!
మనుజాకారము దాల్చి శంకరుడు సమ్యగ్వేద విద్యా స్వరూ
ప నిధిన్ స్వామి జయేంద్రుడై యొసగె విద్వద్వైదికామోదమై
తనరన్ జెంతకు జేరు వారలకు; జింతల్ వంతలున్ దూరమై
పునరావృత్తి నశించి శాశ్వత మహా పూర్ణజ్ఞతల్ గల్గగన్!
కాంచీ దేశమునందు నిల్చి జనతా కల్యాణమున్ గూర్చి చిం
తించెన్ సంయమియౌ జయేంద్రుడు - ప్రసాదించెన్ సుధీ శక్తి సా
ధించెన్ సార్వజనీన విద్య- గృప నందించెన్ గదా వైద్యమున్
గాంచెన్ సర్వ సమాన భావనలతో గ్రాలంగ నీ దేశమున్!
పరమాచార్య కరాబ్జ జాతుడు తపస్స్వాధ్యాయ పూతుండు శాం
కర సిద్ధాంత విశారదుండు విలసత్కాంచీ మహా పీఠికా
దరణీయాధిపుడౌ జయేంద్రుడు యతీంద్ర స్వామి శిష్యాళిపై
కరుణాపూరము జిమ్ము గావుత జగత్కల్యాణ సంధాతయై!!!
(శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి చరణ కమలములకు సభక్తికంగా సాష్టాంగ ప్రణామాలతో)